- విధ్వంస స్థితినుంచి వికాసానికి చేరుకున్నాం
- సాధించిన ప్రగతిని నిలబెట్టుకోవాలి..
- అందుకు కలెక్టర్లు చిత్తశుద్దితో పనిచేయాలి
- రూ.21లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడం రికార్డు
- పీపీపీ విధానంలోనే మెడికల్ కాలేజీలు..
- దీనిపై రౌడీయిజం చేస్తామంటే కంట్రోల్ చేస్తాం
- పీపీపీ రద్దుతో విద్యుత్ వ్యవస్థను నాశనం చేశారు
- అత్యుత్తమ పాలనా విధానాలే కూటమి లక్ష్యం
- కలెక్టర్ల సదస్సు ముగింపులో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన
- వివిధ అంశాలపై యంత్రాంగానికి దిశానిర్దేశం
అమరావతి (చైతన్య రథం): దెబ్బతిన్న ఏపీ బ్రాండ్‌ను 18 నెలల కాలవ్యవధిలో తిరిగి తేవడం ఒక ఎత్తయితే.. రూ.21 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదుర్చుకోవడం రికార్డని సీఎం చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. సాధించిన ఏపీ బ్రాండ్‌ను పదిలపర్చుకునే విషయంలో జిల్లా కలెక్టర్లు చిత్తశుద్ధితో పనిచేసి సహకరించాలని చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. రెండురోజుల పాటు సాగిన 5వ జిల్లా కలెక్టర్ల సదస్సు ముగింపులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వివిధ అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ముగింపు ఉపన్యాసంలో పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు సహా వివిధ అంశాలను ప్రస్తావించిన ముఖ్యమంత్రి.. అత్యుత్తమ పాలనా విధానాలే కూటమి లక్ష్యంగా ప్రకటించారు. సదస్సు ముగింపు సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ‘‘రూ.21 లక్షల కోట్ల పెట్టుబడులకు రికార్డుస్థాయిలో ఒప్పందాలు కుదిరాయి.
విద్యుత్ కొనుగోలులో యూనిట్‌కు రూ.1.20మేర తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పీపీపీ మెడికల్ కళాశాలలు నిర్మించేందుకు ముందుకు వస్తే… అధికారంలోకి వచ్చాక జైల్లో పెడతామని కొందరు బెదిరిస్తున్నారు. ఇలాంటి కామెంట్లు చేయడం వారి రాజకీయ అజ్ఞానానికి పరాకాష్ట. పీపీపీతో అభివృద్ధి జరుగుతుంది. పీపీపీ పద్ధతిన ప్రాజెక్టులు చేపట్టినా… అది ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుంది. నిబంధనలు ప్రభుత్వమే చేస్తుంది. ప్రైవేటు వారు నిర్వాహకులు మాత్రమే. సీట్లు పెరుగుతాయి. ఫీజు ఏమాత్రం పెరగదు. 70 శాతం ఎన్టీఆర్ వైద్యసేవ ప్రకారమే పేషెంట్లకు ఉచిత చికిత్స జరుగుతుంది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు రెండేళ్లలోనే సిద్ధం అవుతాయి. రాజకీయంగా విమర్శలు చేయొచ్చు కానీ, రౌడీయిజం చేస్తామంటే కంట్రోల్ చేస్తాం’’ అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. పీపీఏల రద్దుతో గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను నాశనం చేసిందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘విద్యుత్ సంస్థల్లో రూ.1,14,352 కోట్ల అప్పులు పేరుకుపోయాయి. రూ.32,166 కోట్ల టారిఫ్ భారాన్ని ప్రజలపై వేశారు. రూ.81 వేల కోట్ల అప్పులు తీసుకువచ్చారు. రూ.1,25,633 కోట్ల మేర భారం డిస్కంలు, ట్రాన్స్‌కోలపై పడిరది. కూటమి అధికారంలోకి వచ్చాక రూ.11,320 కోట్ల మేర భారం తగ్గించాం. విద్యత్ ఛార్జీలు పెంచబోమని ప్రకటించాం. ప్రజలపై భారం మోపబోవటం లేదు. రుణ నిర్వహాణ కూడా సమర్ధంగా చేస్తున్నాం. గత పాలకులు 13 శాతం వరకూ వడ్డీలకు అప్పులు తెచ్చారు. ఇప్పుడు ఆ రుణాలను రీషెడ్యూలింగ్ చేస్తున్నాం. గత 18 నెలల్లో ద్రవ్యోల్బణాన్ని తగ్గించగలిగాం. నేరాల రేటునూ నియంత్రించాం. నాటు సారా తయారీని నియంత్రించడానికి మార్పు అనే ప్రాజెక్టును తీసుకువచ్చారు. అది రోల్ మోడల్.
