కడప (చైతన్యరథం): వైఎస్‌ఆర్ కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మంగళవారం ఎన్నికలు నిర్వహించనున్నారు. పులివెందుల, ఒంటిమిట్ట ఎంపీడీవో కార్యాలయాల్లో ఎన్నికల సిబ్బందికి సామగ్రిని అధికారులు అందజేశారు. ఈ రెండు జెడ్పీటీసీ స్థానాల్లో 11 మంది చొప్పున అభ్యర్థులు పోటీపడుతున్నారు.
పులివెందుల జెడ్పీటీసీ స్థానం పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో 10,600 మంది, ఒంటిమిట్ట పరిధిలోని 30 పోలింగ్ కేంద్రాల్లో 24వేల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. రెండు మండలాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట సరిహద్దు, జిల్లా సరిహద్దులో ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. పులివెందులలో బందోబస్తును కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ పూర్తయ్యే వరకు స్థానికేతరులు ఉండకూడదని పోలీసులు హెచ్చరించారు. పులివెందుల జడ్పీటీసీ పరిధిలోని గ్రామాలు సమస్యాత్మకం కావడంతో.. దాదాపు 700 మందితో భారీ భద్రతను పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. పులివెందుల జడ్పీటీసీ పరిధిలోని ఆరు గ్రామ పంచాయతీల పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది
వైసీపీ పిటిషన్ తిరస్కరణ
పులివెందులలో పోలింగ్ కేంద్రాల మార్పుపై వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు తోసిపుచ్చింది. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలింగ్ బూత్‌ల మార్పుపై జోక్యం చేసుకోవాలంటూ వైసీపీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం విచారణకు స్వీకరించిన హైకోర్టు… ఈ దశలో జోక్యానికి నిరాకరించింది.ఆరు పోలింగ్ బూత్‌లు మార్చాలంటూ లేళ్ల అప్పిరెడ్డి తన పిటిషన్‌లో కోరారు. అయితే మరికొన్ని గంటల్లో పోలింగ్ జరుగుతుందని హైకోర్టుకు ఎన్నికల సంఘం తరఫున న్యాయవాదులు స్పష్టం చేశారు. అంతేకాదు.. ఎన్నికల ప్రక్రియ సైతం ప్రారంభమైందని కోర్టుకు వారు వివరించారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు పిటిషన్‌ను తోసిపుచ్చింది.