- కష్టపడినవారికి గుర్తింపు ఖాయం
- సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు
- ఓర్వలేక ప్రజల్లో విద్వేషాల సృష్టికి వైసీపీ కుట్రలు
- ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల్సిన బాధ్యత తీసుకోవాలి
- పార్టీ సమన్వమ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర పిలుపు
ముమ్మిడివరం (చైతన్యరథం): ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి లేని కార్యకర్తల బలం మన టీడీపీకి మాత్రమే సొంతమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సయిజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర ఉద్ఘాటించారు. డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోనలో సోమవారం ఏర్పాటు చేసిన పార్టీ బూత్, క్లస్టర్, యూనిట్ ఇన్‌ఛార్జిలు, సీనియర్ నాయకుల సమన్వయ సమావేశంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ అధికారం ఉన్నా.. లేకున్నా అండగా నిలిచే కార్యకర్తలు మనకే సొంతమన్నారు. పార్టీ ఏర్పడినప్పటి నుండి గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ కమిటీలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా కుటుంబ సాధికార సారథుల నియామకానికి శ్రీకారం చుట్టాం. కుటుంబ సాధికార సారథుల నియామకం పూర్తి చేసుకుంటే మరో 40 సంవత్సరాలు టీడీపీ పటిష్టంగా నిలిచిపోతుంది. కార్యకర్తల పనితీరు, పని చేసిన వారి వివరాలు పార్టీ సేకరిస్తోంది. ఐదేళ్ల వైసీపీ పాలనలో కేసులు, అరెస్టులు, దాడులు, దుర్మార్గాలపై పోరాటం చేసిన వారికి ఇప్పుడు అవకాశాలు లభిస్తున్నాయి.
వైసీపీ పాలనలో ఎంతోమంది ప్రజలను, కార్యకర్తలను వేధించి చంపేశారు. వైసీపీ ఎమ్మెల్సీ ఏకంగా దళిత డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేశారు. చివరికి మన పార్టీ అధినేత చంద్రబాబుని కూడా అక్రమంగా అరెస్టు చేసి పార్టీని దెబ్బతీయాలనుకున్నారు. కానీ.. కార్యకర్తలు అండగా నిలిచి 93 శాతం సీట్లు గెలిపించి అఖండ మెజారిటీతో అధికారాన్ని అందించారు. ఈ గెలుపు, ఈ అధికారం కార్యకర్తల శ్రమ.. కార్యకర్తల కష్టం మాత్రమే. కష్టబడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రమిస్తున్నారు. గత ఏడాది కాలంలో మనం చేసిన అభివృద్ధిని గడప గడపకి చెప్పాలి. రూ.30తో దివంగత ఎన్టీఆర్ ప్రారంభించిన పెన్షన్ ఇప్పుడు రూ.4000 చేసిన ఘనత మనదే. దివ్యాంగులకు రూ.6000, మంచానికే పరిమితం అయిన వారికి రూ.15 వేలు అందిస్తున్నాం. దీపం పథకంతో 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించాం. ప్రతి బిడ్డకి తల్లికి వందనం కింద రూ.10 వేల కోట్లు తల్లుల ఖాతాలో వేశాం. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకి రూ.20 వేలు ఇవ్వబోతున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించబోతున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పేదరిక నిర్మూలన కోసం పీ 4 కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పేదరికం నిర్మూలనకు శ్రీకారం చుట్టాం.
అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పనులు పరుగులు తీయిస్తున్నాం, ఇవన్నీ చూసి ఓర్వలేక రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు, కులాలు, మతాల మధ్య విభేదాల సృష్టికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో చనిపోతే మతం పేరుతో రాజకీయం చేశారు. పల్నాడులో పరామర్శ పేరుతో దళితుడిని తొక్కి చంపేశారు. గుడివాడలో కావాలని పార్టీ నాయకులను, పోలీసులను దుర్భాషలాడారు. బీసీ మహిళను అడ్డం పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అలజడులు సృష్టించండి అని.. వైసీపీ కార్యకర్తలను ఆ పార్టీ నాయకుడు పేర్ని నాని రెచ్చగొడుతున్నాడు. మరోవైపు ఆ పార్టీ నాయకుడు విశ్వరూప్ పోలీసులను బెదిరిస్తున్నాడు. జగన్ రెడ్డి ఎలాంటి దుర్మార్గుడో, ఎంతటి అరాచక శక్తో ప్రజలు గుర్తించాలి. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారికి, చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లిన వారికి జగన్‌రెడ్డి మంత్రి పదవులిచ్చాడు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గురించి వైసీపీ నేతలు మాట్లాడిన మాటలు వారి నీచబుద్ధికి నిదర్శనం.
చంద్రబాబు వయసు గురించి మాట్లాడే వైసీపీ నాయకులకు ఆయన పనితీరుతో పోటీపడగల ధైర్యం ఉందా? రాష్ట్రానికి పెట్టుబడులు కూడా పెట్టుబడిదారులకు లేఖలు రాస్తున్నారు. వైసీపీ అరాచక పాలనతో నష్టపోయిన రాష్ట్రాన్ని బాగుచేసే ప్రయత్నం చేస్తుంటే.. ఇలాంటి కుట్రలు సిగ్గు చేటు. ప్రజలు, కార్యకర్తలు వైసీపీ నేతల అరాచకాలపై సోషల్ మీడియా ద్వారా యుద్ధం చేయాలి. తప్పు చేసిన వారు చట్టం నుండి తప్పించుకున్నా.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదని గుర్తించుకోవాలి. పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత మనదే.. మన కార్యకర్తలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదనేందుకు యువనేత లోకేష్‌కు వచ్చిన మెజార్టీ నిదర్శనం. మత్స్యకారులకు వలలు, పడవలు, 50 సంవత్సరాలకి పెన్షన్, వేట నిషేధ సమయంలో భృతి పెంచిన ఘనత టీడీపీదే. వనరులు పుష్కలంగా ఉన్నాయి.. వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా… మన రాష్ట్రాన్ని ప్రపంచ పటంపై ఉంచే బాధ్యత తీసుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.