- మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాం
- అధికారంలోకి రాగానే 217 జీవోను రద్దు చేశాం
- గత ప్రభుత్వ బకాయిలు మూడున్నర కోట్లు, డీజిల్ సబ్సిడీ రూ.34 కోట్లు విడుదల చేశాం
- మత్స్యకారులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం
అమరావతి (చైతన్యరథం): మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధి అవకాశాల కోసం మత్స్య రంగంలో సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థక, పాడి అభివృద్ధి, మత్య్స శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఉద్ఘాటించారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధి, భద్రత కోసం మత్స్య రంగంలో ఎదురవుతున్న క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలను కనుగొనేందుకు ప్రతి ఏటా నవంబర్ 21న ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుదీర్ఘతీర ప్రాంతంతో 2.26 లక్షల హెక్టార్ల ఆక్వా కల్చర్ వనరులను కలిగి ఉందన్నారు. దేశంలో 75 శాతం కంటే ఎక్కువ రొయ్యలను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, భారతదేశ
ఆక్వా హబ్‌గా ఏపీ నిలుస్తోందన్నారు.
ఆక్వా రంగానికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తే రాష్ట్రానికి అత్యధిక ఆదాయం వస్తుందన్నారు. దివంగత నేత ఎన్టీ రామారావు హయాం నుంచీ మత్య్పకారులకు టీడీపీ ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయని, ఆ ఒరవడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారన్నారు. మత్స్యకారులకు రాజకీయంగా ప్రముఖ స్థానం కల్పించడమే కాకుండా వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు మత్స్యకారులను పట్టించుకున్న పాపాన పోలేదని, కేంద్రం నుంచి నిధులను కూడా పొందలేకపోయారన్నారు. అంతేకాకుండా 217 జీవో తెచ్చి మత్స్యకారుల జీవితాలను అంధకారంలోకి నెట్టేశారన్నారు. కేరళ రాష్ట్రంలో మాదిరిగా ప్రతి 30 కిలోమీటర్‌కు ఒక హార్బర్, ఒక జెట్టీ, ఫిష్ ల్యాండిరగ్ సెంటర్.. ఏదో ఒకటి ఏర్పాటు చేస్తే మత్స్యకారులకు మేలు కలుగుతుందన్నారు.
2014-19 లో ఇచ్చిన మాట మేరకు వేట సమయంలో మృతి చెందిన వారికి రూ. 5 లక్షలు ఇచ్చేవారమని, గత ప్రభుత్వ హయాంలో కొద్దిమందికి మాత్రమే చెల్లించి మిగతా వారికి మొండి చేయి చూపించారన్నారు. ఆ బకాయిలు మూడున్నర కోట్లు, డీజిల్ సబ్సిడీ రూ. 34 కోట్లు అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. జోన్, నాన్-జోన్ అనే తేడా లేకుండా అందరికీ విద్యుత్ సబ్సిడీ అందిస్తామన్నారు. మత్స్యకారులకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామన్నారు. సముద్రంలో వేటకు వెళ్లే బోట్‌కు ట్రాన్స్‌పాండర్స్ బిగిస్తే చేపలు ఎక్కడ ఉన్నదీ, తుపానుల తీవ్రత, అకాల వర్షాల సమాచారం తెలుస్తుందన్నారు. ఇప్పటికే 4,500 బోట్లకు ట్రాన్స్‌పాండర్స్ ఏర్పాటు చేశామని.. రాష్ట్రంలో మొత్తం 30,000 బోట్లకు కూడా వాటిని ఏర్పాటు చేస్తామన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం జీవో 217 రద్దు: మంత్రి కొల్లు
ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ దేశంలో 1997 నుండి ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, భవిష్యత్ తరాలకు ఈ సంప్రదాయాన్ని అందించేలా రాష్ట్రంలో కూడా నిర్వహిస్తున్నామన్నారు. మత్స్యకారులకు అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయని, చాలా పథకాలు ప్రచారంలోకి రావటం లేదన్నారు. మత్స్యకారులకు రూ. 750 కోట్లు బడ్జెట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కేటాయించారన్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు చెల్లించే భృతిని చంద్రబాబు నాయుడే తీసుకొచ్చారన్నారు. జీవో 217 మత్స్యకారుల జీవితాలను అంధకారంలోకి నెట్టిందని…దానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక పోరాటాల చేశామని.. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే ఆ జీవోను రద్దు చేశామన్నారు.
కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మత్స్యకారులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆ ఇబ్బందులు తొలగిపోయాయన్నారు. 217 జీవోకు వ్యతిరేకంగా పోరాడిన సమయంలో చంద్రబాబు మాకు అండగా నిలబడ్డారని.. అధికారంలోకి రాగానే
ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం ఆ జీవోను రద్దు చేశారన్నారు.
తొలుత మంత్రులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆక్వా ఉత్పత్తులపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించారు. మత్స్యకార రంగంలో విశిష్ట సేవలు అందించిన వారిని అవార్డులతో సత్కరించారు కార్యక్రమంలో శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, ఏపీ ఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్, డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, ఏపీ రాష్ట్ర ఆక్వా కల్చర్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఆనం వెంకట రమణ రెడ్డి, రాష్ట్ర పశు సంవర్థక, పాడి అభివృద్ధి, మత్స్య శాఖ కార్యదర్శి ఎం.ఎం. నాయక్, మత్స్యశాఖ కమిషనర్ టి. డోలా శంకర్, వివిధ మత్స్యకార సంఘాల ప్రతినిధులు, తదితరలు పాల్గొన్నారు.