- ఇకపై నియోజకవర్గ పర్యటనల్లో ముందుగా వాళ్లతోనే భేటీలు
- తిరుపతిలో కార్యకర్తలు, నేతలతో లోకేష్ సమన్వయ సమావేశం
- ఉత్తమ పనితీరు కనబరిచిన శ్రేణులకు ప్రశంసా పత్రాలు అందజేత
- సమస్యలు తెలుసుకుని, అండగా నిలబడాలని నేతలకు పిలుపు
తిరుపతి (చైతన్య రథం): తెలుగుదేశం పార్టీ కోటి సభ్యత్వాలతో అతిపెద్ద కుటుంబంగా మారిన సందర్భంలో కార్యకర్తే అధినేతని ప్రకటించిన ఐటీ మంత్రి నారా లోకేష్… తాను అన్న మాటలను ఆచరణలో పెట్టారు. కార్యకర్తే అధినేత అన్న మాటను శిరసావహిస్తూ.. తిరుపతి నియోజకవర్గ పర్యటనలో ముందుగా పార్టీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇకపై ఏ నియోజకవర్గ పర్యటనకు వెళ్లినా మొదట కార్యకర్తలతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. బాబు ష్యూరిటీ- భవిష్యత్‌కు గ్యారెంటీ, పార్టీ సభ్యత్వం, ఓటర్ వెరిఫికేషన్, మన టీడీపీ యాప్‌లో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలు, నాయకులతో ఎక్కువ సమయం కేటాయించనున్నారు. అందులో భాగంగానే తిరుపతిలో పర్యటించిన లోకేష్.. ముందుగా టీడీపీ కార్యాలయంలో క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జ్‌లతో పాటు బాబు ష్యూరిటీ-భవిష్యత్‌కు గ్యారెంటీ, మన టీడీపీ యాప్, సభ్యత్వ నమోదులో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలను పరిష్కరించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
పనిచేసే వారిని ప్రోత్సహిస్తా..
మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మా అందరికీ పదేపదే చెప్పేది.. ఏ నియోజకవర్గంలో పర్యటించినా అక్కడి క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీ సభ్యులను కలిసి మాట్లాడాలని. అనంతరం బాబు ష్యూరిటీ- భవిష్యత్ గ్యారంటీ, మన టీడీపీ యాప్, సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం కావాలని ఆదేశించారు. అందులో భాగంగానే పార్టీని బలోపేతం చేసేందుకు నేను అధిక సమయం మీతో గడుపుతున్నా. పార్టీ, ప్రభుత్వం రెండూ అనుసంధానమై ముందుకు పోవాల్సిన అవసరముంది. పార్టీలో నూతనంగా క్లస్టర్, యూనిట్, బూత్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో నేను పాదయాత్ర చేసినప్పుడు.. అన్నా నేను కష్టపడ్డాను.. నన్ను గుర్తించడం లేదని చాలా మంది నాతో చెప్పారు. సీనియర్లు, జూనియర్లను సమానంగా గౌరవిస్తా, పనిచేసే వారిని ప్రోత్సహిస్తా. పార్టీ లేకపోతే మనం ఎవరూ లేము అని గుర్తుంచుకోవాలి. ఇవాళ మనకు సమాజంలో గౌరవం లభిస్తోందంటే అందుకు కారణ తెలుగుదేశం పార్టీనే అని లోకేష్ అన్నారు.
కార్యకర్తల సమస్యలు తెలుసుకుని, అండగా నిలబడాలి
ఎన్నికల్లో గెలిచాం, తిరుగులేదనే ధోరణి సరికాదు. నిత్యం ప్రజల్లో ఉండాలి. మంగళగిరిలో నేను 91వేల మెజార్టీతో గెలిచా. నాకు ఎంత పని ఒత్తిడి ఉన్నా మంగళగిరి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నా. బాధ్యత పెరిగింది. కార్యకర్తల సమస్యలు తెలుసుకుని, వారికి అండగా నిలబడాలి. అలకలు మానుకుని నాయకులు సమిష్టిగా పనిచేయాలి. గత ఐదేళ్లలో మనం అనేక కష్టాలు ఎదుర్కొన్నాం. అక్రమ కేసులు పెట్టారు, లాఠీఛార్జి చేశారు. అవన్నీ మర్చిపోకూడదు. ఇది మన కుటుంబం. పార్టీలో సంస్కరణల కోసం అహర్నిశలు కష్టపడుతున్నా. పార్టీలో పొలిట్‌బ్యూరో ఉంటుంది. అందులో చర్చ జరగాలి. తర్వాత నిర్ణయం తీసుకోవాలి. మంగళగిరిలో లక్ష సభ్యత్వాలు చేయడం జరిగింది. శాశ్వత సభ్యత్వాలు దాదాపు 180 వరకు చేశాం. ఇక్కడ ఆ స్థాయిలో జరగలేదు. పార్టీని బలోపేతం చేసేందుకు అందరం కష్టపడాలి. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఎవరు పనిచేశారో తెలుసుకుని వారికే పదవులు ఇస్తాం. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. త్వరలో నూతన విధానం తీసుకువస్తున్నాం. జాతీయ అధ్యక్షుల నుంచి బూత్ ఇంఛార్జ్, బూత్ కమిటీ సభ్యుల వరకు అందరం కుటుంబ సాధికార సారధిలో (కేఎస్‌ఎస్) నమోదు కావాల్సి ఉంటుంది. పార్టీ సభ్యత్వం తీసుకున్న తర్వాత పార్టీ పదవి కావాలన్నా, నామినేటెడ్ పోస్టు కావాలన్నా కేఎస్‌ఎస్‌లో ఉండాలి. పార్టీ ఏ పిలుపునిచ్చినా 120మంది ఓటర్లతో కూడిన కేఎస్‌ఎస్‌ను కలవాలి, వారికి చెప్పాలి. కేఎస్‌ఎస్ కార్యక్రమం తర్వాత క్లస్టర్, యూనిట్, బూత్‌ఇంఛార్జ్‌లను నియమిస్తాం. అనంతరం గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు, పట్టణ కమిటీలు నియమించడం జరుగుతుంది. మహానాడు తర్వాత రాష్ట్ర కమిటీని ఏర్పాటుచేయడం జరుగుతుందని లోకేష్ వివరించారు.
వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి
పార్టీ ఏ కార్యక్రమం పిలుపునిచ్చినా కలిసికట్టుగా పనిచేయాలి. ప్రజల్లోకి తీసుకెళ్లాలి. గ్రూప్ రాజకీయాలకు దూరంగా ఉండాలి. మన లక్ష్యం ఒక్కటే పార్టీ బలోపేతం కావడం. అందుకు అహర్నిశలు కష్టపడాలి. ఈరోజు వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కానీ పెద్దపెద్ద మాటలు చెబుతున్నారు. టీడీపీ హయాంలోనే పెన్షన్ వెయ్యి రూపాయలకు పెంచడం జరిగింది. జగన్ రెడ్డికి వెయ్యి పెంచడానికి నాలుగున్నరేళ్లు పట్టింది. నేడు మనం వృద్ధాప్య పెన్షన్ రూ.4వేలు, వికలాంగ పెన్షన్ రూ.6వేలు, పూర్తి వికలాంగులకు రూ.15వేలు పెన్షన్ అందిస్తున్నాం. దేశంలో ఈస్థాయిలో ఎక్కడా పెన్షన్ అందించడం లేదు. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసింది టీడీపీనే. గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఏప్రిల్, మేనెల నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలుచేస్తామని చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పారు. జగన్‌రెడ్డి సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఏమైంది? సీపీఎస్ రద్దు చేస్తామన్నారు, ఏమైంది? ఇవన్నీ మనం మాట్లాడాలి. వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. జగన్‌రెడ్డి అన్నీ అప్పులు చేసి పోయారు. అయినప్పటికీ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లిస్తున్నాం, పెన్షన్ అందిస్తున్నాం. టీఏ, డీఏ బకాయిలు చెల్లిస్తున్నాం. వైసీపీ నేతలు రెడ్‌బుక్ గురించి మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులు ప్రజలను, మనల్ని ఇబ్బంది పెట్టారు. తప్పుచేసిన వారిని పద్ధతి ప్రకారం చట్టపరిధిలో శిక్షిస్తాం’ అని లోకేష్ అన్నారు.
నాకు కోటిమంది పార్టీ కుటుంబ సభ్యులున్నారు
పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉంది. పార్టీ ఏ పిలుపునిచ్చినా జయప్రదం చేయాలి. కూటమి నేతలను కలుపుకుని పోవాలి. ఏదైనా సమిష్టిగా చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలి. నాకు పార్టీ సుప్రీం. పార్టీ లేకపోతే యువగళం లేదు, లోకేష్ లేడు. నాకు పదవులు ముఖ్యం కాదు. పార్టీని బలోపేతం చేసేందుకే నేను ఇక్కడ ఉన్నాను. అందుకే కార్యకర్తలను కలుస్తున్నాం. నేను ఏ నియోజకవర్గానికి వెళ్లినా కార్యకర్తలతో సమావేశమవుతా. క్లస్టర్, యూనిట్, బూత్‌లను బలోపేతం చేయాలి. నేను 80శాతం సమయం కార్యకర్తలు, నాయకులను కలిసేందుకు కేటాయిస్తున్నా. నాయకులు కార్యకర్తలను కలుసుకుని వారి సమస్యలు పరిష్కరించాలి. పార్టీకి సమయం కేటాయించాలి. కార్యకర్తలకు ఏ పార్టీ చేయని విధంగా ప్రమాద బీమా రూ.5 లక్షలు చేశాం. త్వరలో కార్యకర్తల ఆరోగ్యానికి సంబంధించి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. కార్యకర్తల పిల్లలకు ఉద్యోగాలు కల్పించేందు పార్టీ కేంద్ర కార్యాలయంలో కేరీర్ కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటుచేస్తాం. నాకు అక్కా చెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లు లేరు. నాకు ఉన్నది కోటిమంది పార్టీ కుటుంబ సభ్యులు. మీకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తానని క్యాడర్‌కు లోకేష్ హామీ ఇచ్చారు. కార్పొరేటర్లతో సమావేశమైన లోకేష్ కార్యకర్తలతో సమావేశం అనంతరం మంత్రి నారా లోకేష్ తిరుపతి నగర కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. వార్డుల అభివృద్ధికి ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందిస్తామని హమీ ఇచ్చారు.