పల్నాడు (చైతన్యరథం): పల్నాడు జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో మాజీ మంత్రి అంబటి రాంబాబు రెచ్చిపోయారు. అంబటి, అతని సోదరుడు మురళి కలిసి రోడ్డుపై అడ్డంగా పెట్టి ఉన్న బారికేడ్‌లు విసిరిపడేశారు. వీరిని అడ్డుకోబోయిన పోలీసులపై దౌర్జన్యంగా ప్రవర్తించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా ఏకంగా పోలీసులకే అంబటి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆపై అంబటి సోదరులు బారికేడ్‌లు తొలగించి వైసీపీ కార్యకర్తలను ముందుకు పంపించారు. కాగా.. జగన్ రెడ్డి పల్నాడు పర్యటన మొత్తం అరాచకాలు, దౌర్జన్యాలతో సాగింది. సత్తెన్నపల్లి పట్టణంలో ఓ సీఐపై వైసీపీ మూకలు దౌర్జన్యం చేసి అతడిని నెట్టివేయగా.. మరోవైపు ఆర్టీసీ బస్సుపై జెండా కర్రలతో దాడి చేశారు. జగన్ పల్నాడులోకి ప్రవేశించాక.. ఆయనతో పాటు వచ్చిన కార్యకర్తలు, కేడర్ వాహనాలను పల్నాడు వద్ద సరిహద్దుల్లో బారికేడ్లు పెట్టి పోలీసులు నిలిపివేశారు. అదే రోడ్డులో వస్తున్న అంబటి రాంబాబు, అతని సోదరుడు మురళి.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారిద్దరినీ పంపిస్తామని పోలీసులు చెప్పినప్పటికీ వినకుండా స్థానిక నేతలతో కలిసి సోదరులు ఇద్దరు బారికేడ్లను లాగిపడేస్తూ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావుకు పోలీసుల అంతు తేలుస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినోత్సవంలో కూడా గుంటూరు నగరంలో పట్టాభిపురం సీఐపై కూడా అంబటి రాంబాబు ఇదే విధంగా దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. పోలీసుల పట్ల అంబటి రాంబాబు ప్రవర్తిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.