అమరావతి (చైతన్యరథం): వైసీపీ పాలనలో చట్టాలను ఉల్లంఘించి మరీ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా నడుచుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్. సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదైంది. గత ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖ డీజీ, సీఐడీ విభాగాధిపతిగా పనిచేసిన సంజయ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. దీనిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏసీబీ అధికారులు లేఖ రాశారు. సీఎస్ నుంచి అనుమతి లభించడంతో సంజయ్‌పై కేసు నమోదైంది. ఏ1గా సంజయ్, ఏ2గా సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా, ఏ 3గా క్రిత్వ్యాప్ టెక్నాలజీస్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.
నిధుల దుర్వినియోగం
‘అగ్నిమాపక శాఖలో నిరభ్యంతర పత్రాలు (ఎన్వోసీలు) ఆన్లైన్లో జారీచేసేందుకు అగ్ని-ఎన్వోసీ వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్‌ల సరఫరా కాంట్రాక్టును సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా సంస్థకు సంజయ్ అప్పగించారు. ఎలాంటి పనులూ జరగకపోయినా ఆ సంస్థకు రూ.59.93 లక్షల బిల్లులు చెల్లించేశారు. సీఐడీ తరపున ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కాంట్రాక్టును క్రిత్వ్యాప్ టెక్నాలజీస్‌కు ఇచ్చి, రూ.1.19 కోట్లు చెల్లించారు. ఈ సదస్సులు మొత్తం సీఐడీ అధికారులే నిర్వహించారు. క్రిత్వ్యాప్ సంస్థ అసలు సదస్సులే నిర్వహించకపోయినా బిల్లుల పేరిట దోచేశారు. ఈ మేరకు ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.2 కోట్ల మేర నష్టం కలిగించారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వానికి రెండు వేర్వేరు నివేదికలు సమర్పించింది. వాటి ఆధారంగా ఇప్పటికే సంజయ్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేయగా.. తాజాగా ఏసీబీ కేసు నమోదైంది.
ఆ సొమ్ము ఎవరికి చేరింది?
సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా, క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ సంస్థల ఖాతాల్లో జమైన సొమ్ము ఎవరు విత్‌డ్రా చేశారు? అంతిమంగా ఎవరి వద్దకు చేరిందనేదానిపై ఏసీబీ విచారణ చేయనుంది. క్రిత్వ్యాప్, సౌత్రికా రెండూ ఒకే చిరునామాలో ఉన్నాయని, క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ డొల్ల కంపెనీ అని విజిలెన్స్ తేల్చింది. ఆ డొల్ల కంపెనీ ఏర్పాటు వెనక ఎవరున్నారు.. ఎందుకు ఏర్పాటు చేశారు.. నిధులు ఎలా పక్కదారి పట్టించారనేదానిపై ఏసీబీ వివరాలు సేకరించనుంది.