అమరావతి (చైతన్యరథం): లిక్కర్ స్కాంలో రోజుకో మాట.. పూటకో కూత అన్నట్టుగా వైసీపీ వ్యవహరిస్తోంది. మద్యం కుంభకోణంలో దోచిన మొత్తం వీడియోల ఆధారంగా బయటపడుతుండటంతో అడ్డంగా బుక్ అయిన వైసీపీ.. తమ దారుణాలను కప్పిపుచ్చుకునేందుకు కప్పగంతులు వేస్తోంది. తొలుత అసలు లిక్కర్ స్కాం జరగనే లేదని ఆ పార్టీ బుకాయించింది. ప్రభుత్వ దుకాణాల్లో మద్యం అమ్మకాలు జరిగితే అసలు స్కాంకు ఆస్కారం ఎక్కడ ఉంటుందని బుకాయించింది. ఒక్కొక్కటిగా సాక్ష్యాలు లభ్యమవుతుంటే.. బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించింది. ఆధారాలు లభిస్తుంటే.. అప్రూవర్‌గా మారేలా ప్రలోభాలకు గురి చేస్తున్నారని అడ్డగోలు వాదన వినిపించింది. డబ్బుల డంప్ రూ. 11 కోట్లు దొరికితే.. అసలు ఆ డబ్బులు మావి కాదని బుకాయించింది. ఆ డబ్బు దొరికిన ఫాం హౌస్ యజమానులలైన తీగల బ్రదర్స్ ప్రభుత్వానికి లొంగిపోయారని అర్థం పర్థం లేకుండా ఆరోపించింది. డబ్బుల కట్టల మీద నెంబర్లు పరిశీలించాలని కోర్టులో పిటిషన్ వేయించింది. అంతలోనే ఆ డబ్బులను మార్చేస్తున్నారని మరో పిటిషన్ దాఖలు చేయించింది. మద్యం ముడుపుల డబ్బులు లెక్కపెడుతూ ఏ-34 వెంకటేష్ నాయుడు అడ్డంగా దొరికితే.. కింద గుట్టలుగా ఉన్న రూ. 500, రూ. 100ల నోట్ల కట్టలను వదిలేసి.. అదుగో పైన రూ. 2 వేల నోట్ల కట్ట ఒకటి ఉందంటూ తొండి మాటలు చెబుతోంది. ఆ తర్వాత ఏ-34 వెంకటేష్ నాయుడు అసలు మా వాడే కాడు.. టీడీపీ నేత కావాలంటే చూడండంటూ.. ఏవేవో ఫొటోలను బయటకు తీసుకొచ్చింది. వైసీపీ కరపత్రిక సాక్షి పత్రికలో వెంకటేష్ నాయుడు.. చెవిరెడ్డి స్నేహితుడని గతంలో రాసిన విషయాన్ని మర్చిపోయినట్లుంది. దీనిపై ప్రశ్నిస్తే మా పేపర్లో కూడా మీ వాళ్లే ఉన్నారని బుకాయించినా ఆశ్చర్యం లేదు.
గత ఎన్నికల్లో ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి కోసం వెంకటేష్ నాయుడు డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. అప్పట్లో దీనిపై వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి స్నేహితుడంటూ సాక్షిలో కథనాలు వచ్చాయి. చెవిరెడ్డి స్నేహితుడు కాబట్టే.. వెంకటేష్ నాయుడిని అరెస్ట్ చేసి కుట్రలు పన్నారంటూ వెంకటేష్ నాయుడికి అనుకూలంగా సానుభూతి రాతలు రాసింది. డబ్బుల కట్టలు లెక్కపెట్టుకుంటున్న వెంకటేష్ నాయుడు వీడియో లభ్యమయ్యాక వైసీపీ యూ టర్న్ తీసుకుంది. వెంకటేష్ నాయుడు టీడీపీ మనిషేననంటూ అడ్డగోలుగా బుకాయిస్తోంది. అరెస్ట్ సమయంలో చెవిరెడ్డి స్నేహితుడిగా ఉన్న వెంకటేష్ నాయుడు.. వీడియోలు లభ్యమయ్యే నాటికి టీడీపీ మనిషిగా మారిపోయాడా అంటూ టీడీపీ వ్రశ్నలపై మాత్రం మూగనోము పాటిస్తోంది.
దేశ చరిత్రలో ఏ స్కాంలోనూ దొరకని విధంగా నగదు డంప్ బయటపెట్టి.. వాట్సాప్ విజువల్స్ రిట్రీవ్ చేసి ఆధారాలను బయటపెట్టి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటే.. అసలు సిట్ దర్యాప్తే కుట్రపూరితం అంటూ అడ్డగోలుగా మాట్లాడుతోంది. వైసీపీ లిక్కర్ స్కాంలో వైసీపీ కప్పగంతులను ఓసారి గమనిస్తే.. సరిగ్గా వైఎస్ వివేకా హత్య కేసులోనూ ఇదే విధంగా వ్యవహరించింది. తొలుత వివేకా మరణం గుండెపోటని.. సాక్షి ఛానెల్లో వేయించింది. ఆ తర్వాత గుండెపోటు కాదు హత్య అంటూ ఆరోపించింది. తెల్లారేసరికి చంద్రబాబు చేతిలో గొడ్డలి పెట్టి నారాసుర రక్త చరిత్ర అంటూ సాక్షి పత్రికలో కథనం వండివార్చింది. కోడికత్తి, గులకరాయి…ఏది తీసుకున్నా డ్రామాలు..మాయలు చేయటం..అదే నిజమని జనాన్ని నమ్మించేందుకు మీడియాను వాడటం వైసీపీకి పరిపాటిగా మారింది.
మంత్రి జనార్దన్ రెడ్డి కౌంటర్‌తో గతుక్కుమన్న వైసీపీ
వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంపై మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి స్పందిస్తూ.. లిక్కర్ స్కాం ముమ్మాటికీ వాస్తవం….ఇప్పటికే..వీడియోలు, ఆధారాలు బయట పడ్డాయన్నారు. డబ్బుల వీడియోలు బయట పడడంతో వైసీపీ ఉలిక్కి పడుతోంది..ఏం చేయాలో తెలీక అడ్డగోలుగా మాట్లాడుతోంది. వెంకటేష్ నాయుడు అనేవాడు వైసీపీ మనిషి, చెవిరెడ్డికి బినామీ..ఈ విషయంలో దర్యాప్తులోనే తేలింది. వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి మనిషి అని సాక్షిలో కూడా రాశారు…ఇప్పుడేమో యాగీ చేస్తున్నారు. అతనిది నంద్యాల అంటున్నారు…నాతో కూడా అతని ఫోటో ఉండే ఉంటుంది…న్యూ ఇయర్ కో..మరో సందర్భంలోనో ఫొటో దిగి ఉంటాడు. బాబాయిని చంపి చంద్రబాబుపై తోసిన వాళ్లు ఇలాంటి ప్రచారాలే చేస్తారు. వెంకటేష్ నాయుడు వైసీపీ మనిషి కాకపోతే చెవిరెడ్డి కోసం ఒంగోలులో డమ్మీగా ఎందుకు నామినేషన్ వేశాడు. విచారణలో అన్ని విషయాలు వస్తాయి…..ముందుంది ముసళ్ల పండుగ…అందుకే వైసీపీ తత్తరపాటు అని మంత్రి జనార్ధన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు.