- రేపు శ్రీసిటీలో ఎల్‌జి యూనిట్‌కు మంత్రి లోకేష్ భూమిపూజ
- రూ.5,001 కోట్ల పెట్టుబడి, 2వేలమందికి ఉద్యోగావకాశాలు
- రూ.839 కోట్లతో మరో 5 అనుబంధ యూనిట్లు
- యువగళం కీలక హామీ అమలుకోసం లోకేష్ అవిశ్రాంత కృషి
అమరావతి (చైతన్యరథం): రాయలసీమలో మరో కీలక ప్రాజెక్టుకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 8వ తేదీ గురువారం భూమిపూజ చేయనున్నారు. అంతర్జాతీయ స్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ సంస్థ తిరుపతి సమీపంలోని శ్రీ సిటీలో వచ్చే ఆరేళ్ళలో వివిధ దశల్లో రూ.5,001 కోట్ల వ్యయంతో తమ యూనిట్ ఏర్పాటు చేయబోతోంది. 2024 సెప్టెంబర్‌లో జపాన్ నుండి వచ్చిన ఎల్జీ కంపెనీ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ పాలసీలు, రాయలసీమను ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మార్చడానికి చేస్తున్న కృషి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం తీసుకుంటున్న చర్యల గురించి కంపెనీ ప్రతినిధులకు వివరించారు. మంత్రి లోకేష్ చొరవతో రాష్ట్రంలో తమ యూనిట్ నెలకొల్పేందుకు ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ ముందుకు వచ్చింది. ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్లు, ఏసీలతో పాటు ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఏపీలో కొత్తగా ఏర్పాటుచేసే యూనిట్‌లో తయారవుతాయి. ఎల్‌జి సంస్థ తమ ఉత్పత్తులకు అవసరమైన విడి భాగాలను వేరే దేశాల నుండి తీసుకురావడం కాకుండా ఇక్కడే కంప్రెసర్, మోటార్ కంప్రెసర్, హీట్ ఎక్స్‌చేంజర్, తదితర విడి భాగాలను ఆంధ్రప్రదేశ్‌లోనే తయారు చేయనుంది. శ్రీసిటీలో ఏర్పాటుచేసే యూనిట్, అనుబంధ కంపెనీల ద్వారా రాబోయే ఆరేళ్లలో యువతకు 2వేల ఉద్యోగాలు లభిస్తాయి. రూ.839 కోట్లతో మరో 5 అనుబంధ యూనిట్లు ఆరేళ్లలో ఏర్పాటు కాబోతున్నాయి.
తొలిరోజు నుంచే…
ఎన్నికల అవసరాల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి, గద్దెనెక్కాక ప్రజలకిచ్చిన మాటను తుంగలో తొక్కి విచ్చలవిడి దోపిడీ పర్వానికి తెరలేపి విశ్వరూపం చూపిన అరాచక పాలకులను గత అయిదేళ్లలో చూశాం. సాంప్రదాయ రాజకీయ నేతలకు భిన్నంగా యువనేత, రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్..ఎన్నికల్లో గెలిచిన మరుసటి రోజునుంచి అనునిత్యం ప్రజల్లో ఉంటూ హామీల అమలు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నత చదువులు చదివిన యువత స్థానికంగా ఉద్యోగాల్లేక పొరుగు రాష్ట్రాలకు వలసబాట పట్టిన పరిస్థితులను యువగళం పాదయాత్రలో ప్రత్యక్షంగా చూసిన యువనేత లోకేష్… అధికారంలోకి వచ్చిన అయిదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యోగాలు కల్పించి, వలసలను నివారిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ అమలుకు అధికారం చేపట్టిన తొలిరోజు నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగానే గాక కీలకమైన ఉపాధి కల్పన సబ్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులు, యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా కేవలం 5 నెలల్లోనే శ్రీసిటీలో ఎల్‌జి యూనిట్ ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులు, రాయితీలు ఇచ్చి కంపెనీ ఏర్పాటుకు మార్గం సుగమం చేసారు.
ప్రణాళికాబద్ధంగా..
రాష్ట్రంలో గత అయిదేళ్ల విధ్వంసక పాలనలో పెట్టుబడిదారుల్లో దెబ్బతిన్న విశ్వాసాన్ని పునరుద్ధరించి వారిని రప్పించేందుకు మంత్రి లోకేష్ అవిశ్రాంతంగా కృషిచేస్తున్నారు. చంద్రబాబునాయుడు బ్రాండ్‌తో ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి సంస్థలకు, పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా గత 11నెలల్లో రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు, 5లక్షల ఉద్యోగాలు కల్పించేలా వివిధ కంపెనీలు ఏపీ ప్రభుత్వంతో ఎంఓయులు చేసుకోవడంలో కీలకపాత్ర వహించారు. లోకేష్ చొరవతో ఆర్సెలర్ మిట్టల్, బీపీసీఎల్, టీసీఎస్, ఎన్‌టీపీసీ, టాటా పవర్, రిలయన్స్ సీబీజీ ప్లాంట్స్ వంటి ప్రధాన సంస్థలు పెద్దఎత్తున రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇటీవల కృష్ణాజిల్లా మల్లవల్లిలో హిందూజా గ్రూప్ అశోక్ లేలాండ్ వాహనాల తయారీ యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభించింది. గతనెలలో ప్రకాశం జిల్లా కనిగిరిలో రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు మంత్రి లోకేష్ భూమిపూజ చేశారు. రాష్ట్రంలో రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ రూ.65వేల కోట్ల విలువైన 500 యూనిట్లు ఏర్పాటు చేయబోతోంది. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు మంజూరు చేసేందుకు ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డును బలోపేతం చేశారు. అమెరికా, దావోస్ పర్యటనల సందర్భంగా వందలాది పారిశ్రామికవేత్తలకు కలిసిన మంత్రి లోకేష్… రాష్ట్రంలో ఉన్న అనుకూలతలను వివరించి పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. రాష్ట్ర రాజకీయాల్లో యూత్ ఐకాన్‌గా పేరొందిన యువనేత లోకేష్… యువత కలలను సాకారం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా, చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నారు.