- సంక్షేమాన్ని అందిస్తూనే.. చట్టాలను పరిరక్షిస్తాం
- రాజకీయ అవకాశాతో ఆర్థిక దన్నునిచ్చింది టీడీపీనే
- సమైక్యాంధ్రలో తాండాలను పంచాయితీలు చేశాం..
- సేవాలాల్ సేవలు భావితరాలకు ఆదర్శనీయం
- ఆయన సిద్ధాంతాలు ప్రజల గుండెల్లో సుస్థిరం
- సేవాలాల్ జయంత్యుత్సవంలో సీఎం చంద్రబాబు నివాళి
ఉండవల్లి (చైతన్య రథం): సమగ్ర ప్రణాళికతో గిరిజనుల్లో పేదరికాన్ని నిర్మూలిస్తామని, గిరిజన చట్టాలను కాపాడతామని సీఎం చంద్రబాబు భరోసానిచ్చారు. గిరిజనులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఎన్టీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని ఆయన స్ఫూర్తితో గిరిజనులకు రాజకీయ అవకాశాలు కల్పించి అండగా నిలిచామన్నారు. బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి నివాళులర్పించారు. తన బోధనలు, రచనలతో సమాజాన్ని చైతన్యపర్చిన సేవాలాల్ జయంతిని అధికారిక కార్యక్రమంగా నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
సంత్ సేవాలాల్ స్పూర్తిని భావితరాలకు అందిస్తాం
‘నేడు పవిత్రమైన రోజు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 288వ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. 288 ఏళ్ల క్రితం పుట్టిన భారతీయ సామాజిక మత సంస్కర్త, బంజారాల ఆధ్యాత్మిక గురువు సేవాలాల్ తన బోధనలతో ఈ ప్రపంచానికి దశ దిశా నిర్దేశించారు. బంజారా గ్రామాల్లో ప్రజలు ఆయన్ను నిత్యం గుర్తుచేసుకుని పూజిస్తారు. మనది పుణ్యభూమి. ఎందరో మహానుభావులు ఈ తెలుగునేలపై పుట్టారు. 1739, ఫిబ్రవరి 15న వెనుకబడిన అనంతపురం జిల్లా గుత్తి మండలం రామ్‌జీ నాయక్ తాండాలో భీమానాయక్, ధర్మణి మాత దంపతులకు సేవాలాల్ జన్మించారు. పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి ప్రజలను ఎంతలా ప్రభావితం చేస్తారు, వారు అవలంభించిన సిద్ధాంతాలు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఎలా నిలిచిపోతాయి అనే దానికి సేవాలాల్ నిదర్శనం. ఆ మహనీయుని స్ఫూర్తిని భావితరాలకు అందించాలనే ఉద్ధేశంతోనే ఆయన జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహిస్తున్నాం.
ఆయన పుట్టిన గ్రామంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు రూ.50 లక్షలు విడుదల చేయాల్సిందిగా ఆదేశించాము. అమ్మ భవానీని తన గురువు, మార్గదర్శకురాలిగా స్వీకరించి, అన్ని విద్యలు నేర్చుకుని ప్రజలకు ఎనలేని సేవలు అందించారు సేవాలాల్. 300 ఏళ్లకంటే ముందే మూఢ నమ్మకాలను రూపుమాపేందుకు ఎంతో కృషి చేశారు. సాక్షాత్తు అమ్మవారిని పూజించాలని ఫలితం ఆశించవద్దని బంజారాలకు చెప్పారు. హింస మహా పాపమని అహింసా మార్గానికి కట్టుబడి ఉండాలని సేవాలాల్ సిద్ధాంతాలు చెబుతున్నాయి. మహాత్మునికంటే ముందే సేవాలాల్ అహింసా మార్గాన్ని బోధించారు. వాటిని గాంధీజీ సహా ఎందరో మహానుభావులు ఆచరించి దేశానికి విముక్తి కలిగించారు. బ్రిటీష్ వారు, అన్యమత పాలకులు బంజారాలను మతమార్పిడిపై ఒత్తిడి తెచ్చినా సేవాలాల్ తలవంచలేదు. ప్రజల కోసం అనేక ఉద్యోమాలు చేశారు. వీటిలో పేరీ ఫర్ ఒకటి. మత మార్పిడులు అరికట్టడం, ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, క్షేత్ర ధర్మాన్ని రక్షించడం సేవాలాల్ సిద్ధాంతాలు. సేవాలాల్ ఒక్క ఏపీకే కాకుండా దేశమంతా తిరిగి విద్య, వైద్యంపై ప్రజలను చైతన్య పరిచారు. పేదలకు సేవ చేయడం, సామాన్యుడిగా జీవించడం నేర్పించారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
గిరిజన చట్టాలను కాపాడతాం
‘సేవాలాల్ వంటి మహనీయుల స్పూర్తితో అందరి మనోభావాలు కాపాడుతూనే సమాజహితం కోసం పనిచేస్తున్నాము. ఎన్టీఆర్ పేదలకు ముఖ్యంగా గిరిజనులకు సేవ చేసి చూపించారు. ఆయన స్పూర్తితో కొండప్రాంతాల్లో ఉండే గిరిజనులతోపాటు, మైదానంలో ఉండే యానాదులు, బంజారాలు, చెంచులకు సంక్షేమం అందిస్తున్నాము. గిరిజన చట్టాలను కాపాడతాం. గిరిజన, మైదాన ప్రాంతాల్లో జీరో పావర్టీ ప్రణాళిక పెట్టుకున్నాం. పేదలు ఎక్కువ ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా సేవలు అందిస్తాము. ఉగాదినుంచి పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న 10 శాతం మంది… అట్టడుగున ఉన్న 20 శాతం మందికి చేయూతనివ్వడం ద్వారా మంచి ఫలితాలు సాధింవచ్చు. పబ్లిక్-ప్రైవేట్-పీపుల్స్-పార్టనర్ షిప్ విధానం అమలు ద్వారా పేదరిక నిర్మూలనకు అడుగులు వేస్తాం. సంపద సృష్టించి పేదలకు అందిస్తాము.
ప్రజలే మనకు ఆస్తి. దృఢ సంకల్పం, దూరదృష్టితో పనిచేసిన దైవ సమానుడైన సేవాలాల్ ఆశయాలను నెరవేర్చుతాం. వెల్తీ, హెల్తీ, హ్యాపీ మా నినాదం. ఈ మూడు సిద్ధాంతాల ఆధారంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపొందించాము. దాని కోసం 24 గంటలూ పనిచేస్తాం. సమాజంలో ప్రతి పేదవారికి అండగా పనిచేస్తాం. శ్రీ సేవాలాల్ ఆశయాలను చిత్తశుద్ధితో అమలుచేసి గిరిజనులను అన్నివిధాలా పైకి తీసుకొస్తాం. సమైక్యాంధ్రలో 500 జనాభా ఉన్న గిరిజన తండాల్లో అగ్రవర్ణాల వారే పెత్తనం చేసేవారు. దీంతో ఆ తాండాలను పంచాయతీలుగా మార్చాం. ఆర్థికంగా అండగా నిలిచాం. గిరిజనులను ఎమ్మెల్యేలు, మంత్రులను చేశాం. ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్‌కు చెందిన చందూలాల్‌ను మొదటిసారిగా మంత్రిని చేశాం. బంజారాలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని, అందుకు తగిన సహాయ, సహకారాలు అందిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడిరచారు.