- విషయం తెలిసి ఇంటికి పిలిపించి మాట్లాడిన మంత్రి
- వైసీపీ పాలనలో తీవ్ర వేధింపులు ఎదుర్కొన్న యువకుడు సాయికృష్ణ
అమరావతి (చైతన్యరథం): తనను కలిసేందుకు ఎంతగానో తపిస్తున్న యువకుడిని మంత్రి నారా లోకేష్ స్వయంగా పిలిపించుకుని మాట్లాడారు. వైసీపీ రాక్షస పాలనలో తీవ్ర వేధింపులు ఎదుర్కొన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం చౌడవరానికి చెందిన యర్రంశెట్టి సాయికృష్ణ.. కొద్దిరోజులుగా మంత్రి నారా లోకేష్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి లోకేష్‌ను కలిసేలా అనుగ్రహించాలంటూ ఈ నెల 8వ తేదీన మోకాళ్లపై కొండ మెట్లెక్కుతూ దుర్గగుడిలో అమ్మవారిని దర్శించుకుని ప్రార్థించారు. అంతే కాకుండా తన ఆకాంక్షను ఎక్స్ ద్వారా తెలియజేయడంతో మంత్రి లోకేష్ తక్షణమే స్పందించారు.
ఉండవల్లి నివాసానికి సోమవారం సాయికృష్ణను పిలిపించుకుని మాట్లాడి, ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ పాలనలో అప్పటి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ దమనకాండపై ప్లకార్డుల ద్వారా శాంతియుతంగా సాయికృష్ణ నిరసన గళం వినిపించారు. ప్రజాసమస్యలపై కరపత్రాలు పంచాడు. దీంతో వైసీపీ ప్రభుత్వం ఆయన ఇంటికి విద్యుత్ సరఫరాను నిలిపివేసి తీవ్రంగా వేధించింది. సాయికృష్ణ ఉద్యోగం కూడా కోల్పోవాల్సి వచ్చింది. చివరికి ప్రజా ప్రభుత్వం కొలువుదీరడంతో ఆయన కోరిక నెరవేరింది. సాయికృష్ణ పోరాటాన్ని మంత్రి అభినందించారు.