- తుని ప్రభుత్వాసుపత్రి ఐసీయూలో వైద్యం
- మెరుగైన వైద్యానికి మంత్రి ఆనం ఆదేశం
అన్నవరం (చైతన్య రథం): కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో స్మార్త ఆగమ పాఠశాలలో 8మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆరెంపూడి సత్రంలో మైసూరు దత్తపీఠం ఆధ్వర్యంలో నవకోటి దత్తయాగం ఈనెల 25నుంచి జరుగుతోంది. ఇందులో ఆగమ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న 35మంది విద్యార్థులు పాల్గొన్నారు. అక్కడే ఆహారం తీసుకుంటున్నారు. యాగం తర్వాత కొండపైన పాఠశాలలో బస చేస్తున్నారు. వీరిలో కొంతమంది విద్యార్థులకు బుధవారం మధ్యాహ్నంనుంచి జ్వరం, వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. పూర్తిస్థాయి వైద్యం అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. కేవలం ప్రాథమిక చికిత్స అందించారు. మాత్రలు, ఇంజెక్షన్లతో సరిపెట్టారు. కొండ దిగువున దేవస్థానం ఆసుపత్రిలో గురువారం ఉదయం నుంచి చికిత్స అందించారు. పరిస్థితి మెరుగుపడకపోవడంతో తుని ఆసుపత్రికి తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న డీఎంఅండ్‌హెచ్‌వో జె నరసింహ నాయక్ ఆసుపత్రికి చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు.
మెరుగైన వైద్యానికి మంత్రి ఆదేశం
అన్నవరం దేవస్థాన ఆగమ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురైన సమాచారం తెలుసుకున్న దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ వేగంగా స్పందించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారితో ఫోన్‌లో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం తీసుకున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలంటూ అధికారులను ఆదేశిస్తూ.. ఆరోగ్య పరిస్థితిని నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరించారు. తుని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అవసరమైతే ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని దేవస్థానం అధికారులను మంత్రి రామనారాయణ ఆదేశించారు.