- సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
- ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు 90 శాతం పూర్తి
- మిగిలిన పనులు నేటికి పూర్తిచేస్తాం
- రూ.43 వేల కోట్ల పనులకు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం
- పురపాలక మంత్రి నారాయణ వెల్లడి
- అధికారులతో కలిసి ఏర్పాట్ల పరిశీలన
అమరావతి (చైతన్యరథం): ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఏర్పాట్లు దాదాపు 90 శాతం పూర్తయ్యాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. మిగిలిన పనులను బుధవారానికి పూర్తిచేస్తామని చెప్పారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి మంగళవారం మంత్రి నారాయణ పరిశీలించారు. సచివాలయం వెనుక ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదిక, పార్కింగ్ ప్రాంతాలు, వేదిక వద్దకు చేరుకునే మార్గాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడారు. మే 2 న సాయంత్రం 3.25 కి ప్రధాని అమరావతి వస్తారు. రూ.43 వేల కోట్ల పనులకు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది. రాజధాని కోసం కేవలం 50 రోజుల్లో ఒక్క సమస్య కూడా లేకుండా రైతులు భూములు ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో రాజధాని కట్టాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించాం. 365 కి.మీ ట్రంక్ రోడ్లు, 1500 కి.మీ లే ఔట్ రోడ్లు నిర్మించేలా ప్లాన్ ఉంది. గతంలోనే రూ.41 వేలకోట్లకు పనులు ప్రారంభమయ్యాయి. 2019కు ముందు రూ.5 వేల కోట్ల బిల్లులు కూడా చెల్లించామని మంత్రి నారాయణ తెలిపారు.
గత ప్రభుత్వం రాజధానిపై మూడు ముక్కలాట ఆడిరది. గత ప్రభుత్వం కాంట్రాక్టర్ల అగ్రిమెంట్‌లు క్లోజ్ చేయలేదు. రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ ప్రివ్యూ తీసుకొచ్చింది. న్యాయపరమైన సమస్యలు లేకుండా ముందుకెళ్లేందుకు ఇంత సమయం పట్టింది. మళ్ళీ మా ప్రభుత్వం రాగానే అమరావతి పనులు ప్రారంభించాం. రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవంలో భాగంగా రూ.43 వేల కోట్ల పనులను ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తారు. మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తాం. సోమవారం అమరావతి ప్రాంత రైతులతో సీఎం చంద్రబాబు రెండుగంటలపాటు మాట్లాడారు. 29 గ్రామాల రైతులను ప్రధాని సభకు రావాలని సీఎం స్వయంగా ఆహ్వానించారు. అమరావతి పై పార్లమెంట్లో చట్టం చేయాలని రైతులు కోరారు. రాజధానికి చట్టబద్ధత అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారనినారాయణ తెలిపారు