- కృష్ణా తీరంలో మెరీనా వాటర్ ఫ్రంట్
- బ్లూ, గ్రీన్ సిటీగా అమరావతి
- ఖతార్ తరహాలో స్పోర్ట్స్ సిటీకి అధ్యయనం
- సీఆర్డీఏ, ఏడీసీఎల్ ఆర్థికంగా బలోపేతంపై దృష్టి
- వీధిశూల ప్లాట్లకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయింపు
- రాజధానిలో అనాథ మైనర్లకు పింఛన్లు
- 57వ సీఆర్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): రాజధాని ప్రాంతంలోని కృష్ణా నదీ తీరాన్ని మెరీనా వాటర్ ఫ్రంట్‌గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన మంగళవారం జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశం ఆమోదాన్ని తెలియజేసింది. మెరీనా వాటర్ ఫ్రంట్‌లో భాగంగా జెట్టీలు, టూరిజం లీజర్ బోట్లు, ఫుడ్ ప్లాజాలు, ల్యాండ్ స్కేప్ పనులను పీపీపీ విధానంలో చేపట్టేందుకు టెండర్లు పిలవాలని సీఎం సూచించారు. వాటర్ ఫ్రంట్ రూపకల్పనకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. రివర్ ఫ్రంట్‌తో పాటు వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. బ్లూ- గ్రీన్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దే క్రమంలో అంతర్గత కాలువల నిర్మాణం, సుందరీకరణ పనులు జరగాలన్నారు. ప్రకాశం బ్యారేజీ ఎగువన నిర్మించే నూతన బ్యారేజ్‌తో రాజధానికి నీటి వనరులు సమకూరతాయని వివరించారు. కృష్ణానదికి ఇరు వైపులా అద్భుతమైన వాటర్ ఫ్రంట్ అభివృద్ధి చేసుకోవచ్చని సూచించారు. నదిలో ఉన్న ఐ ల్యాండ్స్‌ను పర్యాటకపరంగా అభివృద్ధి చేసుకునే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు.
రాజధానిలో అనాథ మైనర్లకు పెన్షన్
ల్యాండ్ పూలింగ్ స్కీంలో భాగంగా రాజధానిలో భూమి లేని నిరుపేదలకు ఇస్తున్న పెన్షన్లను మైనర్లయిన అనాథలకు కూడా వర్తింప చేసేందుకు సమావేశంలో ఆమోదం తెలిపారు. ఇకపై తల్లిదండ్రులను కోల్పోయిన మైనర్లకు నెలకు రూ.5,000 చొప్పన పెన్షన్ రూపంలో అందిస్తారు. మరోవైపు ఏపీ సీఆర్డీఏలో పలు కేడర్లకు సంబంధించి మొత్తం 754 పోస్టులకు సంబంధించిన ర్యాటిఫికేషన్‌కు అథరిటీ ఆమోదం తెలిపింది. అలాగే, రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో 112 వీధిశూల కలిగిన ప్లాట్లకు బదులుగా మరోచోట ప్లాట్ల కేటాయింపునకు అంగీకరించింది. అయితే మ్యుటేషన్ అవ్వని, థర్డ్ పార్టీకి విక్రయించని ప్లాట్ల వరకు ఈ వెసులుబాటు కల్పించారు. రైతులకు ఏ ఇబ్బందీ లేకుండా చూడాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు.
ఖతార్ తరహాలో స్పోర్ట్స్ సిటీకి అధ్యయనం
అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సీఆర్డీఏ ఆర్థికంగా బలోపేతం అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఇందుకు సంబంధించి రెవెన్యూ మోడల్స్‌ను అధ్యయనం చేయాలని, ఆస్తులను సమకూర్చుకుని సుస్థిర ఆదాయం పొందేలా రెండు సంస్థలు ఎదగాలని సీఎం స్పష్టం చేశారు. స్పోర్ట్స్ సిటీ వంటి ప్రాజెక్టుల కోసం ఖతార్ మోడల్ ను అధ్యయనం చేయాలన్నారు. అమరావతిలో చేపట్టిన రాజధాని నిర్మాణ పనులు నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, సీఎస్ విజయానంద్, పురపాలక-సీఆర్డీఏ-ఆర్ధిక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
















