- రాష్ట్రంలో విద్యా సంస్కరణలపై దేశవ్యాప్తంగా చర్చ
- ఈనాటి షైనింగ్ స్టార్లే రాష్ట్ర విద్యావ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్లు
- ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాం
- వచ్చే ఏడాదినుంచి ప్రభుత్వ స్కూళ్ల ఉత్తమ ఫలితాలపై ప్రకటనలు
- కష్టపడి పనిచేయడంలో చంద్రబాబుని స్ఫూర్తిగా తీసుకోవాలి
- షైనింగ్ స్టార్స్ పేరుతో ఉత్తమ విద్యార్థులకు మంత్రి లోకేష్ అభినందన
అమరావతి (చైతన్యరథం): మేము చేపట్టిన సంస్కరణల కారణంగా ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో అద్భుతాలు జరుగుతున్నాయి, దీనిపై దేశవ్యాప్తంగా చర్చసాగుతోంది, రాబోయే రోజుల్లో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ కోసం పట్టుదలతో ముందుకు సాగుతామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో మంగళవారం జరిగిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఇటీవల విడుదలైన పదోతరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రతిభ కనబర్చిన 47 మంది విద్యార్థులను మంత్రి లోకేష్ సన్మానించారు. సన్మాన గ్రహీత విద్యార్థులకు గిఫ్ట్ హ్యాంపర్, శాలువా, మెడల్ బహూకరించారు. అంతే కాకుండా జాతీయ, అంతర్జాతీయస్థాయి స్ఫూర్తి ప్రదాతలు రచించిన 9 పుస్తకాలు.. బిల్ గేట్స్ (సోర్స్ కోడ్), థామస్ మాథ్యూస్ (రతన్ టాటా ఎ లైఫ్), ఎపిజె అబ్ధుల్ కలాం (వింగ్స్ ఫైర్), ఇంద్రానూయి (మై లైఫ్ ఇన్ ఫుల్), శరణి పొంగూరు (మైండ్ సెట్ షిఫ్ట్), జాన్ క్లియర్ (అటమిక్ హ్యాబిట్స్), యండమూరి వీరేంద్రనాథ్ (విజయానికి 5మెట్లు), గుంటూరు శేషేంద్రశర్మ (ఆధునిక మహాభారతం), చాగంటి కోటేశ్వరరావు (వినదగునెవ్వరు చెప్పిన).. కూడా బహుకరించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది, ఆర్థిక ఇబ్బందులున్నా తల్లిదండ్రులు తలెత్తుకు తిరిగేలా చేశారని ప్రశింసించారు. ఎన్నికష్టాలు ఎదురైనా లక్ష్యసాధన కోసం జీవితంలో కసి, పట్టుదలతో ముందుకు సాగాలి. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును చూసి విద్యార్థులు నేర్చుకోవాలి. ప్రజలకు సేవచేయాలన్న తపనతో ఆయన అహర్నిశలు కష్టపడుతుంటారని మంత్రి లోకేష్ చెప్పారు.
సవాళ్లు ఎదురైనా సంస్కరణలు ముందుకే
అనేక సవాళ్లు ఉన్నప్పటికీ విద్యాశాఖలో సంస్కరణలు చేపడుతున్నాం. ప్రభుత్వ విద్యావ్యవస్థలో మార్పు తేవాలని పట్టుదలతో ముందుకు సాగుతున్నాం. నేడు మీరు సాధించిన విజయాల వల్ల సమాజంలో ప్రభుత్వ విద్యపై నమ్మకం పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థకు మీరే బ్రాండ్ అంబాసిడర్లు. వచ్చే ఏడాది నుంచి ప్రైవేటు స్కూళ్ల మాదిరి ప్రభుత్వ స్కూళ్లలో ఉత్తమ ఫలితాలపై పత్రికల్లో ప్రకటనలు ఇస్తాం. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. కష్టతరమైన విద్యాశాఖను కావాలని సీఎం చంద్రబాబుని అడిగి తీసుకున్నా. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరాలంటే కఠినమైన లక్ష్యాలను ఎంచుకుని ముందుకుసాగాలి. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావించినపుడు 1985 తర్వాత తెలుగుదేశం పార్టీ గెలవని మంగళగిరిని ఎంపికచేసుకున్నా. 2019లో తొలి ప్రయత్నంలో ఓడిపోయాను. ఆ తర్వాత 2వ రోజు నుంచీ అయిదేళ్లపాటు కష్టపడి పనిచేసి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో టాప్ ` 3 మెజారిటీతో విజయం సాధించా. కష్టానికి ప్రత్యామ్నాయం లేదన్న విషయం విద్యార్థులంతా గ్రహింపులోకి తీసుకోవాలని మంత్రి లోకేష్ ఉద్బోధించారు.
ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అండగా నిలుస్తాం
జీవితం అనేది నల్లేరుపై నడకకాదు. భగవంతుడు ఒక్కో కుటుంబానికి ఒక్కో పరీక్ష పెడతాడు. ఆ పరీక్షను ఎదుర్కోనే శక్తిని కూడా ఇస్తాడు. పరీక్షను సవాలుగా తీసుకుని అధిగమించే వారే విజేతలుగా నిలుస్తారు. నేను విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వ విద్యలో ప్రారంభించిన సంస్కరణలను జూన్ నెలాఖరుకు పూర్తిచేస్తాం. బాలికావిద్యకు పెద్దపీట వేస్తూ విద్యావ్యవస్థలో మార్పులు తేవాలని నేను యువగళం పాదయాత్ర చేసేటప్పుడే నిర్ణయించుకున్నా. అధికారంలోకి వచ్చాక మహిళలను గౌరవిస్తూ పాఠ్యపుస్తకాల్లో ఇంటిపనుల చిత్రాలను స్త్రీ, పురుషులకు చెరో సగం కేటాయించాం. తల్లిదండ్రులు కలలు నెరవేర్చడానికి విద్యార్థులు కష్టపడటంతో ఇష్టపడి చదవాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలను కూడా బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాం. అందువల్లే ఈ ఏడాది ఉత్తమ ఫలితాలు వచ్చాయి. ఉన్నత విద్యలో పూర్తి ఫీజు రీ యింబర్స్ మెంట్, పీజీ ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలుచేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్నిరకాలుగా అండగా నిలుస్తాం. ఇప్పుడు మీరు సాధించిన విజయాలు చూసి తర్వాత బ్యాచ్ విద్యార్థులు స్ఫూర్తి పొందాలి. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు కన్నా తక్కువకాదనేందుకు మీరు సాధించిన ఫలితాలే నిదర్శనం. వందరోజుల యాక్షన్ ప్లాన్‌తో మంచి ఫలితాలు సాధించిన అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నానని మంత్రి లోకేష్ అన్నారు.
పేదరికం నుంచి బయటపడేసే ఆయుధం విద్య!
విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ మాట్లాడుతూ… ఈ రోజు అద్భుత విజయాలు సాధించిన ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులను చూస్తుంటే రెండు కళ్లు సరిపోవడం లేదన్నారు. మంత్రి లోకేష్‌కు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులంటే అమితమైన ప్రేమ. విద్య అనేది పేదరికం నుంచి బయటపడేసే బలమైన ఆయుధం. సమాజంలోని జఠిల సమస్యల పరిష్కారం విద్యద్వారా మాత్రమే సాధ్యం. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు సాధించిన ఈ విజయాలు భవిష్యత్ బ్యాచ్‌లకు స్ఫూర్తినిస్తాయి. మీ నుంచి సునితా విలియమ్స్, సుందర్ పిచాయ్, అబ్దుల్ కలామ్ వంటి మేధావులు రావాలి. జూనియర్లను ప్రోత్సహించి ప్రభుత్వ బడులు ప్రైవేటుకు తక్కువకాదని చాటిచెప్పాలని కోరారు.
పాఠశాల విద్యశాఖ కమిషనర్ విజయరామరాజు మాట్లాడుతూ… ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాధించిన విజయాలు వారి భవిష్యత్తుకు నిచ్చెనమెట్లుగా పేర్కొన్నారు. మీలో చాలామంది ఐఎఎస్ కావాలని తమ మనోగతాన్ని వ్యక్తం చేయడం ఆనందంగా ఉంది. జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి ఇదొక ప్లాట్ ఫాం లాంటిది. వచ్చేఏడాది టాప్ -20లో అత్యధికులు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు ఉండేలా కృషిచేస్తాం. డిసెంబర్ నాటికి సిలబస్ పూర్తిచేసి వందరోజుల యాక్షన్ ప్లాన్ ద్వారా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకతరగతులు నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధిస్తామన్నారు.
డ్రీమ్ వాల్ పై విద్యార్థుల భవిష్యత్ లక్ష్యాలు
ఈ సందర్భంగా విద్యార్థులు జీవితంలో తమ లక్ష్యాన్ని వివరిస్తూ డ్రీమ్ వాల్ పై మనోగతాన్ని తెలియజేశారు. ఐఎఎస్ అయి దేశానికి, రాష్ట్రానికి సేవలందించాలని భావిస్తున్నట్లు చంద్రకళ, సమీర, సుచరిత, అక్షిత, సాయిరామ్, కీర్తిక, డ్రీమ్ వాల్‌పై తమ మనోభావాలను వెల్లడిరచగా, అనంతపురానికి చెందిన లక్ష్మీనరసింహారెడ్డి ఏరోనాటికల్ ఇంజీనీర్ కావాలన్నది తమ లక్ష్యంగా వాల్ పై రాశాడు. డేటా సైంటిస్ట్ కావాలని ఉందని తిరుపతికి చెందిన అనీష్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావాలని ఉందని దాక్షిణ్య (అనంతపురం), దివ్యశ్రీ (బాపట్ల), డాక్టర్ అయి పేదలకు సేవచేస్తామని హర్షిత (శ్రీకాకుళం), ఆశాజ్యోతి (అనకాపల్లి), ఇన్‌కంటాక్స్ ఆఫీసర్ కావాలని ఉందని సంతోష్ (చీరాల) రాశారు.
ఆ తర్వాత గ్రాటిట్యూడ్ వాల్ పై జీవితంలో తమ ఉన్నతికి కృషిచేసిన తల్లిదండ్రులు, టీచర్ల పేర్లను లిఖించారు. విలువలపై అవగాహన పెంపొందించే వాల్యూస్ జంగా బ్లాక్ ద్వారా జీవితంలో తమ ప్రాధాన్యతలను వ్యక్తీకరించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య డైరక్టర్ విజయరామరాజు, సర్వశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరక్టర్ బి.శ్రీనివాసరావు, ఏపీడీ శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.