- పాలసీలో తప్పులుంటే సరిదిద్దండి….
- అమలులో అలసత్వముంటే చర్యలు తీసుకోండి
- ‘ప్రజలే ఫస్ట్’.. ప్రభుత్వ వ్యవస్థల విధానం కావాలి
- పథకాల అమలుపై జిల్లాలవారీగానూ రేటింగ్
- ఐవీఆర్‌ఎస్ అనేది నిరంతరం సాగే ప్రక్రియ
- వారానికి నాలుగు శాఖల పనితీరును సమీక్షిస్తా
- ‘పర్సెప్షన్ ట్రాకింగ్’లో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన
అమరావతి (చైతన్య రథం): ప్రజలే ఫస్ట్ అనే విధానంతో ప్రభుత్వం పనిచేస్తుందని…. దీనికి అనుగుణంగా అన్ని శాఖల్లో, అన్ని స్థాయిల్లో అధికారులు, ప్రభుత్వోద్యోగుల పనితీరు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమం అమల్లో ప్రజలనుంచి సంతృప్తి వ్యక్తమవ్వాలని అన్నారు. ఏదైనా పాలసీలోనో, అమలులోనో లోపాలు, తప్పులుంటే సరిదిద్దాలని… అయితే వాటి అమలులో అలసత్వం, నిర్లక్ష్యం, అవినీతివుంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ఆయా శాఖల్లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పనితీరు బాగుంటేనే అన్ని కార్యక్రమాల్లో ప్రజలనుంచి సానుకూల స్పందన వస్తుందని… అప్పుడే ప్రభుత్వానికీ మంచిపేరు దక్కుతుందని సీఎం చంద్రబాబు సూచించారు.
మెక్కుబడి పనితీరుతో మార్పు రాదు
అనేక కష్టాలు, సవాళ్లను అధిగమించి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది పనులు చేస్తున్నామని… వీటి ఫలితాలు రావాలంటే వాటి అమలు అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా ఉండాలని సీఎం పేర్కొన్నారు. మొక్కుబడి పనితీరుతో మార్పు రాదని… గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి పాలనలో స్పష్టమైన వ్యత్యాసం కనిపించేలా… మార్పు వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమయ్యేలా అన్ని వ్యవస్థలూ పనిచేయాలని సూచించారు. అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని…. సాధ్యమైనంత ఎక్కువ టెక్నాలజీ వాడాలని సీఎం సూచించారు. శాఖల పనితీరుపై నిరంతరంగా సర్వేల ద్వారా నివేదికలు తెప్పిస్తామన్నారు. ప్రజలిచ్చే రేటింగ్‌పై వారానికి నాలుగు విభాగాలపై సమీక్ష చేస్తున్న సీఎం…. ఈ రోజు దీపం పథకం, రేషన్ బియ్యం పంపిణీ, ఆర్టీసి సర్వీసులు, చెత్తనుంచి కంపోస్ట్ తయారీ వంటి కార్యక్రమాల ప్రజా స్పందనపై సమీక్ష నిర్వహించారు. ఈ విభాగాల్లో లబ్ధిదారులు, ప్రజలనుంచి ఐవీఆర్‌ఎస్ ద్వారా, క్యూఆర్ కోడ్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా రివ్యూ చేశారు. ప్రతి ప్రభుత్వ శాఖలో పనితీరుపై పర్సెప్షన్ ట్రాకింగ్ చేస్తున్నామని… ప్రజలనుంచి నేరుగా వస్తున్న ఫీడ్‌బ్యాక్‌ను ప్రాతిపదికగా తీసుకుని పనితీరు మెరుగుపరుచుకోవాలని సీఎం అన్నారు.
దీపం పథకం
దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల డెలివరీ విషయంలో లబ్ధిదారుల నుంచి అక్కడక్కడా ఫిర్యాదులు రావడంపై సీఎం అధికారులను వివరణ కోరారు. ప్రభుత్వం ఉచితంగా సిలిండర్లు ఇస్తుంటే… వాటిని డెలివరీ చేసే సమయంలో డబ్బులు అడుగుతున్నట్టు వచ్చిన ఫిర్యాదులపై యాక్షన్ తీసుకోవాలని సీఎం సూచించారు. సిలిండర్ల డెలివరీలో ఫిర్యాదులు వస్తే… ఆ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లో డబ్బు అకౌంట్‌లో జమ అయ్యిందా? లేదా? అనే విషయంలో ప్రజలనుంచి సమాచారం సేకరించగా… 48 గంటల్లో డబ్బు జమవ్వడం లేదని కొంతమంది ఫిర్యాదు చేశారు. దీనికి కారణాలు విశ్లేషించి… సాంకేతికంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని సీఎం ఆదేశించారు.
