అమరావతి, (చైతన్యరథం) : అడ్డగోలుగా జరిగిన వైఎస్ వెంకటరెడ్డి బైరటీస్ గనుల లీజును రద్దు చేసినట్లు మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడిరచారు. ఈ మేరకు అమరావతిలో బుధవారం ఆయనొక ప్రకటన విడుదల చేశారు. పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలో విలువైన వైట్ బైరైటీస్ గనుల లీజు ఆర్డర్‌ను గనుల శాఖ డైరెక్టర్ తన విచక్షణాధికారంతో ఈ నెల 15వ తేదీన ఇచ్చారు. సాధారణంగా మైనర్ గనులు రోడ్ మెటల్, గ్రానైట్, బైరైటీస్ వంటి ఖనిజాల మంజూరు మంత్రి అధికార పరిధిలోకి రావు. మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి బంధువు వైఎస్ వెంకట్ రెడ్డి బైరైటీస్ గనుల కేటాయింపు విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకురాకుండా జారీ చేశారు. క్వారీ లీజు అనుమతుల మంజూరు అధికారాలు మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ ప్రత్యేక విచక్షణాధికార పరిధిలోనే ఉంటాయి. గడువు దాటిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి అనుమతులిచ్చారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సన్నిహితంగా ఉంటూ, గత ప్రభుత్వంలో నియమితుడై ప్రస్తుతం అదే హోదాలో కొనసాగుతున్న ఓ ముఖ్య అధికారి ఈ ఫైలును వేగంగా కదిలేలా చేసేందుకు సర్క్యులర్ జారీ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని మంత్రి వెల్లడిరచారు. ఈ అంశంపై పత్రికల్లో వచ్చిన వార్తలను పరిశీలించిన నేపథ్యంలో జరిగిన తప్పిదాలను గుర్తించి అమల్లో ఉత్తర్వులు నిలిపివేస్తూ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడిరచారు. ఈ వ్యవహారంపై లోతుగా పరిశీలన చేసి బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సహజ సంపద కేటాయింపులు, వచ్చే ఆదాయం ఏదైనా ప్రభుత్వానికి, ప్రజలకు చెందాలి తప్ప అక్రమార్కుల పరం కాకూడదనేది కూటమి ప్రభుత్వ విధానమని అందులోభాగంగానే చర్యలు తీసుకున్నామని మంత్రి కొల్లు వెల్లడిరచారు.