- వేగంగా శిక్ష పడేలా విచారణకు ప్రత్యేక కోర్టు
- మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలను ఉపేక్షించేది లేదు
- వారి భధ్రతకు సీఎం చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యత
- అత్యాచారాలు, దాడులకు పాల్పడే వారిపై తక్షణమే కఠిన చర్యలు
- హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడి
అమరావతి (చైతన్యరథం): శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై అత్యాచార ఘటనలో నిందితులను 48 గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వారికి వేగంగా శిక్ష పడాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు చెప్పారు. దీనిపై విచారణను ప్రత్యేక కోర్టుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, అత్యాచారాలకు, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఏ మాత్రం వెనుకాడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్లో డీజీపీ ద్వారకా తిరుమలరావు, లా అండ్ ఆర్డర్ ఐజీ శ్రీకాంత్తో కలసి ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రాధాన్యతనిస్తూ తరచుగా డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. దాడులు, అత్యాచారాలు జరిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ సంబందిత జిల్లాల ఎస్పీలతో నేరుగా మాట్లాడుతూ పోలీస్ యంత్రాగాన్ని అప్రమ్తతం చేయడమే కాకుండా నిందితులను వెంటనే పట్టుకుని శిక్షపడేలా దిశానిర్దేశం చేస్తున్నారన్నారు.
48 గంటల్లోనే..
ఈ నెల 12 వ తేదీన శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం జరగడం దురదృష్టకరమైన సంఘటన అని, అయితే ఈ కేసుకు సంబంధించిన నిందితులను 48 గంటల్లోనే పట్టుకుని రిమాండుకు పంపించామన్నారు. దేవీ నవరాత్రుల సందర్బంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై, తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా పోలీసు యంత్రాంగం అంతా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నప్పటికీ, అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో కొండలు, కోనలు అని చూడకుండా, 200 కి.మి. వెంటాడి ఐదుగురు నిందితులను 48 గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారన్నారు. వీరిలో ఒక నిందితుడు 14 వ ఏట నుండే పలు రేప్ కేసులు, దొంగతనాల్లో ప్రమేయం ఉన్న నేరచరితుడని, అతని పై దాదాపు 37 కేసుల వరకూ నమోదయినట్లు ఆమె తెలిపారు. అదే విధంగా బాపట్ల జిల్లాలో ఒక మహిళపై అత్యాచారం జరిపి హత్య చేసిన కేసుకు సంబంధించిన నిందితులను కూడా 42 గంటల్లో పట్టుకున్నామన్నారు. ఈ రెండు కేసుల విషయంలో నిందితులకు తక్షణమే కఠిన శిక్షలు పడేలా చూడాలనే ఉద్దేశ్యంతో ప్రత్యేక కోర్టుకు అప్పగించి విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు తగ్గట్టుగా రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానానికి ఒక లేఖను కూడా రాస్తున్నామని హోం మంత్రి అనిత తెలిపారు.
పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు
అదే విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలను మరింత పటిష్టంగా అమలు పర్చాలనే లక్ష్యంతో రాష్ర వ్యాప్తంగా అన్ని ముఖ్యమైన కూడళ్లు, ప్రాంతాలు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, ప్రభుత్వ, ప్రైవేటు వసతి గృహాలు, కళాశాలలు, పాఠశాలల వద్ద సీసీ కెమెరాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రైవేటు సంస్థలు, ప్రాంగణాల్లో ఉండే సీసీ కెమెరాలను పోలీస్ శాఖతో అనుసంధానం చేస్తే నేరాలు జరిగినప్పుడు వెంటనే నిందితులను పట్టుకునే అవకాశం ఉంటుందన్నారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రజలు కూడా పోలీస్ శాఖకు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సీసీ కెమెరాలు లేని చోట్ల డ్రోన్ల సహకారంతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. డ్రోన్లు కూడా లేని చోట మొబైల్ ఫోన్నే ఆయుధంగా ఉపయోగిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రజలు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అదే విధంగా అత్యవసర పరిస్థితుల్లో తక్షణ పోలీస్ సాయం కోసం 112 లేదా 100కు ఫోన్ చేయాలని ఆమె తెలిపారు. మహిళలు, చిన్నారులపై జరిగే అత్యాచారాలు, దాడులకు సంబందించిన ఫిర్యాదులు కూడా ఈ నెంబర్లకు చేయవచ్చని, ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. అవసరమైతే వారికి భద్రత కూడా కల్పిస్తామని హోం మంత్రి అనిత తెలిపారు.