- శ్రీశైల దేవస్థానం అధికారులకు మంత్రి మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆదేశం
- బ్రహ్మోత్సవాలకు మంత్రిని ఆహ్వానించిన దేవస్థాన ఈవో, అర్చకులు
అమరావతి (చైతన్యరథం): శ్రీశైలంలో అత్యంత వైభవంగా నిర్వహించే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులను రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖల మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలోని కార్యాలయంలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని శనివారం శ్రీశైలం దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు, ఆలయ అర్చకులు మర్యాదపూర్వకంగా కలిసి, శ్రీశైలంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఆహ్వానపత్రిక అందజేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైలంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల సన్నద్ధతపై ఈ నెల 10వ తేదీన శ్రీశైలం ఆలయ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రుల కమిటీ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరగనున్న నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు జరుగుతున్న ఏర్పాట్లు, భక్తుల సౌకర్యార్థం తీసుకుంటున్న జాగ్రత్తలు, భద్రతా చర్యలపై ఆలయ ఈవోని మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా మంత్రికి శ్రీశైల మల్లిఖార్జున స్వామి ` భ్రమరాంబ అమ్మవార్ల ప్రతిమను, ఆలయ డైరీ, క్యాలండర్‌ను ఈవో అందజేశారు. మంత్రికి స్వామి వార్ల తీర్థ ప్రసాదాలు అందజేసి, ఆలయ పండితులు వేదాశీర్వచనం అందజేశారు.