అమరావతి (చైతన్యరథం) పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో నిలిచిందనే వార్త కొత్త సంవత్సరానికి బలమైన ఆరంభమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫలితాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా సీఎంఐఈ నివేదికపై స్పందిస్తూ ఎక్స్లో సీఎం చంద్రబాబు పోస్ట్ పెట్టారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అగ్రగామిగా నిలిపేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. తాము చేపట్టిన పాలసీ సంస్కరణలతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగిందని తెలిపారు. దేశీయ పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలవడం ప్రజలకు శుభవార్త అన్న ఆయన.. ఇదంతా ముందుచూపుతో అమలు చేస్తున్న పాలసీ సంస్కరణల ప్రభావం అని వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కార్యక్రమాల ద్వారా పెట్టుబడిదారులకు వేగవంతమైన సేవలు అందుతున్నాయన్నారు. ప్రోత్సాహకాల పంపిణీలో పారదర్శకత కోసం ఎస్క్రో ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టామని వెల్లడించారు. రంగాలవారీగా స్పష్టమైన విధానాలు అమల్లోకి తీసుకొచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల గమ్యస్థానంగా ఎంచుకున్న ఇన్వెస్టర్లకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. తన విజన్పై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ బృందం చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్ అభివృద్ధికి దీనిని పునాదిగా చేసుకుందామని పిలుపునిచ్చారు. పెట్టుబడులు, భాగస్వామ్యాలు, స్థిరమైన వృద్ధిపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టిందని వెల్లడించారు.
















