- కడపలో విద్యుత్ తీగలు తగిలి గాయపడిన బాలుడికి సాయం
- వైద్య ఖర్చులకు రూ.3 లక్షలు అందించి అండగా నిలిచిన మంత్రి
- మంత్రి సాయానికి కృతజ్ఞతలు తెలిపిన బాలుడి కుటుంబం
అమరావతి (చైతన్యరథం): ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడిలా నిలుస్తున్నారు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. కడప నగరం అగాడి వీధిలో విద్యుత్ తీగలు తగిలి తీవ్రంగా గాయపడిన పదేళ్ల బాలుడు షేక్ మహ్మద్ అద్నాన్కు అండగా నిలిచారు. వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.3 లక్షలు సాయం అందించి బాధిత కుటుంబానికి ఓదార్పునిచ్చారు. గతేడాది ఆగష్టు 21వ తేదీ మధ్యాహ్నం పదేళ్ల తన్వీర్, అద్నాన్ సైకిల్ పై పాఠశాలకు వెళ్తుండగా.. అగాడివీధిలో తెగిపడిన విద్యుత్ తీగలు తగలడంతో ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో విద్యుద్ఘాతంతో తీన్వర్ మృతిచెందగా, అద్నాన్ తీవ్రంగా గాయపడటం ప్రతిఒక్కరిని కలచివేసింది. గాయపడిన బాలుడికి ప్రభుత్వం ఉచిత వైద్యం అందించింది. ఈ ప్రమాదంలో అద్నాన్ ఒక చేతిని కోల్పోవాల్సి రావడం ఆవేదనను మిగిల్చింది. మెరుగైన వైద్యం కోసం సాయం అందించాలని బాలుడి కుటుంబం.. మంత్రి నారా లోకేష్‌కు విజ్ఞప్తి చేయడంతో వెంటనే స్పందించిన మంత్రి.. సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.3 లక్షల చెక్కును అందజేశారు. బాలుడికి జైపూర్ కృత్రిమ చేయి అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి లోకేష్ సాయం పట్ల బాలుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.