- ఉల్లి రైతులకు అండగా కూటమి ప్రభుత్వం
- హెక్టారుకు రూ. 50 వేల సాయం రైతుల ఖాతాల్లో జమ
- పరిహారం పంపిణీ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు
- కర్నూలు, కడప జిల్లాలకు చెందిన 37,752 మంది రైతులకు 5.50,000 ໖ .128.33 కోట్లు రూపాయలు జమ
కర్నూలు (చైతన్యరథం): రైతు శ్రేయస్సే తమ ప్రభుత్వ ధ్యేయం అని, కూటమి ప్రభుత్వం
ఎల్లప్పుడూ అన్నదాతకు అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, పశుసంవర్థక శాఖ మంత్రి వర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉల్లి సాగుతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జిల్లాలో అకాల
వర్షాలతో ఉల్లి రైతులు తీవ్రమైన పంట నష్టం, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు.. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుల సంక్షేమం,వారిని ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వంపనిచేస్తోందన్నారు. ఉల్లి రైతులకు హెక్టారుకు రూ.50,000 ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని, ఆ మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే రూ.130 కోట్లు మంజూరు చేశారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు..
టీడీపీ హయాం.. ఇరిగేషన్కు స్వర్ణయుగం
రాష్ట్ర అభివృద్ధికి నీటి పారుదల, వ్యవసాయ రంగాలు అత్యంత కీలకమన్నారు.. 2014-2019 కాలంలో వ్యవసాయ, ఇరిగేషన్ రంగాలకు స్వర్ణ యుగంగా మంత్రి అభివర్ణించారు. ఆ సమయంలో దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసమే రూ. 50 వేల కోట్ల ఖర్చు చేసి శరవేగంతో ముందుకు తీసుకెళ్లామన్నారు. వ్యవసాయ రంగం లో 7-8 ఉన్న జిడిపి ని 17 శాతం వరకు తీసుకొని వెళ్లి దేశంలోనే అగ్రగామిగా నిలిపామన్నారు.. 2019 తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ రెండు ముఖ్యమైన శాఖలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో ఇరిగేషన్ రంగానికి ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీరిచ్చే విధంగా ఇరిగేషన్ రంగంలో పనులు చేస్తామన్నారు.
మద్దతు ధరకు కొనుగోలు
తాను వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత మొదటిగా మిరప పంటకు ధర పడిపోయిందని, కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుని మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు చేసి,మార్కెట్ను స్థిరీకరించి మిర్చి రైతులను ఆదుకున్న ప్రభుత్వం తమది అని మంత్రి పేర్కొన్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోకో పంట ధర పడిపోతే, కేజీకి రూ.50 రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చి కోకో రైతులను ఆదుకునేందుకు రూ.15 నుండి 20 కోట్ల దాకా ఖర్చు చేశామన్నారు. అదే విధంగా ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల కోసం రూ.12 వేల గిట్టుబాటు ధర కల్పించి, రూ.300 కోట్లు ఖర్చు చేశామన్నారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు 12 రూపాయల ధరను నిర్ణయించి, అందులో 4 రూపాయలు ప్రభుత్వం భరించేలా, మిగిలిన 8. రూపాయలు పరిశ్రమల వారు చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. చెప్పినట్లుగానే ప్రభుత్వం కేజీకి 4 రూపాయల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో చేసిందన్నారు.
ఉల్లి రైతుల విషయానికి వస్తే, కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యం అని ప్రకటించినప్పుడు హెక్టారుకు 17,500 రూపాయలు ఇస్తారని, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో అడుగు ముందుకేసి దానికి 7,500 రూపాయలు కలిపి హెక్టారుకు మొత్తం 25,000 రూపాయలు ఉల్లి రైతులకు అందించారన్నారు. కానీ ఈ ఏడాది కర్నూలు జిల్లాలో అనుకోని ప్రకృతి వైపరీత్యం వల్ల రైతులు పెట్టుబడి పెట్టి చాలా నష్టపోయారన్నారు. కిలో ఉల్లిపాయలను 12 రూపాయల చొప్పున కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. అప్పటికే భారీ వర్షాలు కురుస్తుండటంతో సరైన ప్రణాళిక లేకపోతే రైతులు భారీగా నష్టపోతారని సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లగా ఆయన వెంటనే స్పందిస్తూ, మనకు రైతులే ప్రాధాన్యం అని చెప్పారన్నారు. ఇప్పటివరకు హెక్టారుకు 25,000 రూపాయల పరిహారం ఇచ్చేవాళ్లం, ఇప్పుడు మరో 25,000 కలిపి,హెక్టారుకు మొత్తం 50,000 రూపాయలను ఉల్లి రైతులకు అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి చెప్పారన్నారు. చెప్పినట్లుగా 130 కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కర్నూలు, కడప జిల్లాలకు చెందిన 37,752 మంది రైతులకు 50,000 చొప్పున రూ.128.33 కోట్లు రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. కర్నూలు జిల్లాలోనే 31,352 మంది రైతులకు రూ.99.92 కోట్లు జమ చేస్తున్నామన్నారు.
రైతులకు ఇబ్బంది లేకుండా..
