అమరావతి (చైతన్యరథం): ఆసియా కప్ సాధించిన భారత పురుషుల హాకీ జట్టుకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆసియా కప్` 2025లో అత్యుత్తమ విజయం సాధించారని కొనియాడారు. దక్షిణ కొరియాపై విజయం సాధించి 8 ఏళ్ల తర్వాత భారత్ టైటిల్ సాధించిందని పేర్కొన్నారు. ఈ విజయం భారత క్రీడలో గర్వించదగ్గ మైలురాయి అని చెప్పారు. యువ అథ్లెట్ల ధైర్యం, పట్టుదలకు ఉదాహరణ అన్నారు. భారతదేశ హాకీ వారసత్వాన్ని ఇకపైనా ముందుకు తీసుకెళతారని ఆకాంక్షించారు. ప్రపంచ వేదికపై మరిన్ని చిరస్మణీయ ప్రదర్శనలు ఇస్తారని విశ్వసిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
మంత్రి మండిపల్లి అభినందనలు
భారత పురుషుల హాకీ జట్టుకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందనలు తెలిపారు. మేజర్ ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో జట్టు సభ్యులు ముందుకు సాగాలన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత టైటిల్ సాధించి జాతిని గర్వపడేలా చేశారని పేర్కొన్నారు. ఈ విజయం యువ అథ్లెట్లకు స్ఫూర్తినిచ్చే మైలురాయి అని వివరించారు. ప్రపంచ వేదికపై మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
మరిన్ని విజయాలు సాధించాలి: శాప్ చైర్మన్
ఎనిమిదేళ్ల తర్వాత ఆసియా హాకీ కప్ ను కైవసం చేసుకున్న భారత హాకీ జట్టుకు శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు అభినందనలు తెలిపారు. హాకీ జట్లు టైటిల్ సాధించి దేశం గర్వపడేలా చేసిందన్నారు. దేశంలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేలా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.