- ప్రజా రాజధానే యువతకు ఉపాధి దేవాలయం
- విశాఖ, తిరుపతి, అమరావతి నగరాలపై ప్రత్యేక ఫోకస్
- నైపుణ్యాభివృద్ధి శిక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
- ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నాం
- పలు నాలెడ్జి ఎకానమీ యూనివర్శిటీలు రాష్ట్రానికి వస్తున్నాయి.
- టాప్ 10 వర్శిటీలు, టాప్ 10 ఆసుపత్రులు రానున్నాయి.
- రాజధాని అమరావతిపై సమీక్షలో సీఎం చంద్రబాబు
- నిర్మాణ పనులపై సీఆర్డీఏ కమిషనర్ ప్రజెంటేషన్
అమరావతి (చైతన్య రథం): అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభానికి రూ.20,500 కోట్లకు సీఆర్డీఏ అథారిటీ ద్వారా పరిపాలనా ఆమోదం తీసుకోవడం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రెండోరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో రాజధాని అమరావతి నిర్మాణ పనులను చంద్రబాబు సమీక్షించారు. ఇప్పటి వరకు అమరావతి రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి రూ.31వేల కోట్ల టైఅప్ చేశామని, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి) నిన్న జరిగిన బోర్డు సమావేశంలో అమరావతి రాజధానికి రూ.15000 కోట్ల రుణం మంజూరుకు ఆమోదం తెలిపిందని అన్నారు. అమరావతి రాజధాని పరిధిలోని ఆర్-5 జోన్‌లో గత ప్రభుత్వం 50,793మంది లబ్ధిదారులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టగా వారికి సంబంధిత జిల్లాల్లోనే ఇళ్లు ఇచ్చేందుకు వీలుగా అనువైన స్థలాలను గుర్తించాలని కలెక్టర్లను కోరారు. గత ఐదేళ్ల పనులను పట్టించుకోకపోవడం వల్ల రాజధాని నిర్మాణంలో సమస్యలు ఏర్పడ్డాయని, ప్రస్తుతం ఏపీ సీఆర్డీఏ పరిధిని యధాతథ స్థితికి తీసుకురావడం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు వివరించారు.
1.38 లక్షల బీసీలకు లబ్ది
కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లోనే బీసీ సంక్షేమ శాఖపై మాట్లాడుతూ.. కార్పొరేషన్‌కు కేటాయించిన రూ.1878 కోట్లతో 1.38లక్షల బీసీలకు లబ్ది చేకూరుతుందని సీఎం స్పష్టం చేశారు. బీసీ కార్పోరేషన్ ద్వారా ఆయా కులాల సాధికారతకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్లు, మంత్రులు, ఎంఎల్‌ఏలు సంక్షేమ వసతి గృహాలను తనిఖీ చేయాలని సీఎం ఆదేశించారు. అంతకుముందు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పి భాస్కర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ రాష్ట్రంలో బీసీ హాస్టళ్ల మరమ్మతులు నిర్వహించాలని అన్నారు. బీసీ భవన్‌లకు భూమి కేటాయించాలని, రాష్ట్రంలో 107 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండగా వాటిలో 46 పాఠశాలలకు ఇంకా సొంత భవనాలు నిర్మించాల్సి ఉందని అందుకు తగిన నిధులు కేటాయించాలని కోరారు. 26 జిల్లాల్లో బీసీ స్టడీ సర్కిల్స్‌ను ప్రారంభించామని తెలిపారు. బీసీ కార్పొరేషన్‌కు ఈఏడాది రూ.1878 కోట్లు కేటాయించారని, దానివల్ల 138 బీసీ కులాలకు చెందిన లక్షా 33వేల మంది లబ్ధిదారులకు లబ్ది కలుగుతుందని చెప్పారు. ఈడబ్ల్యుఎస్, కాపు కొర్పొరేషన్‌లకు కూడా తగిన నిధులు కేటాయించారని వివరించారు.
రహదారులపై కాంప్రమైజ్ కావొద్దు
రాష్ట్రంలో రహదారుల నిర్మాణం విషయంలో రాజీ పడొద్దని, రెండేళ్లలోపు పనులు పూర్తి చేయాలని కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా రహదారులు భవనాల శాఖలో జరుగుతున్న ప్రగతి గురించి అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్‌పై సీం మాట్లాడారు. రహదారులు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైన అంశమని, దీనిపైన రాజీలేకుండా పనిచేయాలన్నారు. స్టేట్ హైవైస్, నేషనల్ హైవేస్ ప్రాజెక్టలకు సంబంధించి జరుగుతున్న నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్లు ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షించాలన్నారు. రహదారుల నిర్మాణానికి రూ.65 వేల కోట్లమేర ఖర్చు చేస్తున్నామని, రహదారుల నిర్మాణాలకు సంబంధించి ఎక్కడా ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని తెలిపారు. ఆ ప్రకారం అధికారులు పనిచేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 డిసెంబరు నాటికి రహదారుల నిర్మాణాలకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిందేనన్నారు. రహదారులు కాలపరిమితిలోపు పూర్తి చేస్తే అధికారులు, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని చెప్పారు.
సంక్రాంతికి గుంతలులేని రహదారులు
సంక్రాంతికల్లా రాష్ట్రంలో గుంతల రహిత రహదారుల లక్ష్యాన్ని పూర్తి చేస్తామని రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే చెప్పారు. రహదారుల్లో గుంతలు పూడ్చి మరమమమతులు చేయడానికి ప్రభుత్వం రూ. 860 కోట్లు మంజారు చేసిందని చెప్పారు. మొత్తం 21,057 కిలో మీటర్ల మేర రహదారుల్లో గుంతలు పూడ్చే పనులు సాగుతున్నాయని, అందులో ఇప్పటికే 3293 కిలో మీటర్లు పనులు పూర్తి చేశామని తెలిపారు. రాష్ట్రంలో స్టేట్ హైవేస్‌ని పీపీపీ మోడల్‌లో 10,200 కిలోమీటర్లు అభివృద్ధి చేస్తామన్నారు. ఆయా జిల్లాలో జరుగుతున్న రహదారుల నిర్మాణ పనులకు సంబంధించి ఎదరయ్యే భూసేకరణ సమస్యలపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అనంతరం ఆరోగ్య శాఖను సీఎం చంద్రబాబు సమీక్షించారు.