సారా తయారీదారులకు కూడా రీహాబిలిటేషన్ కల్పిస్తున్నారు. ఉపాధి చూపుతున్నారు. తిరుమల ప్రసాదంలో మళ్లీ నాణ్యత తీసుకువచ్చాం. అన్న క్యాంటీన్లు, పెన్షన్లులాంటి సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తున్నాయి. 18 నెలల్లో రాష్ట్రం రికవరీ అవుతుందని, రాష్ట్ర పునర్నిర్మాణం సాధ్యమవుతుందని నేను కూడా ఊహించలేదు. కలెక్టర్లు, ఎస్పీలు జిల్లాల్లో జరిగే నేరాలపై కఠినంగా వ్యవహరించాలి. వ్యక్తుల ప్రతిష్టను దిగజార్చేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే సహించవద్దు. వ్యక్తిగతంగా ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోవద్దు. జనవరి 15నుంచి అన్ని శాఖల ఫైల్స్, ప్రభుత్వ సేవలన్నీ ఆన్ లైన్‌లో ఉండాలి. అప్పుడే ప్రజలు సంతృప్తి చెందుతారు. నిన్నటి వరకూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా అత్యుత్తమ ఫలితాలు రాబట్టాం. పరిశ్రమలకు ప్రోత్సాహకం కోసం ఎస్క్రో ఖాతా విధానం తీసుకువచ్చాం. ఇక ఇప్పుడు `స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు విధానాన్ని అమలు చేయబోతున్నాం. ఎవరైనా తప్పు చేయాలంటే భయపడాలి. నేరాల దర్యాప్తులోనూ వేగం పెంచండి. వచ్చే కలెక్టర్లు, ఎస్పీల సమావేశానికి మరింతగా మార్పు రావాలి. ఇప్పటి వరకూ జరిగిన సమావేశాలన్నింటికంటే… 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమావేశం చక్కగా జరిగింది’’ అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
వివిధ అంశాలపై అర్థవంతమైన చర్చలు
సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేసనట్టే.. 5వ కలెక్టర్ల సదస్సు అర్థవంతంగా సాగింది. స్పీడ్ ఆఫ్ డెవలిరింగ్ గవర్నెన్స్ విధానానికి శ్రీకారం చుడుతున్నట్టు ఈ సదస్సు నుంచే ప్రభుత్వం ప్రకటించింది. ‘‘నెంబర్లు నమ్మను… ఆకస్మిక తనిఖీలకు వస్తానని’’ కలెక్టర్ల కాన్ఫరెన్సులోనే సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రజల సంతృప్తే అధికారుల పనితీరుకు కొలమానమన్న ముఖ్యమంత్రి, ఏప్రిల్ నుంచి సంక్షేమ క్యాలెండర్ అమలు చేయాలని నిర్ణయించారు. కేంద్ర నిధులను ఖర్చు చేయడంతోపాటు… అదనంగా రూ.5 వేల కోట్లు రాబట్టేలా ఫోకస్ చేయాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఉత్తమ పద్ధతులు అవలంభించిన ఆరు జిల్లాల కలెక్టర్లతో తొలిసారిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించిన చంద్రబాబు, ఆరు ఉత్తమ పద్దతులను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశించారు. 22ఏ భూముల పరిష్కారానికి టార్గెట్ పెట్టుకుని పని చేయాలని కలెక్టర్లకు సూచించిన చంద్రబాబు.. 22ఏ భూములను అడ్డం పెట్టుకుని వివాదాలు సృష్టించే వాళ్లపై పీడీ యాక్ట్ పెట్టాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఏపీఐఐసీకి చెందిన 82 వేల ఎకరాల భూములకు 22ఏ నుంచి విముక్తి కలిగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.
విశాఖ పరిసర ప్రాంతాల్లోని కొంతమంది రాజకీయ నేతలు భూవివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని సీఎం దృష్టికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకురావడంతో.. భూవివాదాల్లో రాజకీయ జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించవద్దని జిలా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. పట్టాదారు పాస్ పుస్తకాలు, రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లను ఇకపై కొరియర్ ద్వారానే యాజమానులకు చేర్చాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉగాదినాటికి ఫ్యామిలీ కార్డ్ జారీ, పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తెచ్చే అంశాన్ని కలెక్టర్లతో చర్చించారు. జీరో సూసైడ్స్ లక్ష్యంగా రైతులు, విద్యార్థులు, ఒత్తిడిలో ఉన్న కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇప్పించాలని సూచించిన సీఎం.. ఈనెల 28నుంచి అన్ని పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమం అమలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్ పనులు చేస్తూ… ఇతర రాష్ట్రాలనుంచి పెట్రోల్, డిజీల్ సహా ఇతర పరికరాలను కొనుగోలు చేయకుండా చూసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈమేరకు అన్ని ప్రభుత్వ శాఖలు అత్యవసరంగా గైడ్‌లైన్స్ ఇవ్వాలని ఆదేశించిన చంద్రబాబు, శాంతి భద్రతల సమీక్షలో విస్పష్టమైన ఆదేశాలే జారీ చేశారు. నటోరియస్ రౌడీలను రాష్ట్ర బహిష్కరణ చేయాలని పోలీస్ శాఖను ఆదేశిస్తూ.. అసంబద్దంగా చలానాలు వేసి ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దనీ సూచించారు. సోషల్ మీడియాలో జరిగే ఫేక్ ప్రచారాలు, వ్యక్తిత్వ హననాలపై చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి, ఈమేరకు మంత్రివర్గ ఉప సంఘంతోపాటు… పోలీసులు, నిపుణులతో కూడిన బృందం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కన్విక్షన్ రేటు పెరగాలి… క్రైమ్ రేటు తగ్గాలని సూచిస్తూ.. తీరప్రాంత భద్రతకు తక్షణం బోట్లు కొనుగోలు చేయాలని ఆదేశించారు. వచ్చే సమావేశం నాటికి జిల్లాలోని టాప్-3 నేరాలను ఏవిధంగా కట్టడి చేశారనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని సూచించిన సీఎం, టైమ్స్ సంస్థ ప్రకటించిన ‘‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’’ అవార్డుకు కలెక్టర్లు, హెచ్‌ఓడీలు, మంత్రులనుంచి అభినందనలు అందుకున్నారు.










