- ఇళ్ల వద్దనే శాశ్వత కులధ్రువీకరణ పత్రాలు అందజేత
- రెవెన్యూ మంత్రి అనగాని వెల్లడి
అమరావతి (చైతన్యరథం): కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నేరవేర్చింది. 28 లక్షల 62 వేల కుటుంబాలకు శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలను రెవెన్యూ యంత్రాంగం అందజేసింది. సుమోటోగా రెవెన్యూ అధికారులే 34 లక్షల 37 వేల కుటుంబాల డేటాను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. వీరిలో అర్హులుగా తేలినవారికి వీఆర్వోలు ఇంటింటికెళ్లి శాశ్వత కులధ్రువీకరణ పత్రాలు అందజేశారని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. దాదాపు ఐదు లక్షల కుటుంబాలకు వివిధ కారణాల రీత్యా కుల ధ్రువీకరణ పత్రాలను ఇవ్వలేదు. వీరిలో ఎవరైనా అర్హులు ఉన్నారని అనుకుంటే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా, ఏపీ మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వెంటనే రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అక్కడక్కడే కుల ధ్రువీకరణ పత్రాలను అందజేస్తారు.స్కూళ్లు, కాలేజీల్లో ప్రవేశాలకు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుకు, ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకునేందుకు కులధ్రువీకరణ పత్రాలు ఉపయోగపడతాయి. వీటి కోసం ఇక ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ కులధ్రువీకరణ పత్రాల కోసం తిరగాల్సిన అవసరం లేదని మంత్రి అనగాని స్పష్టం చేశారు. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు కులం మారదు. కానీ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ కోసం ఎమ్మార్వో కార్యాలయాలకు ప్రతి ఏటా తిరిగి తెచ్చుకోవాలి. ఇందులో వ్యయప్రయాసలు, ఆ తిప్పలు తిరిగే వారికే తెలుస్తాయి. ఈ ఇబ్బందులు తొలగించి శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. దానిని అమలు చేసేందుకు అధికారులను సన్నద్ధం చేశారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం ముందుకు కదిలింది. పారదర్శక విధానంలో సమగ్ర పరిశీలన జరిపి అర్హులైన వారికి ఇళ్ల వద్దనే అందజేశారు.