- కలసికట్టుగా ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేద్దాం
- అంతిమంగా ఆంధ్రామోడల్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ లక్ష్యం
- మౌలిక వసతులు హార్డ్ వేర్… ఉపాధ్యాయులు సాఫ్ట్‌వేర్
- ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్యరథం): ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాల సాధనే లక్ష్యంగా సంస్కరణలు అమలుచేయాలని నిర్ణయించామని, ఇప్పుడు అమలు చేయలేకపోతే రాబోయే పదేళ్లలో ప్రభుత్వ విద్యావ్యవస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. జీఓ 117 రద్దు నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, 100 రోజుల ప్రణాళిక, ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు, తదితర అంశాలపై ఉపాధ్యాయ సంఘాలతో లోకేష్ శుక్రవారం ఉండవల్లి నివాసంలో 4 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ…రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక గత ఆరునెలలుగా లెర్నింగ్ అవుట్ కమ్స్‌పై దృష్టి సారించామన్నారు. ఇందులో భాగంగా పాఠశాల విద్య ఉన్నతాధికారులు ప్రతివారం ఉపాధ్యాయ సంఘాలతో సమస్యలపై నిరంతరం చర్చలు జరుపుతున్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా మా వద్ద పరదాలు ఉండవు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలంతా ప్రజలకు అందుబాటులో ఉంటారు. సంస్కరణల అమలులో కొన్ని పొరపాట్లు జరిగితే సంబంధిత నిర్ణయాలను వెనక్కి తీసుకోవడానికి వెనకాడం.
అపార్ ఐడి నమోదు 70శాతం పూర్తయ్యాక కొన్ని సమస్యలు మా దృష్టికి వచ్చాయి. వాటి పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతూ వస్తోంది. డ్రాపవుట్స్ కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సంస్కరణలు అమలుచేయడం అనివార్యం. ముఖ్యంగా ముస్లిం కుటుంబాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. ఫలితాల విషయంలో ప్రైవేటు స్కూళ్లతో ప్రభుత్వ పాఠశాలలు పోటీపడాలి. ఇందులో భాగంగా ఇటీవల మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ (పీటీఎం)ను విజయవంతంగా నిర్వహించాం. ఫలితాల మెరుగుదలకు ప్రభుత్వం, ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలన్నదే మా ఉద్దేశం. ఇందుకు అనుగుణంగా విధివిధానాలు రూపొందిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని ప్రాథమిక పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి లోకేష్ సూచించారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు సూచనల మేరకు బాలల్లో నైతిక విలువలు, మహిళలను గౌరవించేలా పాఠ్యాంశాలు రూపొందిస్తామని చెప్పారు. విధి నిర్వహణలో మృతిచెందిన ఉపాధ్యాయుల కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాలు చేపడతామని మంత్రి లోకేష్ తెలిపారు.
ప్రభుత్వ విద్య బలోపేతానికి సహకరించండి
సంస్కరణల అమలులో భాగంగా ప్రతి స్కూలుకు మౌలిక వసతులు, విద్యా సంబంధిత ఫలితాలపై స్టార్ రేటింగ్ ఇస్తున్నాం. 20మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉన్న స్కూళ్లు 30శాతం ఉన్నాయి. 300 పాఠశాలల్లో జీరో అడ్మిషన్లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు మీ వంతు సహకారం అవసరం. దీనిపై జిల్లా కలెక్టర్లకు కూడా ర్యాంకింగ్ ఇచ్చాం. మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నచోట ఫలితాల్లో వెనుకబడి ఉండటం, సరైన వసతులు లేని చోట ఫలితాలు మెరుగ్గా ఉండటం గమనించాం. రెండిరటినీ బ్యాలెన్స్ చేస్తూ ప్రతి పాఠశాలలో మౌలిక వసతులతోపాటు స్పోర్ట్స్, డిజిటల్ లైబ్రరీ, ల్యాబ్స్ వంటి సౌకర్యాలను కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నాం. సర్కారు విద్యలో ఎక్కడ లోపాలున్నాయో తెలుసుకొని సరిదిద్దుదాం. నేను యువగళం పాదయాత్ర చేసే సమయంలోనే జీఓ 117తో ఏర్పడిన విపరిణామాలు నా దృష్టికి వచ్చాయి. చిన్నపిల్లలు నాలుగైదు కిలోమీటర్ల నుంచి పాఠశాలలకు రావడం కష్టం. అందుకోసం ఆ జీఓను రద్దుచేసి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాం. ఉపాధ్యాయులపై అనవసరమైన యాప్‌ల భారం తగ్గించాం. ఇంకా అమలులో ఉన్న నాన్ అకడమికమ్ యాప్‌ల బాధ్యతను తొలగించే అంశాన్ని పరిశీలిస్తాం. మౌలిక సదుపాయాలు హార్డ్ వేర్ అయితే టీచర్లు సాఫ్ట్‌వేర్ లాంటి వారు. రాబోయే ఐదేళ్లలో ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ మా లక్ష్యం. ఉపాధ్యాయుల సహకారంతోనే అది సాధ్యమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, అశోక్ బాబు, వేపాడ చిరంజీవి పాల్గొన్నారు.
