- iGOTకర్మయోగిలో మూడో స్థానం
- రికార్డుస్థాయిలో 10 లక్షల మంది నమోదు
అమరావతి (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అరుదైన మైలురాయిని అందుకుంది. ఉద్యోగుల్లోని నైపుణ్యం, శక్తి సామర్థ్యాలను మరింత పెంపొందించడానికి కర్మయోగి పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వినూత్న మిషన్ ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్‌లైన్ ట్రైనింగ్ (iGOT) లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ అగ్రతాంబూలం అందుకుంది. iGOT కర్మయోగి ఆన్‌లైన్ పోర్టల్‌లో రికార్డు స్థాయిలో ఏపీలో పది లక్షల మంది పేర్లు నమోదయ్యాయి. దీనితో iGOT కర్మయోగి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 3వ స్థానంలో నిలిచింది. తన శ్రామిక శక్తి, నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంపొందించడంలో ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధిని ఈ విజయం చాటి చెప్పింది. iGOT కర్మయోగిలో పది లక్షల మందితో దేశవ్యాప్తంగా 3వ స్థానాన్ని పొంది దేశంలోనే తన ప్రత్యేకతను ఏపీ నిలబెట్టుకుంది. ఏపీఎస్‌డీపీఎస్ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ) ఎగ్జికూటివ్ డైరెక్టర్ ఆలపర్తి వెంకటేశ్వరావు నాయకత్వంలో సాధించిన ఈ విజయం, జాతీయ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా శ్రామిక శక్తి అభివృద్ధికి రాష్ట్రం చూపిస్తున్న బలమైన నిబద్ధతను చాటిచెబుతోంది.