- పహల్గాం ముష్కరులపై కఠినచర్యలు
- అఖిలపక్షానికి కేంద్రం స్పష్టీకరణ
- ఈ పోరాటంలో మద్దతుగా ఉంటామని అఖిలపక్షం హామీ
- పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ తీర్మానం
న్యూఢిల్లీ: ఉగ్రవాదం కోరలు పీకి, ఉక్కుపాదంతో అణిచివేస్తామని అఖిలపక్ష నేతలకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. పహల్గాంలో పైశాచిక దాడికి పాల్పడిన ఉగ్రవాదులను వెతికిపట్టుకుని కఠినాతికఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా ఉగ్రవాదుల ఏరివేతలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని అఖిలపక్షం తెలిపింది. పహల్గాం ఉగ్రదాడిపై గురువారం రాత్రి నిర్వహించిన అఖిలపక్ష సమావేశం వివరాలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడిరచారు. జమ్మూకశ్మీర్ ఆర్థిక వ్యవస్థ పుంజుకుని, పర్యాటకం వృద్ధి చెందుతున్న సమయంలో స్థానిక పరిస్థితులను ప్రభావితం చేసే లక్ష్యంతోనే పహల్గాం ఉగ్రదాడి జరిగిందన్నారు. ఈ ఘటన, తదనంతరం తీసుకున్న చర్యలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అఖిలపక్ష నేతలకు వివరించారని తెలిపారు. ఉగ్రదాడికి దారితీసిన లోపాలు, అవి పునరావృతం కాకుండా తీసుకుంటున్న చర్యల గురించి ఇంటెలిజెన్స్ బ్యూరో, కేంద్ర హోంశాఖ అధికారులు వివరించారు. ఉగ్రవాదంపై పోరులో ప్రభుత్వం వెన్నంటే ఉంటామని అన్ని పార్టీల నేతలు చెప్పారని అని కిరణ్ రిజిజు తెలిపారు.
పార్లమెంట్ సముదాయంలోని భవనంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన రెండుగంటల పాటు ఈ కీలక బేటీ నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ అఖిలపక్షం తీర్మానం చేసింది. సమావేశం ప్రారంభానికి ముందు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా నేతలందరూ నిలబడి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు జైశంకర్, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజుజు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయులు సహా వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు.
ఈ సమావేశంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడిని అందరం ముక్తకంఠంతో ఖండిరచామన్నారు. కేంద్రం తీసుకునే ఏ చర్యకైనా పూర్తి మద్దతు ఇస్తామని తెలిపామన్నారు. కాశ్మీర్‌లో శాంతి నెలకొనాలన్నారు. ఇలా ఉండగా, శుక్రవారం జమ్మూకశ్మీర్‌లో రాహుల్‌గాంధీ పర్యటించబోతున్నారు. పహల్గాం ఉగ్రదాడిలో గాయపడి అనంత్‌నాగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించనున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ కాశ్మీర్లో శాంతియుత పరిస్థితుల కోసం కేంద్రం తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ మాట్లాడుతూ ఉగ్రవాదంపై పోరాటంలో ప్రభుత్వం వెన్నంటే ఉన్నామన్నారు. ప్రధాని మోదీ వీలైనంత త్వరగా అన్ని పార్టీల అధ్యక్షులతో సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశామని చెప్పారు..
దేశ భద్రతలో రాజీ లేదు: లావు
దేశ భద్రత కోసం కేంద్రం తీసుకునే ఎలాంటి చర్యలకైనా టీడీపీ మద్దతు ఇస్తుందని పార్లమెంట్‌లో ఆ పార్టీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు స్పష్టం చేశారు. దేశ భద్రత అంశంలో రాజకీయాలకు తావులేదన్నారు. రాజకీయం వేరు.. దేశ భద్రత వేరు అని చెప్పారు. జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అరికట్టి సాధారణ పరిస్థితులు తీసుకురావాలన్నారు. సింధు నది జలాల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు టీడీపీ పూర్తి మద్దతు ఇస్తోందన్నారు. అన్ని పార్టీలు కేంద్రానికి మద్దతు తెలిపాయని వెల్లడిరచారు.