- ఉల్లి రైతుకు హెక్టారుకు రూ.50వేలు
- ఆర్థిక కష్టాలున్నా.. సంక్షేమ నిర్ణయం
- ఏ విషయంలోనూ ఆందోళన వద్దు
- రైతు బాగుంటే రాష్టం బాగుంటుంది
- రైతులకు ట్వీట్‌లో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం తమదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉల్లి సాగు విస్తీర్ణం పెరగడం.. అధిక వర్షాల కారణంగా ఇబ్బందుల్లోపడిన ఉల్లి రైతుకు ధైర్యం చెబుతూ.. కూటమి ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుంది. పంటతో సంబంధం లేకుండా.. ఈ`క్రాప్ ఆధారంగా ఉల్లి రైతుకు హెక్టారుకు రూ.50వేలు ఆర్థిక వెసులుబాటు ప్రకటించింది. ఈ సందర్భంగా ‘ఎక్స్’ వేదికగా చేసిన ట్వీట్‌లో ఉల్లి రైతుకు ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబు.. రైతుల విషయంలో కూటమి ప్రభుత్వ విధానాన్ని ప్రస్తావించారు. ‘‘రైతుకు మద్దతు ధర విషయంలో ఏ సమస్య వచ్చినా…. కూటమి ప్రభుత్వం ఒకడుగు ముందుకు వేసి వారికి అండగా నిలుస్తోంది. సాగు విస్తీర్ణం పెరగడంతోపాటు వర్షాల కారణంగా ఉల్లి ధర తగ్గి రైతులు నష్టపోతుంటే వారిని ఆదుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నాం. ప్రతి రైతుకు హెక్టారుకు రూ.50 వేలు చెల్లించాలని నిర్ణయించాం. ఈ నిర్ణయంతో 45 వేల ఎకరాల్లో ఉల్లి సాగు చేసే రైతులకు లబ్ది చేకూరుతుంది. రైతులు ఉల్లి పంట పూర్తిగా సిద్ధమైన తర్వాత ఆరబెట్టి, గ్రేడిరగ్ చేసి వారికి మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. వారి పంటతో సంబంధం లేకుండానే ఈ-పంట ఆధారంగా హెక్టారుకు రూ.50 వేలు చెల్లిస్తాం. ఆర్థికంగా ప్రభుత్వంపై భారమైనా… రైతుల శ్రేయస్సు కోసం గతంలో ఎన్నడూలేని విధంగా నిర్ణయం తీసుకున్నాం.
ఇదొక్కటే కాదు…15 నెలల కూటమి ప్రభుత్వంలో రైతులకు అండగా ఉండే విషయంలో ఎప్పుడూ వేగంగానే స్పందించాం. పీఎం కిసాన్ `అన్నదాత సుఖీభవ కింద రూ.3200 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. మామిడి రైతులు మద్దతు ధర కోల్పోతే రూ.260 కోట్లు ఇచ్చి ఆదుకున్నాం. అంతర్జాతీయ మార్కెట్ల కారణంగా హెచ్‌డి పొగాకు ధర పతనమైతే రూ.271 కోట్లు ఖర్చు చేసి వారికి భరోసా కల్పించాం. రూ.14 కోట్లు ఖర్చు చేసి కోకో గింజలకు కిలోకు రూ.50లు చెల్లించాం. కాఫీ పంటకు బెర్రీ బోరర్ వ్యాప్తిని అరికట్టేందుకు కేజీ కాఫీకి రూ.50లు నష్టపరిహారం ఇచ్చి గిరిజన రైతులకు సాయంగా నిలిచాం. టమాటా రైతులు నష్టపోకుండా మద్దతు ధర లభించేలా రూ.12 కోట్లు ఖర్చు చేసి మార్క్‌ఫెడ్ ద్వారా సేకరించి ఆదుకున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో డబ్బులు అకౌంట్లలో వేశాం. 15 నెలల కాలంలో ధాన్యం కొనుగోలుకు రూ.13,500 కోట్లు ఖర్చు చేశాం. రైతుల సమస్యలపై చిత్తశుద్ధితో పని చేస్తున్నాం. అన్నదాతలు ఎవరూ ఏ విషయంలోనూ ఆందోళన చెందవద్దు. మెరుగైన సాగు పద్ధతులు పాటిస్తూ…. డిమాండ్ ఉన్న పంటలు సాగుచేస్తూ… ప్రభుత్వ సూచనలు అనుసరిస్తూ…. సాగును లాభదాయకం చేసుకుందాం’’ అని సీఎం చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.