ఆర్టీసీ సర్వీసులు
ఆర్టీసీ సర్వీసులకు సంబంధించి సదరు బస్సు సమయానికి బయలుదేరిందా… నిర్థేసించిన సమయానికి గమ్యానికి తీసుకువెళ్లారా.. బస్‌స్టాండ్‌లో సదుపాయాలు ఎలా ఉన్నాయి? అనే అంశాలపై ప్రయాణికుల నుంచి తీసుకున్న ఫీడ్‌బ్యాక్‌పై చర్చించారు. ఆర్టిసీ బస్సుల సేవలపై ప్రయాణికుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడానికి ప్రతి బస్సులో క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంచాలని సీఎం తెలిపారు. బస్ స్టాండ్‌లలో మౌలిక సదుపాయాలపై (తాగునీరు, టాయిలెట్లు, కుర్చీలు) ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారని నివేదిక చెప్పగా… దాన్ని సరిదిద్దాలని సీఎం సూచించారు. ఇప్పటికి 1100 బస్సుల్లో క్యూఆర్ కోడ్ పెట్టామని అధికారులు చెప్పగా…. మొత్తం 11 వేల బస్సులతోపాటు బస్‌స్టాప్‌లు, బస్‌స్టేషన్‌లలోనూ విరివిగా క్యూర్‌ఆర్ కోడ్ ఉంచి… ప్రజలనుంచి నేరుగా అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. అలాగే బస్‌స్టాండ్‌లలో ఉండే క్యాంటీన్‌లలో ఆహారం, ధరలువంటి వాటిపైనా ప్రజలనుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని… తద్వారా నాణ్యమైన సేవలు అందేలా చూడవచ్చని సీఎం అన్నారు.
చెత్తనుంచి కంపోస్ట్ తయారీ
పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో గ్రామాల్లో ఏర్పాటు చేసిన చెత్తనుంచి కంపోస్ట్ తయారీ కేంద్రాల పనితీరుపై ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. మీ గ్రామంలో కంపోస్ట్ తయారీ కేంద్రం ఉందా? పని చేస్తుందా? అది ఉపయోగపడుతుందా? లేదా? అనే ప్రశ్నలతో ఆయా గ్రామస్తులనుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. 5,859 గ్రామాలనుంచి ఈమేరకు సమాచారం తీసుకున్నారు. ఈ కేంద్రాలు మరింత ఎఫెక్టివ్‌గా పని చేయాలని ప్రజలు కోరుకుంటున్నట్టు సర్వే ద్వారా వెల్లడైంది. 2014-19 మధ్య కాలంలో చెత్తనుంచి కంపోస్ట్ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేశామని… ఈ కార్యక్రమాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని… మళ్లీ అన్ని కేంద్రాలను వినియోగంలో తేవాలని సీఎం సూచించారు. దీనితోపాటు రేషన్ సరుకుల పంపిణీపైనా ఫీడ్‌బ్యాక్ ఆధారంగా సమీక్ష చేశారు. రేషన్ సరుకుల పంపిణీలో తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ ధర తీసుకుంటున్నారని అక్కడక్కడా లబ్దిదారులనుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులను సీఎం ప్రశ్నించారు. రేషన్ వ్యవహారంలో అవినీతి ఉండకూడదని స్పష్టం చేశారు. రేషన్ బియ్యం ఇంటింటికీ సరఫరాపై వస్తున్న ఫిర్యాదులపైనా లోతుగా విచారణ జరిపాలని సీఎం అధికారులను ఆదేశించారు.
కేవలం చర్చలే కాదు… చర్యలు ఉండాలి
ప్రతివారం ఓ నాలుగు శాఖల్లో పథకాలు, కార్యక్రమాల అమలుపై ప్రజలనుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని దానిపై సమీక్ష చేస్తానని సీఎం అధికారులకు వెల్లడిరచారు. ప్రతిశాఖ గాడిన పడాలని…. సేవల్లో మార్పు కనిపించాలని సీఎం అన్నారు. ప్రజలనుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్‌పై కేవలం చర్చించడమే కాదని… పొరపాట్లు, తప్పులు జరిగినచోట సరిదిద్దాలని, అవినీతికి, నిర్లక్ష్యానికి పాల్పడినచోట చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలైందని, గ్రామస్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రతి వ్యవస్ధలో, విభాగంలో మార్పు కనిపించాలని సీఎం స్పష్టం చేశారు. ఆయా పథకాలు, కార్యక్రమాల అమలు విషయంలో జిల్లాలవారీగా కూడా ర్యాంకులు ఇస్తామని… వెనకబడివున్న జిల్లాల కలెక్టర్లు దీనికి అనుగుణంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.