- చంద్రబాబు సారధ్యానికి తిరుగులేదు
- రాష్ట్రాభివృద్ధిలో కేంద్ర సహకారం మరువలేనిదే
- పదేళ్లుగా గడ్కరీని చూసి ప్రభావితమయ్యా..
- కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు
- అడిగిందే తడవుగా ప్రాజెక్టులు: గడ్కరీని పెమ్మసాని థాంక్స్
- జాతీయ రహదారులంటేనే గడ్కరీ: శ్రీనివాస వర్మ
మంగళగిరి (చైతన్య రథం): ఏపీలో కూటమి విజయం సాధించడమే రాష్ట్రాభివృద్ధికి శుభసూచకమని కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. కూటమి గెలుపుతోనే రాష్ట్రానికి శుభఘడియలు వచ్చాయన్నారు. ఎన్నికలకు ముందు రైతులకిచ్చిన హామీని నేడు కూటమి నెరవేర్చిందని, అదే రోజు రాష్ట్ర ప్రగతి సూచికలైన రహదార్ల నిర్మాణానికి శంఖుస్థాపనలు చేయడం చారిత్రక దినమేనని అభివర్ణించారు. మంగళగిరి వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రంలోని దాదాపు రూ. 5వేల కోట్ల విలువైన జాతీయ రహదారులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌వల్ల అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నామన్నారు. ‘‘రోడ్ల బడ్జెట్ను రూ.3 లక్షల కోట్లకు తీసుకెళ్లిన ఘనత గడ్కరీదే. ఆయన చొరవతోనే రోజుకు దేశవ్యాప్తంగా 30 కి.మీ హైవే నిర్మాణం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు, విశాఖ ఉక్కుకు కేంద్రం అండగా నిలబడిరది. విశాఖ రైల్వే జోన్‌కు అడుగులు వేగంగా పడుతున్నాయి. గతంలో చేయలేని అభివృద్ధిని ఇవాళ ఎలా చేస్తున్నామో ప్రజలు ఆలోచించాలి. రాష్ట్ర భవిష్యత్‌ను తొక్కుకుంటూ వెళ్లే నాయకులతో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం జరగాలి. మొక్కనాటి పెద్దదై ఫలాలు ఇచ్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి చెట్టును కసాయికి అప్పగిస్తే మొత్తం చెట్టునే తొలగిస్తాడు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి. రోడ్ల అభివృద్ధిపై అనేక కార్యక్రమాలు ఆధారపడి ఉంటాయి. రాష్ట్రంలో 28 రోడ్ల ప్రాజెక్టులు తలపెట్టాం. అవన్నీ నిర్ణీత సమయంలో పూర్తవుతాయి. సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన పీ-4 కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు.. గడ్కరీ దగ్గర కూడా ఉంది. ఆయన పాజిటివ్, ప్రోయాక్టివ్, ప్రాక్టికల్, పీస్‌ఫుల్ (పీ-4) కేంద్ర మంత్రి. ఆయన వద్దకు వెళ్లినవారు నవ్వుకుంటూ బయటకు వస్తారు. పదేళ్లుగా నితిన్ గడ్కరీ పని చూసి చాలా ప్రభావితమయ్యా. 2014లో దేశంలో 74 విమానాశ్రయాలుఉంటే ఇప్పుడు 162 అయ్యాయి’’ అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ‘గడ్కరీకి ధన్యవాదాలు చెబుతున్నా. రోజుకు 30నుండి 40 కిలోమీటర్లు మేర జాతీయ రహదారులు నిర్మిస్తున్నారు. వైట్ కాంక్రిట్, రీసైకిల్ ప్లాస్టిక్‌తో రోడ్లు నిర్మిస్తున్నారు. రాజకీయాల్లోకి వస్తున్న మాలాంటి వారికి గడ్కరీ ఆదర్శం. 140 మీటర్ల అవుటర్ రింగ్ రోడ్డుకు అనుమతి ఇచ్చినందుకు ఈ ప్రాంతం తరపున ధన్యవాదాలు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ఉన్నప్పుడు 160 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్డుకు శంఖుస్ధాపన చేశారని, అలాగే 5000 ఎకరాలు సేకరణ చేసి అంతర్జీతీయ విమానాశ్రమం హైదరాబాద్‌లో నిర్మింపచేశారని, హైదరాబాద్‌లోని మెట్రో రైలుకు చంద్రబాబే శంఖుస్ధాపన చేశారు’ అని పెమ్మసాని గుర్తు చేశారు. గత ఐదేళ్లూ రాష్ట్రంలో చంద్రబాబు పాలన కొనసాగివుంటే అమరావతి ఎప్పుడో ఆవిష్కృతమై ఉండేదని పెమ్మసాని అన్నారు.
మరో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఏపీకి నేడు కీలకమైన రోజు. అటు రైతు ఖాతాలో సుఖీభవ సొమ్ములు పడ్డాయి. ఇటు రాష్ట్ర ఖాతాలో జాతీయ ప్రాజెక్టులూ పడ్డాయి అన్నారు. జాతీయ రహదారుల పేరుచెపితే గుర్తుకు వచ్చేది నితిన్ గడ్కరీ అంటూ.. ఆయన కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టాక జాతీయ రహదారుల రూపురేఖలే మార్చేశారన్నారు. రహదారులు విషయంలో కేంద్రంలో గడ్కరీ, రాష్ట్రంలో చంద్రబాబు ఎంతో కృషిచేస్తున్నారన్నారు.