- తమ్ముడి పాడె మోసిన అన్న చంద్రబాబు
- కొమ్ము కాసిన లోకేష్
- ఉద్వేగభరితంగా డప్పుకొట్టిన మంద కృష్ణ మాదిగ
- గుండెను పిండేసిన సన్నివేశాలు
- నివాళులర్పించిన మహారాష్ట్ర గవర్నర్
- కడసారి చూపునకు భారీగా తరలివచ్చిన బంధువులు, ఆప్తులు, ప్రముఖులు, నేతలు
- విషాదచ్ఛాయలతో సీఎం చుట్టూ గంభీరంగా మారిన వాతావరణం
- తల్లిదండ్రుల సమాధుల వద్దే ప్రభుత్వ లాంఛనాలతో రామ్మూర్తి నాయుడి అంతిమ సంస్కారాలు
చంద్రగిరి/ నారావారిపల్లి (చైతన్యరథం) : రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయనా ఓ తమ్ముడికి అన్నే. ఆయనకూ తమ్ముడిపై అనురాగం, అభిమానం ఉంటాయి. తమ్ముడిపై తనకున్న వాత్సల్యంతో ఆపుకోలేని ఆవేదన చంద్రబాబులోనూ ఉద్వేగభరితంగా పెల్లుబికింది. తమ్ముడి పార్థివ దేహాన్ని చూసినపుడు కళ్ల నుండి జాలువారుతున్న కన్నీటిధారను కనురెప్పల చాటునే కట్టేసి, గాంభీర్యవదనంతో తమ్ముడి అంత్యక్రియలను జరిపించారు. నారావారి పల్లెలో అడుగు పెట్టినప్పటి నుండి గంభీరంగా కనిపించిన సీఎం చంద్రబాబు.. విషాద వదనంతోనే ఆద్యంతం అన్నీ తానై నడిపించారు. తమ్ముడి పాడె మోస్తున్నపుడు పదేపదే కళ్ళు తుడుచుకోవడం చూసి అక్కడున్న ఆత్మీయులు, అభిమానులు, అనుచరులు కన్నీటి పర్యంతమయ్యారు. మరో కొమ్ముకాసిన మంత్రి నారా లోకేష్‌దీ అదే పరిస్థితి. ఓ పక్క తండ్రిని కోల్పోయి విలపిస్తున్న సోదరులు రోహిత్, గిరీష్‌లను ఓదార్చుతూ తాను కూడా తండ్రితో కలిసి పాడె మోసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు, మంత్రి లోకేష్ తనయుడు దేవాంష్ బిత్తర చూపులతో మౌనంగా కదలాడడం పలువురిని కలిచి వేసింది.
నారావారిపల్లె విషాదమమయిన వేళ సీఎం చంద్రబాబు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు ఆదివారం విషాదపూరిత వాతావరణంలో జరిగాయి. రామ్మూర్తి నాయుడికి ఆదివారం ప్రభుత్వ లాంఛనాల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తినాయుడు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్ర పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. పార్థీవదేహాన్ని ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుండి రేణిగుంటకు తీసుకొచ్చారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన నారావారిపల్లెకు తరలించారు. అభిమానులు, ఆప్తులు, బంధుమిత్రులు, నేతలు, ప్రజల సందర్శనార్ధం నారావారిపల్లెలోని సీఎం చంద్రబాబు నివాసంలో భౌతికకాయాన్ని ఉంచారు. సోదరుడి కడసారి చూపులో చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు రామ్మూర్తి నాయుడుకి నివాళులర్పించారు. చంద్రబాబు, లోకేష్, రామ్మూర్తి సతీమణి ఇందిర, కుమారులు రోహిత్, గిరీష్‌లను ఓదార్చారు. పరామర్శించి మనోనిబ్బరం కలిగించే ప్రయత్నం చేశారు. మధ్యాహ్నం 2.30 గంటలకు భారీ జనసందోహం మధ్య రామ్మూర్తి నాయుడి అంతిమయాత్ర కొనసాగింది. రామ్మూర్తి నాయుడిని కడసారి చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. తల్లిదండ్రులు అమ్మణ్ణమ్మ, ఖర్జూరనాయడు అంత్యక్రియలు జరిగిన ప్రాంతంలోనే ప్రభుత్వ లాంఛనాలతో రామ్మూర్తి నాయుడి దహన సంస్కారాలు జరిపించారు. రామ్మూర్తి నాయుడు కుమారుడు, సినీ హీరో నారా రోహిత్ తన తండ్రి చితికి నిప్పంటించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
నారావారి పల్లెలో తన బాబాయి రామ్మూర్తి నాయుడు అంత్యక్రియల్లో పాల్గొనటానికి మంత్రి నారా లోకేష్, ఆదివారం ఉదయం 7.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే ప్రముఖులంతా అక్కడికి వచ్చారు. కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ , ఎస్పీ సుబ్బరాయుడు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు , ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, కోనేటి ఆదిమూలం, టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు మంత్రితో పాటు విమానాశ్రయానికి చేరుకున్నారు. రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న తర్వాత వారి కుటుంబ సభ్యులు, మంత్రి లోకేష్‌తో కలిసి నారావారి పల్లెకు రోడ్డు మార్గాన తరలించారు.
చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, సినీనటులు మోహన్‌బాబు, మంచు విష్ణు, రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, మహారాష్ట్ర గవర్నర్ సి.రాధాకృష్ణన్, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నివాళులు అర్పించారు. రామ్మూర్తి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మంచి మిత్రున్నీ కోల్పోయా: రాజేంద్రప్రసాద్
నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడుకు సినీ నటులు రాజేంద్రప్రసాద్ నివాళులు అర్పించారు. ‘‘మంచి మిత్రుడిని కోల్పోవడం చాలా బాధగా ఉంది. ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి రామ్మూర్తి నాయుడు. ఎప్పటినుంచో మంచి స్నేహితులం. ఆదర్శ రాజకీయ నాయకుడు. మంచి మనసు కలిగిన వ్యక్తి రామ్మూర్తి నాయుడు. ఆయన లేని లోటు కుటుంబానికే కాదు ప్రజలందరికీ తీరని లోటు’’ అని రాజేంద్రప్రసాద్ తెలిపారు.
రాజకీయ నేపథ్యం
తొలినాళ్లలో అన్న చంద్రబాబు వెన్నంటి నడుస్తూ రాజకీయంగా తోడునీడగా నిలిచిన రామ్మూర్తినాయుడు 1992లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 1994 ఎన్నికల్లో చంద్రగిరి ఎమ్మెల్యే టికెట్ పొంది కాంగ్రెస్ అభ్యర్థి గల్లా అరుణకుమారిపై 16వేలకు పైగా మెజారిటీతో గెలిచారు. 1999లో వర్గ రాజకీయాలతో ముఖ్య నేతలు సహాయ నిరాకరణ చేయడంతో ఓటమి పాలయ్యారు.