- సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులపై దృష్టి సారించండి
- క్రీడలు, పర్యాటకానికి పెద్ద పీట వేసేలా ప్రణాళికలు
- పెట్టుబడులతో వచ్చే సంస్థలతో నిరంతర సంప్రదింపులు
- 59వ సీఆర్డీఏ అథారిటీ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- భూకేటాయింపులు సహా వివిధ ప్రతిపాదనలకు అథార్టీ ఆమోదం
అమరావతి (చైతన్య రథం): తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటేలా… భావితరాలకు అందించేలా అమరావతిని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధానిలో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులను చేపట్టేలా అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 59వ సీఆర్డీఏ అథార్టీ సమావేశం జరిగింది. సమావేశంలో రాజధానిలోని వివిధ సంస్థలకు జరపాల్సిన భూకేటాయింపులు, సెక్రటేరియేట్, హెచ్వోడీ భవనాల్లో కల్పించాల్సిన మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. సీఆర్డీఏనుంచి వచ్చిన వివిధ ప్రతిపాదనలను సీఆర్డీఏ అథార్టీ సమావేశం ఆమోదించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… ‘రాజధాని పరిధిలోని నీరుకొండవద్ద చేపట్టే టూరిజం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి. మొత్తంగా 167 ఎకరాల విస్తీర్ణంలో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాలి.
పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయడంతోపాటు తెలుగు వైభవాన్ని చాటేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఈ ప్రాజెక్టులో వాటర్ ఫ్రంట్, కల్చరల్ సెంటర్ తదితర విభాగాలు వస్తాయి. పర్యాటకంతోపాటు నిత్యం రకరకాల కార్యక్రమాలు నిర్వహించుకునే వాతావరణాన్ని కల్పించాలి. హోటళ్లను ఏర్పాటు చేయడంతోపాటు, అమ్యూజ్మెంట్ పార్కులను అభివృద్ధి చేయాలి. అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేలా ఆ ప్రాంతాన్ని డిజైన్ చేయాలి. నీరుకొండలో చేపట్టేబోయే ప్రాజెక్టును అత్యంత సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలి. భవిష్యత్తులో క్రీడారంగం అతి పెద్ద ఆదాయ వనరు కానుంది. దీనికి బీసీసీఐ, ఐసీసీ సంస్థలే అతి పెద్ద ఉదాహరణ. ఒకప్పుడు నిధుల కోసం ఎదురు చూసే పరిస్థితినుంచి ఇప్పుడు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా క్రికెట్ బోర్డులు ఎదిగాయి. ఇదేవిధంగా మరికొన్ని క్రీడలు కూడా కమర్షియలుగా రూపాంతరం చెందనున్నాయి. ఇలాంటివాటిని అందిపుచ్చుకోవాలి. అమరావతిలోని స్పోర్ట్స్ సిటీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఇదేవిధంగా రూపొందించాం. అమరావతిలోకి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులను తీసుకురావాలి. రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.
ఇలాంటివారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉండాలి. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సైబర్ సిటీలో పెట్టుబడులు పెట్టలేకపోయినందుకు డీఎలఎఫ్వంటి సంస్థలు ఇప్పుడు చింతిస్తున్నాయి. ఈసారి అమరావతిలో అలాంటి అవకాశాన్ని వదులుకోకూడదని భావిస్తున్నాయి. ఇది మన ప్రభుత్వానికి ఉన్న క్రెడిబులిటీ. ఈ బ్రాండ్ మరింతగా పెరగాలి. అందుకే పెట్టుబడులు పెట్టే వారిని రెగ్యులరుగా ఫాలో అప్ చేస్తూనే ఉండాలి. ఓవైపు రాజధానిలో పనులను త్వరితగతిన చేపట్టేలా పర్యవేక్షణ చేస్తూనే.. పెట్టుబడులు పెట్టే సంస్థలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉండాలి. అమరావతిలో నిర్మించనున్న తెలుగు కల్చరల్ సెంటర్కు మంచి పేరు పరిశీలించండి. రాజధానిలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయండి. ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు పెద్ద కన్వెన్షన్ సెంటర్ నిర్మించాల్సిన అవసరం ఉంది” అని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, సీఎస్ సాయిప్రసాద్, పట్టణాభివృద్ధి, సీఆర్డీఏ, ఏడీసీ అధికారులు పాల్గొన్నారు.
- సీఆర్డీఏ అథార్టీ ఆమోదం పొందిన అంశాలివే..:
- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కార్యాలయ నిర్మాణానికి 80 సెంట్ల భూమి కేటాయింపు.
- పరిహారంగా తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి 3 ఎకరాలు కేటాయింపు.
- పంచాయితీరాజ్ విభాగంలోని ఏపీఎసఐఆర్డీకి 5 ఎకరాల కేటాయింపు.
- ఏపీ సచివాలయం, హెచఓడీ టవర్ల నిర్మాణంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనులకు రూ.2316 కోట్లకు
- పరిపాలనా అనుమతులు. రూ.119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం.














