- గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్‌పైనే ఫోకస్
- కొత్త విద్యుత్ పాలసీతో మెరుగైన ఫలితాలు
- ఆనాటి సంస్కరణల ఫలితమే ఈనాటి ప్రగతి
- ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్లకు ఆదేశం
అమరావతి (చైతన్య రథం): ఏపీ స్టేట్‌ను ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దాలని, అవసరమైతే గ్రీన్ కారిడార్స్‌ను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. రెండోరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో విద్యుత్ శాఖను సమీక్షిస్తూ.. సోలార్ విండ్ పంప్డ్ బ్యాటరీ ఎనర్జీ అనేది రాష్ట్రానికి చాలా ప్రధానమన్నారు. ఇప్పటికే థర్మల్, హైడల్, గ్యాస్ ఉన్నాయని, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్‌ను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్, ఇంధన ధరలు తగ్గాల్సిన అవసరముందని, అలా చేయాలంటే విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలని సూచించారు. కొత్త విద్యుత్ పాలసీ ప్రకారం రాష్ట్రంలో ఛార్జింగ్ స్టేషన్లు నెలకొల్పనున్నామని, దీంతో కాలుష్య నియంత్రణ సాధ్యమవుతుందని వివరించారు. ‘మనకు పోర్టులు పెద్ద అడ్వాంటేజ్. సూర్య ఘర్ కింద ప్రతి ఇంటి మీద విద్యుదుత్పత్తి చేసే పరిస్థితి రావాలి. ఈ పథకంలో సబ్సిడీని వివరించండి. విద్యుత్‌ను వాడుకోగా మిగిలిన విద్యుత్‌ను విక్రయించుకునే సౌలభ్యాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని కలెక్టర్లకు సూచించారు. ఇప్పటికే కుప్పంలో ఒక మోడల్ యూనిట్ నెలకొల్పే ఆలోచన చేస్తున్నామని, ప్రభుత్వ భవనాలు, పాఠశాలల్లోవున్న ఖాళీ ప్రదేశాల్లో ఈ విధానం అమలుకు ప్రణాళిక సిద్ధం చేద్దామన్నారు. గ్రీన్ ఎనర్జీని ప్రమోట్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా వివరిస్తూ.. ఈ విధానంలో రైతులనూ ప్రోత్సహించాలన్నారు. ‘విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి 2004లో నా పవర్ పోగొట్టుకున్నాను’ అని చంద్రబాబు చమత్కరిస్తూ.. ఆనాటి సంస్కరణల ఫలితమే ఈరోజు మన ఇళ్లపైనే విద్యుదుత్పత్తి చేసే పరిస్థితికి రావడమని వివరించారు. విద్యుత్‌ను అందరూ సీరియస్‌గా తీసుకోవాలని నొక్కి చెబుతూ.. ఒక యూనిట్‌ను సేవ్ చేస్తే రెండు యూనిట్లను ఉత్పత్తి చేయవచ్చని అన్నారు. విద్యుత్ ప్రమాదాలను అరికట్టాలని, ఈ రంగంలో అత్యుత్తమ సేఫ్టీ సాధించాలని కలెక్టర్లకు పిలుపునిచ్చారు. ఇకపై విద్యుత్ ప్రమాదాలు సంభవించకుండా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.
విద్యుత్ శాఖ ప్రగతిపై రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి కె విజయానంద్ ప్రజెంటేషన్ ఇస్తూ.. పీఎం సూర్య ఘర్ యోజన పథకానికి నేషనల్ పోర్టల్ ద్వారా ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ కింద 6.39 లక్షలమంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారన్నారు. వీరిలో 77.09 వేలమంది దరఖాస్తు చేసుకున్నారని, వీటిలో 6.5 వేల ఇన్‌స్టలేషన్లు పూర్తయ్యాయన్నారు. మొత్తం లోడ్ 24,339 కిలోవాట్స్‌గా వివరించారు. అలాగే, ఈ పథకం ద్వారా కేంద్రం ఒక్కో కిలోవాట్‌కు రూ.30 వేలు, రెండు కిలోవాట్లకు రూ.60 వేలు, 3 కిలోవాట్లకు రూ.78 వేలు రాయితీ ఇస్తోందన్నారు. జిల్లా కలెక్టర్లు ఈ పథకంకపై ప్రజల్లో అవగాహన కల్పించి రిజిస్ట్రేషన్లు మరియు ఇన్‌స్టలేషన్లు పెరిగేలా చూడాలని సూచించారు. ఈ పథకంలో భాగంగా లబ్దిదారులకు ఏపీఈపీడీసీఎల్ కింద రూ.10.88 కోట్లు, ఏపీసీపీడీసీఎల్ కింద రూ.7.74 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్ కింద రూ.6.64 కోట్లను మొత్తంగా రూ.25.27 కోట్లను సబ్సిడీగా విడుదల చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల కోసం గృహోపకరణాల కింద ఉచితంగా ఇన్‌స్టలేషన్‌లను చేపట్టాలని యోచిస్తోందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏపీఈపీడీసీఎల్ కింద 6,77,146 మంది, ఏపీసీపీడీసీఎల్ కింద 5,9,587మంది, ఏపీఎస్పీడీసీఎల్ కింద 7,42,947 మంది మొత్తంగా 20,17,947 మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులున్నారు. వీరితో రిజిస్ట్రేషన్ చేస్తే ఒక గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల రూఫ్ టాప్ సోలార్ ఇన్‌స్టలేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని సూచించారు.
