- జగన్‌రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు మండిపాటు
- పొగాకు రైతుల మధ్య పొగ పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం
అమరావతి (చైతన్యరథం): చివరి ఆకు వరకు పొగాకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతులకు అన్ని విధాలా అండగా నిలబడుతుందని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పొగాకు పంటను కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం చేపట్టి, ఇందుకోసం ఆరు సబ్‌కమిటీలను ఏర్పాటు చేసి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నా జగన్ రెడ్డి విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మేలు రకం ఒక్కటే కాకుండా అన్ని రకాల గ్రేడ్‌లను కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన విషయం జగన్ రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో పొగాకుకు మద్దతు ధర లేక రైతులు రోడ్డెక్కినా ఒక్క రోజు కూడా పట్టించుకోలేదు. ప్రశ్నించిన రైతులపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేసింది మీరు కాదా? కూటమి ప్రభుత్వం వచ్చాక పొగాకు రైతులకు ఇన్సూరెన్స్ పునరుద్ధరించి, ప్రమాద బీమా రూ.7 లక్షలకు పెంచింది. ప్రత్యేక నిధితో ఆపత్కాల పరిహారం తక్షణంగా అందేలా చర్యలు తీసుకున్నాం. 2024-25లో గ్రేడ్-ఎ పొగాకు క్వింటాకు రూ.12,000, గ్రేడ్-బి కి రూ.5,400 ధర నిర్ణయించాం.
జీపీఐ, ఐటీసీ వంటి సంస్థలతో 20 మిలియన్ కిలోల కొనుగోలుకి ఒప్పందం చేశాం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను పునరుద్ధరించి, పత్తి, మిర్చి, పొగాకు పంటలకు బీమా కవరేజ్‌ను విస్తరించాం. గతంలో జగన్ రెడ్డి దుర్వినియోగం చేసిన ధరల స్థిరీకరణ నిధిని పునఃరుద్ధరించి రైతులను ఆదుకుందుకుంటున్నాం. మార్క్ ఫెడ్ ద్వారా 75 మిలియన్ కిలోలు కొనుగోలు చేపట్టాం. వైసీపీ హయాంలో పామాయిల్ ధరలు రూ.13 వేలు నుంచి రూ.15 వేలు ఉంటే నేడు రూ.20 వేలు నుంచి రూ.22 వేలు చెల్లిస్తున్నాం. రైతులకు వైసీపీ పాలన స్వర్ణయుగం అని జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ధాన్యం అమ్మిన రైతులకు రెండు సంవత్సరాలకు కూడా బకాయిలు చెల్లించకపోవడం, పంట నష్టపోయినా పరిహారం చెల్లించకపోవడం, నకిలీ విత్తనాలు, ఎరువులు పంపిణీ చేసి రైతులను దివాళా తీయించడం, ఆక్వాకి విద్యుత్ ధరలు పెంచడం, డ్రిప్, సబ్సిడీ యంత్రపరికరాలు, రైతు రథాలు వంటివి రద్దు చేయడమే మీరు సాధించిన స్వర్ణయుగమా? వ్యవసాయ శాఖను కూడా మూసేసి, రైతు సంక్షేమాన్ని అటకెక్కించి రైతులను వేధించిన చరిత్ర మీది కాదా అని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.
బురదజల్లడమే జగన్ పని
కూటమి ప్రభుత్వం రాయలసీమలో మిర్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. 2024-25లో మిర్చి క్వింటాకు రూ.25 వేలు ` 30 వేలుగా ధర నిర్ణయిచింది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామ నేపథ్యంలో కోకో పంటకు ధర పడిపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి కేజీకి రూ.50 చొప్పున రైతుకు చెల్లిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ వల్ల వైసీపీ హయాంలో సగటున రూ.250 నుంచి రూ.350 ఉన్నప్పుడు ఒక్క కేజీ అయినా కొనుగోలు చేసి ఒక్క రైతునైనా ఆదుకున్నారా? నేడు రూ.450 ధర పలుకుతున్నపటికీ రూ.50 అదనంగా ప్రభుత్వం చెల్లిస్తోంది. రవాణా ఖర్చులను తగ్గించేందుకు స్థానిక కొనుగోలు కేంద్రాలను కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రైతులను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోంది. కానీ జగన్ రెడ్డి మాత్రం బెంగళూరు ప్యాలెస్‌లో సేదదీరుతూ నెలకు రెండు సార్లు రాష్ట్రానికి వచ్చి విద్వేషాలు రెచ్చగొట్టే విన్యాసాలు చేసి ప్రభుత్వంపై బురదజల్లి తిరిగి బెంగళూరు ప్యాలెస్‌కు వెళ్ళిపోతుంటాడని ఒక ప్రకటనలో అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.