గత ప్రభుత్వం వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించి ఏ కార్యక్రమం చేపట్టలేదని, తమ ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్ లాంటి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. గత ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద 2,200 కోట్లు బడ్జెట్ కేటాయించి, 5 సంవత్సరాల్లో కేవలం 1400 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వంలో 2025-26లో ధరలు తగ్గితే ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో బడ్జెట్లో 300 కోట్ల రూపాయలు పెట్టామన్నారు. అయితే బడ్జెట్ కేటాయింపులకు మించి 300 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పొగాకు కొన్నామని, మామిడికి 270 కోట్లు ఇచ్చామని, ఉల్లి వంట నష్టానికి 130 కోట్లు ఇచ్చామన్నారు. ఎక్కడ ఏ పంటకు నష్టం వచ్చినా, రైతులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు. తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్ళలో రూ.1400 కోట్లు ఖర్చు పెడితే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 18 మాసాల్లో రూ.1170 కోట్లు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద ఖర్చు పెట్టి, నేరుగా రైతుల అకౌంట్లలో వేశామన్నారు. అన్నదాత సుఖీభవ కింద రెండు విడతలుగా రూ.14000 ఇచ్చాం, ఫిబ్రవరిలో ఇచ్చే రూ.6000తో కలిపితే.. ఇచ్చిన మాట ప్రకారం మొత్తం రూ.20000 రైతుల ఖాతాల్లో జమచేసినట్లవుతుందన్నారు.
జోరుగా సంక్షేమం, అభివృద్ధి
గతంలో కంటే పెన్షన్లను గణనీయంగా పెంచామని, కేవలం 18 నెలల కాలంలోనే పెన్షన్ల కోసం సుమారు 50,000 కోట్ల రూపాయలను నేరుగా ప్రజలకు అందించినట్లు తెలిపారు. మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని, స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నామని, ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నట్లు మంత్రితెలిపారు. ఒక పక్క సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే.. అభివృద్ధిలో భాగంగా ఇరిగేషన్ కి ఈ 18 నెలల్లోనే రూ.12 వేల కోట్లు చేశామని, హంద్రీ-నీవా పూర్తి చేశామన్నారు. ప్రధాన మంత్రి సుజల పథకం కింద గత ప్రభుత్వం ఒక్క పైసా వాడుకోకుండా, పథకం ముగిసిపోతుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కలిసి ఆ పథకాన్ని పొడిగించేలా కృషి చేశారన్నారు. 2028 నాటికి ఇచ్చిన మాట ప్రకారం, మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం, ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చే బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
ఉద్యోగాల కల్పన
రాష్ట్రంలో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత, ఉమ్మడి రాష్ట్రంలో, విభజన తర్వాత మొత్తం 12 సార్లు ఉపాధ్యాయ నియామకాలు జరిగితే, అందులో 9 సార్లు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు హయాంలోనే జరిగాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఎటువంటి సమస్యలు లేకుండా 16,000 టీచర్ పోస్టులను భర్తీ చేసి పాఠశాలలకు ఉపాధ్యాయులను నియమించా మన్నారు. అదే విధంగా 6,000 మందికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలను ఇచ్చామని, ఇప్పుడు మళ్ళీ గ్రూప్-2 పోస్టుల నియామకాలు చేపడుతున్నా మన్నారు. ప్రైవేట్ ఉద్యోగాలు కూడా రావాలి అంటే రాష్ట్రానికి భారీ పరిశ్రమలు రావాలన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక వేత్తలకు రాష్ట్రంపై తిరిగి నమ్మకం కలిగించామన్నారు. నేడు దేశంలోనే పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతానికి పైగా ఏపీ కి వచ్చినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదికలో వెల్లడయిందన్నారు. ఇది సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సాధించిన విజయమని మంత్రి తెలిపారు.
రైతు ద్రోహి జగన్
గత 18 నెలలుగా ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సమర్థవంతంగా పరిపాలన అందిస్తున్నామన్నారు. గత వైసీపీ పాలనలో రైతులను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీవ్రంగా మోసం చేశారని, వ్యవసాయ, అనుబంధ రంగ శాఖల పరిస్థితి ఆధ్వానంగా తయారుచేశారని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, ముఖ్యంగా ఉల్లి రైతుల విషయంలో పూర్తిగా చేతులెత్తేశారని ఆయన మండిపడ్డారు. రాయలసీమ బిడ్డని అంటూ జగన్ సీమ ప్రజల్ని మోసం చేసాడని అన్నారు.
రైతులకు మద్దతు ధర, మార్కెట్ జోక్యం, నిల్వ సదుపాయాలు కల్పిస్తామంటూ పెద్దపెద్ద హామీలు ఇచ్చిన వైసీపీ నేతలు వాటన్నింటినీ గాలికొదిలేశారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని ప్రభుత్వం అది. రైతుల కష్టాలు కనిపించని అంధ పాలన అది.. అంటూ జగన్ పాలనను తీవ్రంగా ఎండగట్టారు. మా ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను చేతల్లో చూపిస్తోంది. రైతు సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతుల భవిష్యత్తును నాశనం చేసిన వైసీపీ పాలనను ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని, ఇకపై కూడా రైతుల సమస్యలపై రాజకీయాలు చేసే వారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని మంత్రి హెచ్చరించారు.















