- వారికి పరిహారం చెల్లింపు ప్రథమ బాధ్యత
- ఆర్థిక ఇబ్బందులున్నా ఆపొద్దని సీఎం చంద్రబాబు ఆదేశాలు
- ఆ మేరకే నిర్వాసితుల ఖాతాల్లో నిధుల జమ
- గతంలో బాధ్యత లేకుండా వ్యవహరించిన జగన్
- ఆర్థిక మంత్రి పయ్యావుల స్పష్టీకరణ
అమరావతి (చైతన్యరథం): పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఎంత ముఖ్యమో.. నిర్వాసితుల సంక్షేమమూ అంతే ముఖ్యమని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. దీన్ని మొదటి నుంచి నమ్మి.. ఆచరణలో పెట్టే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమేనన్నారు. విజయవాడలో శనివారం మీడియాతో మంత్రి పయ్యావుల మాట్లాడుతూ ఓవైపు పోలవరం నిర్మాణం చేపడుతూనే.. మరోవైపు పోలవరం నిర్వాసితుల సమస్యలను తీరుస్తున్నామని తెలిపారు. 2014-19 మధ్య కాలంలో పోలవరం నిర్మాణం ఎంత వేగంగా జరిగిందో.. అదే స్థాయిలో నిర్వాసితులకు పరిహరం అందచేశాం. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. మరింత ఎక్కువ పరిహారాన్ని అందిస్తామని బూటకపు హామీలతో నిర్వాసితులను నమ్మించింది. కానీ వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క పైసా కూడా విదల్చలేదు. పైగా డబ్బులు ఉంటే ఇవ్వనా.. కేంద్రం డబ్బులివ్వాలి.. వాళ్లేమో డబ్బులివ్వడం లేదు.. నేను డబ్బులు ప్రింట్ చేయలేను.. చేసే అధికారం నాకుంటే.. ప్రింట్ చేసి డబ్బులు ఇచ్చేసేవాడిని అంటూ నాడు ముఖ్యమంత్రి హోదాలో జగన్ మోహన్ రెడ్డి అత్యంత బాధ్యతారాహిత్యంతో మాట్లాడారు.
దీన్ని నిర్వాసితులే కాదు.. రాష్ట్ర ప్రజలెవ్వరూ మరిచిపోలేదు. పోలవరం మా ప్రాధాన్యం కాదు..కాబట్టి నిర్వాసితులను గాలికి వదిలేసినా ఫర్వాలేదనే రీతిలో నాటి వైసీపీ ప్రభుత్వం నిర్దయగా వ్యవహరించింది. పైగా గద్దె దిగుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి.. ఖజానాను ఖాళీ చేసి వెళ్లిపోయింది. రాష్ట్రం ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్నా.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తిరిగి ప్రారంభించడమే కాకుండా.. నిర్లక్ష్యానికి గురైన నిర్వాసితులకు అండగా నిలవాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. బిల్లుల చెల్లింపులపై సీఎం చేపట్టిన సమీక్షలో ఆర్థిక శాఖ ప్రతిపాదనలపై చర్చించారు. అత్యవసర ఖర్చులు.. చెల్లింపులు ఏమున్నాయని అడిగారు. రైతులకు ధాన్యం కొనుగోళ్ల డబ్బులను ఎలాంటి జాప్యం లేకుండా చెల్లింపులు జరపాలనే పాలసీ పెట్టుకున్నామని.. అలాగే పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహరం కూడా పెండిరగులో ఉందనే విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ అంశం ప్రస్తావనకు రాగానే.. పోలవరం నిర్వాసితులకు సంబంధించి ఆర్థిక శాఖ వద్ద ఎన్ని బిల్లులు పెండిరగులో ఉంటే.. అన్నింటినీ మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నిర్వాసితులకు నష్టం చేస్తూ.. వారికి న్యాయం చేయకుండా ప్రాజెక్టు కట్టడం సరైన పద్దతి కాదని, ఇతర అవసరాలకు నిధుల పరంగా ఏమైనా ఇబ్బందులు వచ్చినా ఏదో రకంగా సమకూర్చుకోవాలన్నారు.
పోలవరం నిర్వాసితులకు, అందులోనూ 41.15 కాంటూరు పరిధిలోని నిర్వాసితులకు పరిహరం చెల్లింపులను అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి పూర్తి స్థాయిలో వెసులుబాటులోకి రాకున్నా.. మానవీయ కోణంలో సీఎం చంద్రబాబు ఆలోచించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు త్వరలో వస్తాయని, అయినా వాటి కోసం ఆగొద్దని స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చే నిధుల కోసం ఎదురు చూస్తూ నిర్వాసితులను మరింత కాలం వేచి చూసేలా చేయడం సబబు కాదని సీఎం చెప్పారు. నిర్వాసితులకు ఇచ్చిన పరిహరం వివరాలను కూడా తనకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలని.. అలాగే దీనికి సంబంధించిన వివరాలు కేంద్రానికి కూడా పంపాలని ఆదేశించారు. ప్రభుత్వం మారితే తమ తలరాతలు మారతాయని ప్రజలంతా భావించారని, పేదలు.. మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వం పైనా.. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేయడం.. ప్రభుత్వ ప్రథమ బాధ్యత అనే కోణంలో ఆలోచించి పరిహారం చెల్లింపునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని మంత్రి పయ్యావుల తెలిపారు.
రాష్ట్రానికి వరం పోలవరం
పోలవరం అంటే ఒక జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టు కాదు. పోలవరం అంటే రాయలసీమకు, ఉత్తరాంధ్రకు, ఈ రాష్ట్ర రైతాంగానికి వరం. పట్టిసీమ ప్రాజెక్టు కట్టకముందు రాయలసీమలో నీటి కోసం యుద్ధాలు జరిగేవి. తుంగభద్ర హై లెవెల్ కెనాల్‌లో నీళ్లు తక్కువ వస్తే… రెండు టీఎంసీల నీటిని కర్నూలు నుంచి మళ్లించి ఇవ్వాలంటూ అనంతపురం జిల్లా రైతులు ధర్నా చేసేవారు. కర్నూలు వాళ్లు ఇవ్వొద్దని ధర్నా చేసే పరిస్థితి ఉండేది. పట్టిసీమ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత రైతుల అందోళనలు తగ్గాయి. ఒక చిన్న ప్రాజెక్టు రాయలసీమ భూభాగంలోని అనేక మార్పులకు కారణమైంది. పోలవరం’పై సీఎం చంద్రబాబు ప్రధానంగా దృష్టిసారించారు. పోలవరం పూర్తిచేయడంతో పాటు బనకచర్ల వరకు నీళ్లు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బనకచర్ల ప్రాజెక్టు రాయలసీమ ఇరిగేషన్‌కు గుండెకాయ లాంటిది. అక్కడి నుంచే కర్నూలు, నంద్యాల, కడప, చిత్తూరు, అనంతపురం తదితర ప్రాంతాలకు నీరు చేరుతుంది. బనకచర్లకు నీటిని తీసుకెళ్లేందుకు నదుల అనుసంధాన ప్రాజెక్టను కూడా చేపట్టబోతున్నారు. అందుకే పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయబోతున్నారు. గత ఐదేళ్లలో పోలవరం పనులు ఆపిందెవరో జగన్ చెప్పాలని మంత్రి పయ్యావుల ప్రశ్నించారు.