- చట్టం తనపని తాను చేసుకుపోతుంది
- ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం
- మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి
ఒంగోలు (చైతన్యరథం): అక్రమ అరెస్టులకు కూటమి ప్రభుత్వం వ్యతిరేకమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీడోలా బాలా వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట శుక్రవారం మాజీ సీఎం దామోదరం సంజీవయ్య జయంతి వేడుకల్లో మంత్రి బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజీవయ్య విగ్రహానికి మంత్రి, జిల్లా కలెక్టర్, అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆయన సేవల్ని కొనియాడారు. అనంతరం మంత్రి బాలవీరాంజనేయ స్వామి మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ విషయంలో చట్టం తన పని తాను చేసుకుని పోయిందని తెలిపారు. గతంలో వైసీపీ ప్రభుత్వం చేసినట్లు తమ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయడం లేదన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విలువలకు కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై గత ప్రభుత్వం నాడు వ్యవహరించినట్లు తాము ప్రవర్తిస్తే సగం మంది వైసీపీ నాయకులు జైళ్లూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండేవారని చెప్పారు. పోలీసుల విచారణలో దోషులు అని తేలితేనే వారిని అరెస్టు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
హామీ ఇచ్చిన మేరకు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు ఏడాది పాటు అమ్మ ఒడిని అమలు చేయలేదన్న విషయాన్ని మంత్రి డోలా గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రోజులైనా గడవక ముందే పథకాల అమలుపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా నాయకుల పరిస్థితి మారలేదని అన్నారు. కందుకూరులో శనివారం జరిగే స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని మంత్రి బాలవీరాంజనేయస్వామి తెలిపారు.