ఇక, పీఎం కుసుమ్ కింద 3 స్కీమ్స్ ఉన్నాయని, మనం కాంపోనెంట్-సీ కింద మొత్తం 3,725 మెగావాట్ల సామర్థ్యంతో వ్యవసాయ ఫీడర్లను సోలారైజ్ చేయడానికి ప్రతిపాదించామన్నారు. 0.5 నుండి 5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల స్థాపనకు ఒక మెగావాట్‌కు సంబంధించి ప్రభుత్వానికి చెందిన 5 ఎకరాలను గుర్తించాలని సూచించారు.
డిస్ట్రిక్ట్ ఎలక్ట్రిసిటీ కమిటీలు, ఆర్డీఎస్‌ఎస్
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జిల్లా విద్యుత్ కమిటీలను నోటిఫై చేసింది.
జిల్లాల్లో విద్యుత్ సరఫరా, మౌలిక సదుపాయాల సమగ్రాభివృద్ధిని సమీక్షించడానికి, సమన్వయం చేయడానికి కమిటీలు కనీసం మూడు నెలలకు ఒకసారి జిల్లా కేంద్ర కార్యాలయంలో కాలానుగుణంగా సమావేశమవ్వాలి.
జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించి సకాలంలో మినిట్స్ జారీ చేయాలి.
బయో గ్యాస్ (సీబీజీ) ప్లాంట్స్ -ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ `2024
రిలయన్స్ సంస్థ పెట్టుబడులకు ముందుకు వచ్చింది.
మూలధన సబ్సిడీ.. సీబీజీ ప్లాంట్ ఫిక్స్‌డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ (ఎఫ్‌సీఐ)పై 20శాతం కేపిటల్ సబ్సిడీ గరిష్టానికి లోబడి ఉంటుంది.
విద్యుత్ డ్యూటీ: సీఓడీ నుండి ఐదేళ్ల కాలానికి సీబీజీ ఉత్పత్తి కోసం వినియోగించే విద్యుత్‌కు 100శాతం విద్యుత్ డ్యూటీ రీయింబర్స్‌మెంట్.
ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ప్రకారం సీబీజీ ప్లాంట్‌లను ఏర్పాటుకు ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు లీజు చొప్పున వ్యర్థ భూములను కేటాయించాలి. కలెక్టర్లు భూములున్నాయని ముందుకు వస్తే చాలా సంతోషం.
సోలార్ పార్క్స్:
5,853 ఎకాల్లో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో అనంతపురం అల్ట్రా మెగా సోలార్ పార్క్, 2,801 ఎకరాల్లో 500 మెగావాట్ల సామర్థ్యంతో గాలివీడు సోలార్ పార్క్, 5,570 ఎకరాల్లో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో కర్నూలు అల్ట్రా మెగా సోలార్ పార్క్, 2,873 ఎకరాల్లో 500 మెగావాట్ల సామర్థ్యంతో అనంతపురం-2 అల్ట్రా మెగా సోలార్ పార్క్ (తలారిచెరువు), 5,944 ఎకరాల్లో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో కడప అల్ట్రా మెగా సోలార్ పార్క్స్ ఏర్పాటు.
న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్
1000 మెగావాట్ల సామర్థ్యంతో ప్రకాశం జిల్లా దొనకొండలో, 1,000 మెగావాట్ల సామర్థ్యంతో ప్రకాశం జిల్లా సీఎస్ పురంలో, 500 మెగావాట్ల సామర్థ్యంతో శ్రీసత్యసాయి జిల్లా ఎన్.పి.కుంటలో, 1,000 మెగావాట్ల సామర్థ్యంతో శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో సోలార్ పార్కుల ఏర్పాటు.
ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ప్రకారం ఇప్పటికే ఉన్న హైవే కనెక్టివిటీతోపాటు రామాయపట్నం పోర్ట్‌కి సులభంగా యాక్సెస్ జరిగేలా తగిన భూమిని గుర్తించాలని ప్రజెంటేషన్ ఇచ్చారు.