అమరావతి (చైతన్యరథం): తెలుగు రాష్ట్రాలకు వెలుపల తెలుగుదేశం పార్టీ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అండమాన్ నికోబార్ దీవుల్లో కూటమి ప్రభుత్వం మరో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అండమాన్- నికోబార్ దీవుల్లోని మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవికి జరిగిన ఎన్నికలో బీజీపీ మద్దతుతో టీడీపీ అభ్యర్థి షాహుల్ హమీద్ విజయం సాధించారు. టీడీపీ-బీజేపీ ఐక్యతకు ఈ గెలుపు ఒక నిదర్శనం. బీజేపీ, టీడీపీ కూటమి ఒప్పందంలో భాగంగా గతంలో పోర్ట్ బ్లెయిర్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ పదవి టీడీపీకి చెందిన మహిళా కార్పొరేటర్ సెల్వికి దక్కిన విషయం తెలిసిందే. తాజాగా దక్షిణ అండమాన్‌లోని శ్రీవిజయపురం మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్‌గా టీడీపీకి చెందిన ఎస్.షాహుల్ హమీద్ ఎన్నికయ్యారు. బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థిగా 2022లో జరిగిన మున్నిపల్ ఎన్నికల్లో పోటీ చేసి 1వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలపొందారు. ఐదేళ్ల మున్సిపల్ ఛైర్మన్ పదవీ కాలంలో ఒప్పందం ప్రకారం 4వ సంవత్సరానికి టీడీపీకి చెందిన హమీద్ ఎన్నికయ్యారు. ఆయన ఈ ఎన్నిక గురువారం అండమాన్ నికోబార్ యూనియన్ టెరిటరీలోని దక్షిణ అండమాన్‌లోని శ్రీవిజయపురం మున్సిపల్ కౌన్సిల్ కాన్ఫరెన్స్ హాలులో జరిగింది. మొత్తం 24 ఓట్లలో 15 ఓట్లు సాధించి కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి అయిన సుదీప్‌రాయ్ శర్మను టీడీపీ అభ్యర్థి ఎస్.షాహుల్ హమీద్ ఓడిరచారు.
సుదీప్‌రాయ్ శర్మకు 9 మంది సభ్యుల మద్దతు లభించింది.
ఈ విజయంతో ఎస్.షాహుల్ హమీద్ అండమాన్ నికోబార్ దీవుల చరిత్రలో శ్రీవిజయపురం మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్‌గా నియమితులైన రెండవ టీడీపీ అభ్యర్థిగా చరిత్రలో నిలిచారు. ఈ విజయం.. ఆ ప్రాంతంలో టీడీపీ రాజకీయ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోయింది. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, అండమాన్ రాష్ట్ర ఇన్‌చార్జ్ వీ మాధవనాయుడు శ్రీవిజయపురంలో ఉంటూ ఎన్నికలను పర్యవేక్షించారు. ఈ విజయానికి దోహదపడిన మాధవనాయుడు, టీడీపీ బృందం, అండమాన్ నికోబార్ దీవుల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అజోయ్ బైరాగి, అలాగే ఎస్‌వీపీఎంసీ ఎన్నికల కమిటీ సభ్యులు, మొత్తం బృందానికి టీడీపీ అండమాన్ నికోబార్ దీవుల రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.మాణిక్యరావు యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. కూటమికి అపూర్వమైన విజయం కట్టబెట్టారని, ఈ విజయంతో టీడీపీ శ్రీ విజయపురం, సమీప ప్రాంతాల ప్రజల ఆశలు నెరవేర్చేందుకు టీడీపీ కృషిచేస్తుందని తెలిపారు. పౌర సౌకర్యాలు మెరుగుపరచడం, ప్రతి గృహానికి ప్రాథమిక – అత్యవసర సేవలు అందేలా చూడటం, అర్హులైన పౌరులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో సజావుగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ విజయం టీడీపీ, బీజేపీ కూటమిపై ప్రజల నమ్మకానికి, అండమాన్ నికోబార్ దీవుల్లో సమగ్ర ప్రజా-కేంద్రీకృత అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.