అమరావతి (చైతన్యరథం): జగనన్న కాలనీల్లో జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు గృహనిర్మాణశాఖపై మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ విశాఖపట్నంలో అక్రమాలు జరిగాయని సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం స్పీకర్ అయ్యన్న స్పందిస్తూ అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలన్నారు. అధికారులు ఇచ్చే నివేదికలకు, వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉంటోందన్నారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని.. అలా చేస్తే మిగిలిన వారు తప్పులు చేయరన్నారు. ఈ మేరకు మంత్రి పార్థసారథికి స్పీకర్ సూచించారు. మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ… జగనన్న కాలనీలపై విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారని తెలిపారు. జగనన్న కాలనీలపై శాఖాపరమైన విచారణతో పాటు విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని చెప్పారు.