- మన సంస్కృతి, సంప్రదాయాలే మన గుర్తింపు
- భవిష్యత్తు పర్యాటక రంగానిదే
- ఆచారాలను, సంస్కృతిని కాపాడుకోవాలి
- తెలుగుజాతి ఔన్నత్యాన్ని నిలబెట్టేందుకే ఈ ఉత్సవాలు
- ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటన
- ఆవకాయ్ ` అమరావతి ఫెస్టివల్ ప్రారంభించిన సీఎం
విజయవాడ (చైతన్యరథం): దేవతల రాజధాని అమరావతికి అపజయం అనేదే ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. రానున్న రోజుల్లో పర్యాటకం గేమ్ ఛేంజర్‌గా మారుతుందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలతోనే మనకు గుర్తింపు అని ఉద్బోధించారు. విజయవాడ కృష్ణాతీరంలో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే ఆవకాయ్ ` అమరావతి ఉత్సవాలను గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆవకాయ ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. కృష్ణా నదీతీరానికి ఓ వైపు కనకదుర్గ ఆలయం వెలుగులీనుతుండగా, మరోవైపు ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరుస్తోంది. తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి చాటేలా ఆవకాయ ఫెస్టివల్ నిర్వహించుకుంటున్నాం. ఆవకాయ్ అనగానే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్. అది మన సాంప్రదాయం..సాంస్కృతిక వైభవం. నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి పండుగ, గోదావరి జిల్లాల్లో కోడి పందేలు ఇలా వరుస సంబరాలు జరుగుతున్నాయి. మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటిచెప్పేలా కార్యక్రమాలను నిర్వహించుకోవాలి. తెలుగు వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకెళ్లేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
సంస్కృతిని కాపాడుకోవాలి
ఆహారం అంటే ప్రపంచంలో గుర్తొచ్చేది ఇండియానే…ఇండియాలో గుర్తొచ్చేది కమ్మనైన ఆంధ్రా వంటకాలే. ఎక్కడ హోటళ్లు నిర్వహించినా ఏపీ వాళ్లే ఉంటారు..షెఫ్ లు ఏపీ వాళ్లే ఉంటారు. ప్రపంచానికి ఆతిధ్యమిచ్చే పరిస్థితి మన ఏపీకి వస్తుందనడంలో అతిశయోక్తి లేదు. గత పాలనలో పండుగలు లేవు ఉత్సవాలు లేవు. అసలు హాయిగా స్వేచ్ఛగా నవ్వుకున్న సందర్భమూ లేదు. కూటమి వచ్చాకే విజయవాడ దసరా ఉత్సవాలు జరిగాయి. దసరా అంటే గతంలో మైసూర్, కోల్‌కతా మాత్రమే గుర్తొచ్చేవి, ఇప్పుడు విజయవాడ పేరు కూడా గుర్తొచ్చేలా చేశారు. ఒక్కో రాష్ట్రానికి ఒక సంస్కృతి ఉంటుంది. తమిళనాడులో జల్లికట్టు ఉంటుంది. చిత్తూరు జిల్లాలో కూడా జల్లికట్టు జరుపుకుంటారు. ఆచారాలను, సంస్కృతిని కాపాడుకోవాలి. వాటిని మర్చిపోతే మన చరిత్ర మనమే మర్చిపోయినట్లు అవుతుంది. తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవాలనే బాధ్యతతో ఇవన్నీ చేపడుతున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు.
ఎక్కడున్నా నెంబర్ వన్‌గానే..
ఈ ఉత్సవ్ లో భాగంగా సంస్కృతీ, సాహిత్యం, సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం. నేను ముఖ్యమంత్రిగా ఉండగానే కృష్ణా, గోదావరి పుష్కరాలు రావటం నా అదృష్టం. ప్రకృతిని, నదులను పూజిస్తాం కాబట్టే 12 ఏళ్ల క్రితం కృష్ణమ్మకు హారతి కార్యక్రమాన్ని ప్రారంభించాం. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీ వల్ల ఈ ప్రాంతంలో పుష్కలంగా పంటలు పండి అన్ని విధాలా అభివృద్ధి జరిగింది. తెలుగుకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అంతా కలిసి మెలసి ఉండటం మన సంస్కృతిలో భాగం. తెలుగు జాతి అంటేనే ఆతిథ్యం, మంచితనం, నైపుణ్యం, విలువలు, సామర్థ్యం. అందుకే తెలుగువారు ఎక్కడున్నా నెంబర్ వన్‌గా ఉంటారు. ఆంధ్రాప్రెన్యూర్స్ గా ఈ ప్రాంతం వాళ్లు మంచి పేరు తెచ్చుకున్నారని సీఎం చంద్రబాబు చెప్పారు.
తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా ఎన్టీఆర్
క్రియేటివ్ నెస్‌కు చిరునామాగా తెలుగు సినిమా ఉంది. భక్త ప్రహ్లాద నుంచి బాహుబలి వరకూ విజయాలు సాధించారు. తెలుగు వారు ఉన్నంత వరకూ వారి గుండెల్లో ఎన్టీఆర్ ఉంటారు. ఏఎన్‌ఆర్, కృష్ణ, శోభన్ బాబు, ఎస్వీఆర్, చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బాలయ్య ఈ ప్రాంతం వారే. బాలివుడ్, కోలివుడ్, హాలీవుడ్ ఇలా ఎన్ని ఉన్నా తెలుగు హీరోలు ప్రత్యేకమే. సినిమాలకు మనవాళ్లు వన్నె తెచ్చారు. సంస్కృతి, సాహిత్యం సినిమా తెలుగు ప్రజల బలంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
భవిష్యత్తు పర్యాటకానిదే
అన్ని ఇజాలనూ మించి టూరిజం అతిపెద్ద ఆర్థిక వనరుగా మారింది. పర్యాటకం అభివృద్ధి చెందాలంటే ఆతిథ్యం ఇచ్చే మనస్తత్వం ఉండాలి. వచ్చే పదేళ్లలో ఏపీలో 50 వేల నుంచి 1 లక్ష రూమ్‌లు ఆతిథ్యరంగానికి అందుబాటులోకి తీసుకువస్తాం. గోవా బీచ్ గురించి మాట్లాడుకునే వారు త్వరలో సూర్యలంక బీచ్ అందాల గురించి చెప్పుకునే పరిస్థితి వస్తుంది. పోలవరంలో పాపికొండలు, ఫ్లెమింగో ఉత్సవాలు, గండికోట, అరకు ఉత్సవాలు నిర్వహిస్తాం. మన అరకు కాఫీ గ్లోబల్ బ్రాండ్ గా మారుతుంది. ఏపీ ట్రావెల్ మార్ట్ ఈవెంట్ పేరుతో 9 జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ చేపడతాం. భద్రత, శుభ్రత ఉంటేనే పర్యాటకులు ఆకర్షితులు అవుతారు. మోసాలు జరిగే ప్రాంతాలకు ఎవరూ వెళ్లరు. శ్రీ వేంకటేశ్వరస్వామి నెలవైన తిరుమల మన రాష్ట్రంలో ఉండటం మన అదృష్టంగా ముఖ్యమంత్రి అభివర్ణించారు.
బెస్ట్ డైనమిక్ సిటీగా అమరావతి
అమరావతికి అపజయం అనే మాటే లేదు. శక్తివంతమైన రాష్ట్రంగా ముందుకెళ్తాం. క్రియేటివ్ ఎకానమీలో ముందుకెళ్లేలా పర్యాటకాన్ని తీర్చిదిద్దుతాం. సంక్రాంతి అనగానే పల్లెలకు వెళ్తూ సంప్రదాయంగా వేడుకలు నిర్వహించుకుంటాం. సంక్రాంతికి అంతా జన్మభూమితోనూ, జన్మనిచ్చిన వారితో మమేకం కావాలని పిలుపునిస్తున్నాను. ఆవకాయ ఒక్కటే హాట్ కాదు, ఏపీ చాలా రిచ్ ఫుడ్ అందిస్తుంది. ఆహారంలో ఆతిథ్యంలో, పరిశ్రమలో ఏపీని మించినవారు ఎవరూ లేరు. దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతానికి పైగా ఏపీకే వచ్చాయని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ఇచ్చింది. పీపీపీ విధానంలో కేంద్రం చేపట్టే ప్రాజెక్ట్‌ల్లో 30 శాతం ప్రాజెక్టులను ఏపీలోనూ, మిగతా 70 దేశంలోని ఇతర ప్రాంతాల్లో చేపడుతోంది. అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ. విజయవాడ, గుంటూరు, మంగళగిరి అమరావతిలో భాగమైపోతాయి. ఎవరు ఏ విధంగా బాధపడినా అమరావతి ప్రపంచంలో బెస్ట్ డైనమిక్ సిటీ అవుతుంది.