ఫలితాల సాధనే లక్ష్యంగా పనిచేయాలి
పాఠశాల విద్యశాఖ కార్యదర్శి కోన శశిధర్ మాట్లాడుతూ…మంత్రి లోకేష్ బాధ్యతలు చేపట్టాక తమతో ఒక్క ప్రభుత్వ స్కూలు మూతపడకూడదు, ఒక్క టీచర్ కూడా తగ్గకూడదని స్పష్టంగా ఆదేశించారని తెలిపారు. ఇది మంత్రి లోకేష్ చిత్తశుద్ధికి నిదర్శనం. ఫలితాల సాధన, హాజరు శాతం పెంపుదలకు ఉపాధ్యాయులు కృషిచేయాలి. గతంలో ప్రతి హెడ్‌మాస్టర్ తమ పరిధిలోని గ్రామంలో బడిఈడుకు వచ్చిన పిల్లల సమాచారంతో సెన్సస్ రిజిస్టర్ నిర్వహించేవారు. మళ్లీ ఆ విధానాన్ని తీసుకువస్తే తల్లిదండ్రులను చైతన్యవంతం చేసి ఎన్‌రోల్‌మెంట్ పెంచడానికి ఆస్కారమేర్పడుతుందన్నారు.
పాఠశాల విద్య కమిషనర్ విజయరామరాజు మాట్లాడుతూ… మంత్రి లోకేష్ ఆదేశాలతో సమస్యలపై గత ఆరునెలలుగా ఉపాధ్యాయ సంఘాలతో నిరంతరం చర్చలు జరుపుతున్నామన్నారు. బదిలీలు, ప్రమోషన్లు ఎలా ఉండాలనే అంశంపై సంఘాల అభిప్రాయం తీసుకున్నాం. వారి సూచనలతో బదిలీల కోసం ప్రత్యేక యాప్ రూపొందించాం. పూర్తి పారదర్శకంగా ఏప్రిల్, మే నెలల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పూర్తిచేస్తాం. ప్రతిక్లాసుకు ఒక టీచర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి నాలుగైదు గ్రామాలకు ఒక మోడల్ స్కూలు ఏర్పాటు చేసేలా కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా మెరుగైన ఫలితాల కోసం వందరోజుల పాఠ్యప్రణాళికను పకడ్బందీగా అమలుచేయాలని కోరారు.
స్కావెంజర్స్ జీతాల విషయంలో ఉపాధ్యాయ సంఘాల సూచనను పరిశీలిస్తామని సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరక్టర్ బి.శ్రీనివాసరావు తెలిపారు.
పదోన్నతులకు అవకాశం కల్పించండి
సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ… 20ఏళ్లు సర్వీసు పూర్తిచేసిన సెకండరీ టీచర్ కేవలం స్కూల్ అసిస్టెంట్, హెచ్‌ఎం పదోన్నతితోనే ఆగిపోతున్నారు.. లెక్చరర్లు, డివైఇఓ వంటి ప్రమోషన్లు కల్పించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఇటీవల నిర్వహించిన డివైఈఓ పోస్టుల భర్తీకి సంబంధించిన సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. ఆకస్మిక తనిఖీల్లో ఉపాధ్యాయుల తొలి తప్పిదానికే తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నారని, ఈ విషయంలో పట్టువిడుపుతో వ్యవహరించాలని కోరారు. 100 రోజుల ప్రణాళికలో ఆదివారాలను మినహాయించాలని విన్నవించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్ తగ్గిపోవడానికి గత ప్రభుత్వం 117 జీఓ తేవడం ప్రధాన కారణమని తెలిపారు. నాలుగైదు గ్రామాలకు కలిపి ఏర్పాటుచేసే మోడల్ స్కూలుకు రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రాథమిక పాఠశాల స్థాయిలో తెలుగు మీడియం అమలు చేయాలని, యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌ఫర్లకు అనుమతి ఇవ్వాలని విన్నవించారు. స్పోర్ట్స్‌ను ప్రోత్సహించేందుకు రూరల్ స్కూళ్లకు పీఈటీలను నియమించాలని కోరారు.
ఉపాధ్యాయుల సమస్యలను సావధానంగా ఆలకించిన మంత్రి లోకేష్ వీటిని కేటగిరైజేషన్ చేసి పరిష్కారానికి కృషిచేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఎల్ సాయిశ్రీనివాస్, ఎం రఘునాథరెడ్డి (ఎస్టియు ఎపి), ఎజిఎస్ గణపతిరావు, ఎ.ప్రకాశరావు (ఆప్టా), ఎం.కృష్ణయ్య, ఎఎం గిరిప్రసాద్ (పిఆర్‌టియు), ఎం.వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్ ప్రసాద్ (యుటిఎఫ్), పివి రమణ, వి.శ్రీనివాసరావు (ఎపిహెచ్‌ఎంఎ), జి.హృదయరాజు, ఎస్ చిరంజీవి (ఎపిటిఎఫ్ 1938), సిహెచ్ మంజుల, కె.భానుమూర్తి (ఎపిటిఎఫ్), ఎస్ బాలాజీ, జివి సత్యనారాయణ (ఎపియుఎస్), పి.అశోక్ కుమార్, జి.సుధీర్ (వైఎస్‌ఆర్ టిఎ), తదితరులు పాల్గొన్నారు.