- మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితా విడుదలపై మంత్రి లోకేష్ సంతృప్తి
- జాబితాను ఎక్స్‌లో విడుదల చేసిన మంత్రి
- ఎంపికైన అభ్యర్థులకు శుభాకాంక్షలు
- జాబితాలో లేనివారు నిరుత్సాహపడొద్దు
- ఇకపై ఏటా డీఎస్సీ..అందరికీ ఆవకాశం వస్తుందని భరోసా
అమరావతి (చైతన్యరథం): మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితా విడుదలతో ఒక ముఖ్యమైన హామీ నెరవేర్చామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సంతృప్తి వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితాను సోమవారం మంత్రి లోకేష్ తన ఎక్స్ ఖాతా ద్వారా విడుదల చేశారు. మెగా డీఎస్సీ హామీని నెరవేర్చాం.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన వెంటనే మెగా డీఎస్సీ ఫైల్‌పై తన మొదటి సంతకం చేశారని మంత్రి లోకేష్ గుర్తు చేశారు. తుది ఎంపిక జాబితాలో ఉన్న విజయవంతమైన అభ్యర్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ అవకాశం అందుకోలేకపోయిన వారు నిరుత్సాహ పడొద్దు. ఇచ్చిన హామీ ప్రకారం, ఇకపై ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం. మీరంతా పట్టుదలతో సిద్ధం అవుతూ ఉండండి. అవకాశం తప్పకుండా వస్తుందని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. 150 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ విజయవంతంగా మెగా డీఎస్సీ-2025ను పూర్తిచేసింది. మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితా సోమవారం ఉదయం 9.30 నుంచి అధికారిక వెబ్ సైట్ షషష.aజూసంష.aజూషటంం.ఱఅ. ద్వారా అందుబాటులో ఉంచాం. హామీల అమలులో ఇదో మైలురాయి. బాధ్యత, సేవతో కూడిన ఉపాధ్యాయ వృత్తి ఆరంభానికి సంకేతం. చిన్నారుల మేధస్సును తీర్చిదిద్దుతూ, మన విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను ప్రతి తరగతి గదికి చేర్చే దిశగా కొత్తగా నియమితులు కానున్న ఉపాధ్యాయులు ముందుకు సాగబోతున్నారు. నూతనంగా ఎంపికైన వారిని ఆత్మీయంగా ఆహ్వానించి, వారికి మార్గనిర్దేశం చేయాలని ఉపాధ్యాయ వర్గానికి మంత్రి లోకేష్ పిలుపు ఇచ్చారు.
అత్యంత పకడ్బందీగా..
నారా లోకేష్.. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఉపాధ్యాయ పోస్టుల్లో ఖాళీలన్నీ భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. హామీ ఇచ్చినట్లుగా మెగా డీఎస్సీ నిర్వహించారు. వీటిని ఆపేందుకు వైసీపీ నేతలు కోర్టుల్లో అనేక పిటిషన్లు వేయించారు. కానీ ప్రక్రియను ఆపలేకపోయారు. వైసీపీ వేసే పిటిషన్లు.. వాటికి కౌంటర్ ఇచ్చే విషయంలో సమర్థమైన న్యాయబృందాన్ని మంత్రి లోకేష్ నియమించారు. ఫలితంగా న్యాయపరంగా ఎలాంటి సమస్యలు కూడా మొత్తం టీచర్ల భర్తీ ప్రక్రియ పూర్తయింది. ఉద్యోగాలను భర్తీ చేయడం కాదు.. నిజమైన ప్రతిభావంతులకే అవకాశం లభించేలా పక్కాగా నిర్వహించారు. పరీక్ష జరిగిన విధానం..ఫలితాలపై చిన్న ఆరోపణ కూడా లేకపోవడం మంత్రి లోకేష్ తీసుకున్న ముందు జాగ్రత్తలకు నిదర్శనం.