అమరావతి (చైతన్యరథం): బీసీ కార్పొరేషన్లకు విధులతో పాటు నిధులూ కేటాయించామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్.సవిత వెల్లడిరచారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితను మంగళవారం ఎమ్మెల్యే అరవింద్ బాబు, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వెంకట గురుమూర్తి సహా బీసీ సంఘాల నాయకులు కలిశారు. ఈ నెల ఆరో తేదీన కృష్ణా జిల్లా అవనిగడ్డ డిగ్రీ కళాశాల మైదానంలో జరగనున్న తన ఆత్మీయ అభినందన సభకు హాజరుకావాలని మంత్రి సవితను అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు కోరారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన చిలకలపూడి పాపారావును అభినందించారు. టీడీపీ ఆది నుంచి బీసీలకు పెద్దపీట వేస్తోందన్నారు. బడుగు, బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం కల్పించిన ఘనత అన్న ఎన్టీఆర్, సీఎం చంద్రబాబుదేనని తెలిపారు. జగన్ పాలనలో బీసీ కార్పొరేషన్లన్నీ నిర్వీర్యమయ్యాయన్నారు. వైసీపీ నేతలకు రాజకీయ ఉపాధి కల్పించడానికే జగన్ బీసీ కార్పొరేషన్లకు పాలక మండళ్లను నియమించారన్నారు.
కేవలం పదవులు మాత్రం కట్టబెట్టి, నిధులు కేటాయించలేదన్నారు. సీఎం చంద్రబాబునాయుడు తన పాలనా కాలంలో బీసీల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలు అమలు చేశారన్నారు. ఇటీవల బీసీ కార్పొరేషన్లకు పాలక మండళ్లను నియమించమే కాకుండా నిధులు సైతం కేటాయించారన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి రూ.39 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించారన్నారు. బీసీల అభివృద్ధి పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ నిధుల కేటాయింపే నిదర్శనమన్నారు. వెనుకబడిన తరగతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను, పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్పొరేషన్ల చైర్మన్లు పాపారావుకు, వెంకటగురుమూర్తికి సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు దేవుళ్ల మురళి, కేసన శంకరరావు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.