- నీ భార్యను నువ్వే కేసులో ఇరికించావు
- టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్
విజయవాడ (చైతన్యరథం): మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని చేసిన తప్పు ఒప్పుకుని పోలీసులకు లొంగిపోయి, ఆయన భార్యను బియ్యం మాయం కేసు నుంచి తప్పించాలని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న హితవు పలికారు. మహిళలపై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు బుద్దా వెంకన్న స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విజయవాడలో ఆదివారం మీడియాతో బుద్దా వెంకన్న మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి గురించి వైసీపీ నేతలు అసభ్యంగా మాట్లాడితే నోరు మొదపని పేర్ని ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నాడని దుయ్యబట్టారు. అసెంబ్లీలో వైసీపీ నేతలు అలా అనడం సరికాదని ఇప్పటికైనా పేర్ని నాని చెంపలు ఎందుకు వేసుకోవడం లేదని నిలదీశారు. వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీపై తాను విమర్శలు చేస్తే.. పేర్నికి ఎందుకు అంత పౌరుషం వచ్చిందని బుద్దా వెంకన్న నిలదీశారు. ఆ రోజు నా మీద కేసులు పెట్టి.. నన్ను ఇబ్బందులు పెట్టాలని పేర్ని నాని చూశాడు. నా దేవుడు చంద్రబాబు ఇంట్లో వాళ్లను తిట్టారు కాబట్టే నేను కూడా కౌంటర్ ఇచ్చాను. అసభ్యంగా మాట్లాడినందుకు నన్ను అరెస్టు చేయాలని ఫిర్యాదు చేస్తావా. మరి ఇప్పుడు నీ భార్య జయసుధ గురించి మేము ఒక్క మాట అయినా మాట్లాడామా? ఆమెను అరెస్ట్ చేసేందుకు సీఎం చంద్రబాబు అంగీకరిచలేదని నువ్వే కదా చెప్పావు. ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యం చంద్రబాబుకి ఉండదు అది ఆయన ఉన్నత మనస్తత్వం అని బుద్దా వివరించారు.
భార్యను కేసులో ఇరికించి..
గతంలో పేర్ని సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై అసభ్యకరమైన సినిమా తీయడానికి చర్చ జరిపింది వాస్తవమా కాదా. అక్రమంగా సంపాదించిన డబ్బులు రాంగోపాల్ వర్మకు ఇచ్చి.. సినిమా తీయడానికి ప్రోత్సహించింది నువ్వు కాదా. ఈ రోజు నీ భార్య జయసుధ దోషిగా నిలబడటానికి కారణం నువ్వు కాదా. గోడౌన్లు ఆమె పేరుతో పెట్టి.. అందులో ఉన్న బియ్యం నువ్వు అమ్ముకున్నావు. అంటే నీ భార్యను నువ్వే కేసులో ఇరికించుకుని.. రాజకీయ కుట్ర అంటావేంటి. నీకు నిజంగా నీ భార్య మీద ప్రేమ ఉంటే.. ఇలాంటి అవినీతి పనులు చేసేవాడివి కాదు. ఏదైనా జరిగినా.. నేను సేఫ్, ఆమె జైలుకు పోతుందని పేర్ని నానికి ముందే తెలుసు. మేము ఐదేళ్లు మీ అరాచకాలు అడ్డుకుని ప్రజల పక్షాన నిలిచాం. ఇప్పుడు ఓటమి చెందగానే వల్లభనేని వంశీ అడ్రెస్ లేకుండా పోయాడని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు.
చేసిన తప్పు ఒప్పుకో..
బూతులు తిట్టే కొడాలి నాని, వల్లభనేని వంశీలతో అంటకాగినప్పుడు ఇంట్లో ఆడవాళ్లను విమర్శించకూడదని నీకు తెలియదా. చంద్రబాబు తన సతీమణి పేరుతో కంపెనీలు పెట్టుకుని నడిపారు. నీలాగా ప్రజల బియ్యాన్ని అమ్ముకుని.. భార్యను జైలుకు పంపాలని అనుకోలేదు. నా భార్య ఆత్మహత్య చేసుకునేలా ఉందని అంటున్నావు. అందుకు నువ్వు కారణం కాదా. 7500 బస్తాల బియ్యం గోడౌన్‌లో మాయం అయితే… నువ్వే కదా నీ భార్య పేరు గోడౌన్‌కు పెట్టుకున్నావు. నిన్ను ఎందుకు అరెస్టు చేయకూడదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని నువ్వే కదా గతంలో గొప్పగా చెప్పావు. ఇప్పుడు నా భార్య, నా కొడుకు అంటున్న నానీకి అందరికీ అదే పేగు బంధం ఉంటుందని తెలియదా. పాదయాత్ర చేసిన నారా లోకేష్‌పై ఎన్నిసార్లు నోరు పారేసుకున్నావో గుర్తు చేసుకో అని బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. పేర్ని నాని ఇప్పటికైనా చేసిన తప్పులకు చెంపలు వేసుకుని క్షమాపణ కోరు. 7500 బస్తాలు నేనే దొంగతనం చేశానని పోలీసులకు లొంగిపోయి.. నీ భార్యను కేసు నుంచి తప్పించు అని బుద్దావెంకన్న హితవు పలికారు.