- రుణాలిచ్చేందుకు ముందుకొస్తున్న విదేశీ బ్యాంకులు
- ఏఐఐబీ ప్రతినిధులతో కార్పొరేషన్ ఎండీ సమావేశం
- ప్రతిపాదిక విజయవాడ కారిడార్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలన
- విజయవాడ, విశాఖ ప్రాజెక్టులకు రూ.12వేల కోట్లు అవసరమని అంచనా
అమరావతి (చైతన్య రథం): ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలక ముందడుగు పడిరది. పలు విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. తక్కువ వడ్డీకి రుణం ఇచ్చే బ్యాంకులతో ఎండీ సంప్రదింపులు చేశారు. సమావేశానికి కేఎఫ్ డబ్ల్యూ, ఏఎఫ్, ఏడీబీ, ఎన్డీబీ, ఏఐఐబీ, జైకా, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు హాజరయ్యారు. వీరంతా విజయవాడలో ప్రతిపాదిత మెట్రో కారిడార్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో విశాఖ మెట్రోకు రూ.6,100 కోట్లు, విజయవాడ మెట్రోకు రూ.5,900 కోట్లు రుణం సమీకరించాలని నిర్ణయించారు. త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో విదేశీ బ్యాంకుల ప్రతినిధులు చర్చలు జరపనున్నట్లు సమాచారం.
విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లపై ఏపీ మెట్రోరైల్ కార్పొరేషన్ వేగంగా అడుగులేస్తోంది. రెండు మెట్రో ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఇప్పటికే జనరల్ కన్సల్టెంట్‌ల నియామకానికి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయగా… తాజాగా రుణ సమీకరణపై దృష్టి సారించింది. రెండు మెట్రో ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి అయ్యే వ్యయంలో 12000 కోట్లు రుణం అవసరం అవుతుందని అంచనా వేశారు. ఈ నిధుల కోసం తక్కువ వడ్డీకి రుణాలు మంజూరుచేసే బ్యాంకులతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణా రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు. విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లకు రుణాలు ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు ఆసక్తి చూపుతున్నాయి. పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ నుంచి గన్నవరం వరకూ ఉన్న 26 కిమీ కారిడార్‌ను, అలాగే బస్టాండ్‌నుంచి పెనమలూరు వరకూ ఉన్న 12 కిమీల కారిడార్‌ను పరిశీలించారు. త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో బ్యాంకు ప్రతినిధులు సమావేశమవుతారని ఎండీ రామకృష్ణా రెడ్డి తెలిపారు.