- ముంబై స్టాక్ ఎక్స్చేంజ్‌లో బెల్ మోగించిన తొలి దక్షిణాది నటుడిగా గుర్తింపు
- మనందరి ఆత్మ గౌరవానికి ప్రతీక
- తెలుగు ప్రజల ప్రేమ, ఆశీర్వాదాల ఫలితమే
ముంబై: అగ్రనటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరో అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో ట్రేడిరగ్ ప్రారంభానికి సూచికగా మోగించే గంటను ఆయన మోగించారు. ఈ బెల్ మోగించిన తొలి దక్షిణాది నటుడిగా అరుదైన గౌరవం పొందారు. ఎన్‌ఎస్‌ఈ అధికారుల ఆహ్వానం మేరకు సోమవారం ముంబై స్టాక్ ఎక్స్చేంజ్‌ని సందర్శించిన బాలకృష్ణ వారి విజ్ఞప్తి మేరకు అక్కడ ఏర్పాటు చేసిన గంటను మోగించారు. ఈ గౌరవంపై బాలకృష్ణ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా 50 సంవత్సరాలుగా హీరోగా నటిస్తున్నందుకు గుర్తింపుగా ఇటీవలే ఆయనకు ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కిన సంగతి తెలిసిందే.
దీనిపై బాలకృష్ణ స్పందిస్తూ.. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ప్రతినిధులతో ముంబై పర్యటనలో భాగంగా సోమవారం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌ను సందర్శించామన్నారు.
ఆ సందర్భంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అధికారులు చూపిన ఆత్మీయత, ఇచ్చిన గౌరవం తన హృదయాన్ని తాకిందన్నారు. ప్రత్యేక ఆహ్వానం ఇచ్చి స్టాక్ ఎక్స్చేంజ్ బెల్ మోగించే అవకాశాన్ని ఇచ్చారు. దక్షిణాది భారతీయ నటుల్లో ఈ వేదికపై బెల్ మోగించిన మొదటి వ్యక్తిగా నిలవడం నాకు గర్వకారణం మాత్రమే కాదు.. ఇది నా తెలుగు ప్రజల ప్రేమ, ఆదరణ, ఆశీర్వాదాల ప్రతిఫలంగా అభివర్ణించారు. ఈ క్షణం నాకు మరపురానిది. ఇది వ్యక్తిగత ఘనత కాదు. మనందరి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని బాలకృష్ణ ఉద్ఘాటించారు.బాలకృష్ణకు ఈ అరుదైన గౌరవం దక్కడంపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్‌ఎస్‌ఈలో ప్రత్యేక కార్యక్రమాలు, వేడుకల సందర్భంగా అతిథులు ఈ గంటను మోగించడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్‌ఎస్‌ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బెల్ మోగించారు. ఐపీఓ ద్వారా తొలిసారి స్టాక్ మార్కెట్‌లో కాలుపెట్టే కంపెనీలు కూడా బెల్ మోగించి నిధుల సమీకరణ ప్రారంభించడం సంప్రదాయంగా కొనసాగుతోంది.