- ఉపాధ్యాయులకు ప్రస్తుతమున్న 45 యాప్‌ల స్థానంలో ఒకటే యాప్
- పెద్ద పాఠశాలల్లో ఎస్టేట్ మేనేజర్ల వ్యవస్థ
- పాఠశాల విద్యాశాఖకు సంబంధించి ఒకటే డ్యాష్ బోర్డ్
- పాఠశాల విద్య, సమగ్ర శిక్షపై సమీక్షలో మంత్రి నారా లోకేష్ ఆదేశాలు
అమరావతి (చైతన్యరథం): ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్లూ ప్రింట్‌లో పూర్వ విద్యార్థిసంఘాలు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని కాంక్షించే వారిని స్కూల్ మెంటార్లుగా వినియోగించుకునే వ్యవస్థను రూపొందించాలని అధికారులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లిలోని నివాసంలో పాఠశాల విద్య, సమగ్ర శిక్షపై మంత్రి లోకేష్ గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల అభివృద్ధికి ముందుకొచ్చే దాతలకు ఆయా పాఠశాలల సమగ్ర సమాచారం, మౌలిక వసతుల అవసరాలను తెలియపరిచి, నేరుగా పాఠశాలలు, కళాశాలలకే దాతల విరాళాలు అందే వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల అమలు, నిధుల వినియోగం, వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌పై సమావేశంలో కూలంకుషంగా చర్చించారు. అదే విధంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేసి కంప్యూటర్ ల్యాబ్‌లు, స్టెమ్ ల్యాబ్‌లు, స్కూల్ లైబ్రరీలను అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి లోకేష్ ఆదేశించారు.
ఒకటే డ్యాష్ బోర్డ్
ఉపాధ్యాయులకు ఇప్పుడున్న 45 యాప్‌ల స్థానంలో ఒకే యాప్‌ను తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. ఉపాధ్యాయులు కేవలం బోధన, హాజరు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ఎక్కువ సమయం కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెద్ద పాఠశాలల్లో ఎస్టేట్ మేనేజర్స్ వంటి వ్యవస్థను తీసుకురావాలని, క్లస్టర్ స్థాయిలో సీఆర్పీలను వినియోగించుకోవాలని సూచించారు. పాఠశాల విద్యాశాఖకు సంబంధించి అన్ని అంశాలు ఏకీకృతం చేసి ఒకే డ్యాష్ బోర్డ్ రూపొందించాలన్నారు. మంత్రి నుంచి క్షేత్రస్థాయి వరకు లాగిన్‌లు రూపొందించి, ఒకే సమాచారాన్ని పదేపదే సేకరించే పద్ధతికి స్వస్థి పలకాలని, ఉపాధ్యాయుల సమయాన్ని విద్యార్థుల కోసం సద్వినియోగపరుచుకునేలా చూడాలని ఆదేశించారు. జీవో 117 ఉపసంహరణ తర్వాత మోడల్ ప్రైమరీ స్కూళ్లను గరిష్ఠస్థాయిలో ఏర్పాటుచేసి ఒక క్లాస్‌కు ఒక టీచర్‌ను కేటాయించాలని, క్రమంగా ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ వి.విజయ్ రామరాజు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృతికా శుక్లా, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
“