- నేటి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
- మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడి
అగిరిపల్లి (చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు రాకకోసం అగిరిపల్లి ప్రజలు ఎంతో సంతోషంతో ఎదురు చూస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆగిరిపల్లిలో ఈనెల 11వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను స్థానిక మార్కెట్ యార్డ్‌లో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పీ ధాత్రిరెడ్డితో కలిసి గురువారం పరిశీలించిన అనంతరం పాత్రికేయులతో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈనెల 11వ తేదీ ఉదయం 10. 30 గంటలకు అగిరిపల్లి విచ్చేస్తారని, ముందుగా కులవృత్తుల వారిని వారి పని స్థలంలో కలిసి వారి పరిస్థితులను పరిశీలించి, సమస్యలను అడిగి తెలుసుకుని, వారికి మేలు చేసే కార్యక్రమాల గురించి తెలియజేస్తారన్నారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో ప్రజల సమస్యలను తెలుసుకుంటారని, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. తరువాత పార్టీ కార్యకర్తలతో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. నూజివీడు నియోజకవర్గంలో మామిడి రైతుల సమస్యలు, రోడ్లు, రిజర్వాయర్ల నుండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందించడం, లక్ష్మి వ్యాగ్రేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి, తదితర సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని మంత్రి పార్థసారథి చెప్పారు.
బీసీ సంక్షేమానికి రూ.47,450 కోట్లు
సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నదని, ప్రస్తుత బడ్జెట్లో బీసీల సంక్షేమానికి 47 వేల 450 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. చేనేత కార్మికులకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్‌కి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామనని, వడ్డెరలకు క్వారీల కేటాయింపులో 10 శాతం కేటాయింపు, గీత కార్మిక కుటుంబాలకు మద్యం షాపుల కేటాయింపులో 10 శాతం కేటాయించామన్నారు. అన్ని జిల్లాల్లో బీసీ భవనాలు నిర్మిస్తున్నామన్నారు. కేవలం సంక్షేమమే కాక అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యతను ఇస్తున్నామని, పేదలకు మంచి భవిష్యత్తు అందించేందుకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించేలా, యువతకు విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. సమాజంలో 70 నుండి 80 శాతానికి పైగా ఉన్న షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులకు చెందిన ప్రతీ కుటుంబం నుండి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు.
జన్మభూమి స్పూర్తితో పీ4 కార్యక్రమం
మన రాష్ట్రానికి చెంది దేశ, విదేశాలల్లో అత్యంత ధనికులుగా ఉన్నత స్థాయిలో ఉన్నవారు.. వారు జన్మించిన గ్రామంలో నిరుపేదల కుటుంబాలను దత్తత తీసుకుని, అభివృద్ధి చేసే దిశగా, వారి జీవితాలకు మార్గదర్శకులుగా చేసే కార్యక్రమమే పీ 4 కార్యక్రమమన్నారు. అత్యున్నత స్థానాల్లో ఉన్న పలువురు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారన్నారు. వారు దత్తత తీసుకునే కుటుంబంలోని పిల్లలు ఆర్థిక కారణాలతో విద్యను కొనసాగించలేకపోతే, దానిని సజావుగా సాగించేలా సహాయం చేస్తారన్నారు. అంతేకాక వారి కుటుంబంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కూడా సహకరిస్తారన్నారు.
అర్హులైన ప్రతీ పేదవాడికి సొంత ఇల్లు
రాష్ట్రంలో అర్హులైన ప్రతీ పేదవాడికి పక్క గృహాన్ని అందిస్తామని మంత్రి పార్థసారధి చెప్పారు. గత ప్రభుత్వం పేదల గృహ పథకాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. 2. 50 లక్షల రూపాయల యూనిట్ కాస్ట్‌కు కేవలం 1.80 లక్షల రూపాయలు మాత్రమే అందించిందన్నారు. కానీ తమ ప్రభుత్వం బీసీలు, ఎస్సీలకు ఇళ్ల నిర్మాణానికి అదనంగా 50 వేల రూపాయలు, ఎస్టీలకు 75 వేల రూపాయలు అందిస్తున్నదని, ఇందుకోసం 3 వేల 500 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని భరిస్తున్నదన్నారు. అంతేకాక బీసీల రక్షణ చట్టం రూపొందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. దేవాలయాలలో పనిచేసే నాయి బ్రాహ్మణులకు అందించే పారితోషికాన్ని 15 వేల నుండి 25 వేల రూపాయలకు పెంచామని మంత్రి పార్థసారథి చెప్పారు.