- ఆ భయంతోనే పిచ్చి ప్రేలాపనలు
- ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా జగన్ పార్టీ నేతల పగటి కలలు
- ప్రపంచస్థాయి రాజధానికి బలమైన పునాది పడిరది
- ఆపటం ఎవరితరం కాదు
- మంత్రి సత్యకుమార్ ఉద్ఘాటన
అమరావతి (చైతన్యరథం): అమరావతితో జరిగిన రాజధాని పనుల పున:ప్రారంభ సభ భారీ స్థాయిలో విజయవంతం కావటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డ వైసీపీ నేతలు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. నిర్వహణా పరంగాను, ప్రధాని నరేంద్ర మోదీ హామీల పరంగాను అమరావతి సభ గ్రాండ్ సక్సెస్ కావటం..వైసీపీలో వణుకు పుట్టించిందనే విషయం స్పష్టమైందన్నారు. దీనిపై వైసీపీ నేతల స్పందన వారిలో నెలకొన్న కలవరాన్ని బయటపెడుతోందన్నారు.
వారికి ఎన్నటికీ బుద్ధిరాదు
అమరావతి పున:నిర్మాణ సభకు సంబంధించి పలు అంశాలపై దాదాపు రెండు గంటల పాటు మాట్లాడిన వైసీపీ నేతలు.. అప్పటి ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతికి మద్దతుగా అసెంబ్లీలో ఎందుకు మాట్లాడారో చెబితే బాగుండేదన్నారు. అప్పుడు ఆయన అవగాహన లేక మద్దతిచ్చారనీ, తర్వాత జ్ఞానోదయమై మూడు రాజధానుల పల్లవి అందుకున్నారనీ వివరణ ఇచ్చి ఉంటే బాగుండేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైసీపీ మూడు రాజధానుల పల్లవిని గతేడాది ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించిన వాస్తవాన్ని తెలుసుకోలేని ఆ పార్టీకి ఎన్నటికీ జ్ఞానోదయం కాదనే విషయాన్ని వారి మాటల ద్వారా వారే వెల్లడిరచుకున్నారని మంత్రి సత్యకుమార్ ఎద్దేవా చేశారు.
పుట్టగతులుండవనే భయం
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాజధానిని నిర్మిస్తామంటున్న కూటమి ప్రభుత్వ హామీలో లొసుగులు వెతకటానికి వైసీపీ విఫలయత్నం చేసింది. ఒక నూతన రాజధాని నిర్మాణాన్ని చేపట్టినపుడు ప్రపంచ ప్రమాణాలతో ముందుకు సాగడం తప్పా? ఆ మేరకు రానున్న మూడేళ్లలో చేపట్టదలచిన ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం నడుం బిగించడం తప్పా? వీటికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడం తప్పా? మూడేళ్లలో ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తామని ముఖ్యమంత్రి గానీ, కూటమి నేతలు గాని అన్నారా? కేవలం మూడేళ్లలోనే అలా చేయడం సాధ్యం కాదన్న విషయం తెలియనంత అమాయకులా కూటమి నేతలు? వాస్తవంలో…దాదాపు 50,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ప్రస్తుత నిర్మాణాలు పూర్తయితే ప్రపంచ స్థాయి రాజధానికి అంకురార్పణ జరుగుతుందని, దానితో వైసీపీకి ఇక పుట్టగతులుండవనే భయం జగన్ రెడ్డిని, ఆయన పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. అందువల్లే వారు అమరావతి నిర్మాణం విఫలం కావాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఒకసారి సఫలమైన వారి కుట్ర మరోసారి నెరవేరదని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.
ప్రజల ఆకాంక్షలతో చెలగాటం
రాజధాని నిర్మాణం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి చోదక యంత్రం(ఇంజన్)లా పనిచేస్తుంది. ఈ కారణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు విస్తృత ప్రణాళికలు రూపొందించారు. వాటికి ప్రధాని నరేంద్ర మోదీ పూర్తి మద్దతు ప్రకటించారు. ఇద్దరు సమర్థులైన నాయకులు ఈ దిశగా భుజం..భుజం కలిపి పనిచేయడం జగన్‌రెడ్డి బృందానికి రుచించడం లేదు. అందుకనే వైసీపీ నేతలు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు. రాష్ట్ర ప్రగతికి బాటలు వేయాలని ప్రజలు గతంలో భారీగా మద్దతునిస్తే జగన్ రెడ్డి, ఆయన బృందగణం చేసిందేమిటి? స్వప్రయోజనాల కోసం రాష్ట్ర వనరుల్ని పూర్తిగా దోచుకున్నారు. పోటీలుపడి మరీ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలపై దాడులు చేసి కొల్లగొట్టారు. మూడు రాజధానులంటూ ఒక్కటీ లేకుండా చేసి జగన్ రెడ్డి కుటుంబ విలాసవంతమైన జీవనం కోసం ప్రజా ధనం రూ.500 కోట్లను దుర్వినియోగం చేసి విశాఖ తీరంలో జగన్ మహల్‌ను నిర్మించుకున్నారు. వైసీపీ నేతల ఈ దోపిడీని గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు. ఈ చారిత్రాత్మక తీర్పు సందేశాన్ని గ్రహించలేని వైసీపీ నాయకులు ఇంకా ప్రజల ఆశలు, ఆశయాలతో నిస్సిగ్గుగా చెలగాటమాడుతున్నారు. వారి తలపై వారే భస్మాసుర హస్తాన్ని పెట్టుకుంటున్నారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి బలమైన పునాది పడిరది. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు అంచనాల మేరకు నిర్మాణం జరుపుకునే అమరావతిని ఎవరూ అడ్డుకోలేరు. దీని వైఫల్యం కోసం ప్రార్థనలు చేస్తూ, కలలు కంటున్న వైసీపీ రాక్షస గణం.. రాష్ట్ర ప్రజల చేతుల్లో మరోమారు హతులవుతారు.. భవిష్యత్‌లో ప్రతిసారీ అవుతూనే ఉంటారని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.