- 22ఏ జాబితా నుండి ఐదు రకాల భూముల తొలగింపు
- మరో నాలుగు రకాల భూములపై త్వరలో నిర్ణయం
- రెండు నెలల్లో ఫ్రీ హోల్డ్ భూములపైనా నిర్ణయం
- ఫేక్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు రద్దు చేస్తాం
- ఈ ఏడాది భూ నామ సంవత్సరం
- మీడియాతో మంత్రి అనగాని సత్యప్రసాద్
అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర ప్రజలకు రెవెన్యూ శాఖ కొత్త సంవత్సర కానుక ఇచ్చింది. 22 ఏ జాబితాలో ఉన్న 5 రకాల భూములను నిషేధిత జాబితా నుండి తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ,రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖల మంత్రి మంత్రి అనగాని సత్యప్రసాద్ కొత్త సంవత్సరంలో తొలి ఫైలుపై గురువారం సంతకం చేశారు. అనంతరం సచివాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులకు, భూ యజమానులకు ఉపశమనం కలిగించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశంతో గురువారం ఐదు రకాల భూములను 22 ఏ జాబితా నుండి తొలగించినట్లు చెప్పారు. మరో నాలుగు రకాల భూములపై మంత్రుల బృందం సమావేశంలో చర్చించి వెనువెంటనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మాజీ, ప్రస్తుత సైనికోద్యోగులకు, స్వాతంత్య్ర సమర యోధులకు, రాజకీయ బాధితులకు కేటాయించిన భూములు, 18.06.1954 కు ముందు అసైన్ చేసిన భూములు, ప్రయివేట్ పట్టా భూములను 22ఏ జాబితా నుండి తొలగించినట్లు చెప్పారు. అదే విధంగా కొంత భూమి కోసం ఆ సర్వే నెంబర్‌లో ఉన్న మొత్తం భూమిని నిషేధిత జాబితాలో ఉంచే పరిస్థితి మారుస్తున్నామన్నారు.
ఆ కొంత భూమిని సబ్ డివిజన్ చేసి దాన్ని మాత్రమే నిషేధిత జాబితాలో ఉంచి మిగిలిన భూమి నంతా కూడా నిషేధిత జాబితా నుండి తొలగించినట్లు చెప్పారు. అయితే షరతులతో కూడిన పట్టా భూములు, సర్వీసు ఇనామ్ భూములు, గతంలో నిషేధిత జాబితా నుండి తొలగించినప్పటికీ రీ సర్వే సమయంలో మరలా 22 ఏలో చేర్చిన చుక్కల భూములు, గతంలో 22 ఏ జాబితా నుండి తొలగించని చుక్కల భూములపై వెనువెంటనే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం) సమావేశాన్ని నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే ఐదు రకాల భూములకు సంబంధించి దాదాపు ఎనిమిది రకాల పత్రాల్లో ఏ ఒక్క పత్రమున్నా 22 ఏ జాబితా నుండి తొలగించాలన్నారు. భూ కేటాయింపుల కోసం జిల్లా సైనిక సంక్షేమ అధికారి చేసిన సిఫార్సుల రిజిస్టర్, 10(1) రిజిస్టర్, అడంగల్స్, ఎస్‌ఎఫ్‌ఎ లాంటి పాత రెవెన్యూ రికార్డులు, ఎసైన్మెంట్ రిజిస్టర్లు, డీఆర్ దస్త్రాలు, రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్, రిజిస్ట్రేషన్ పత్రాలు, 8 ఏ రిజిస్టర్లు, డికెటీ పట్టాల్లో ఏదైనా ఒకటి ఉన్నా 22 ఏ జాబితా నుండి తొలగించాలన్నారు. మరిన్ని పత్రాలు కావాలంటూ భూయజమానులను తిప్పుకోవద్దని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఫ్రీ హోల్డ్ భూములపైనా ఇప్పటికే జీవోఎం చాలా సార్లు చర్చించిందని, రెండు నెలల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఈ ఏడాది భూ నామ సంవత్సరం
గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడ్డారని, వాటిన్నింటిపైనా గత ఏడాదిన్నర కాలం నుండి సమగ్రంగా విచారణ చేయిస్తాన్నామని చెప్పారు. అప్పుడు భూ అక్రమాలకు పాల్పడిన వారందరు ఈ ఏడాదిలో ఫలితం అనుభవిస్తారన్నారు. గత ఏడాది నకిలీ మద్య నామ సంవత్సరంగా సాగిందని, నకిలీ మద్యం కేసులో ఉన్న వ్యక్తులంతా జైలు కెళ్లారని, ఈ ఏడాది భూ అక్రమార్కుల వంతు అని అన్నారు. అదే విధంగా రెవెన్యూ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రజలకు అనుకూలంగా మార్చేందుకు ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని, ఈ ఏడాది మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ ఉద్యోగుల పని విధానాన్ని మెరుగుపరిచేందుకు ఆకస్మిక తనిఖీలు చేస్తామని చెప్పారు. అయితే క్షేత్ర స్థాయి సిబ్బంది కొరత కొంత మేరకు ఉందని, వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాల్లోని అదనపు ఉద్యోగులను రెవెన్యూ శాఖలోకి తీసుకునేందుకు ఒక కమిటీని నియమించినట్లు చెప్పారు.
శుక్రవారం నుండి తొమ్మిదో తేదీ వరకు 21 లక్షల 80 వేల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తున్నామని తెలిపారు. తొమ్మిదో తేదీన ఏదోకచోట పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని తెలిపారు. రిజిస్ట్రేషన్ల శాఖలోనూ చాలా మార్పులు తెస్తున్నామని చెప్పారు. నకిలీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను రద్దు చేసే అధికారం కలెక్టర్లకు ఇస్తున్నట్లు చెప్పారు. డబుల్ రిజిస్ట్రేషన్లను ఏమాత్రం ఉపేక్షించేది లేదన్నారు. అందుకే ఈ ఏడాది భూ నామ సంవత్సరంగా తాను భావిస్తున్నట్లు చెప్పారు. రెవెన్యూ ఫిర్యాదులకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిష్కారం చూపిస్తామని, అయితే చాలా అంశాలు రెవెన్యూ పరిధిలో లేనివి వస్తున్నాయని చెప్పారు. ఏఐ, బ్లాక్ చెయిన్ టెక్నాలజీని ఉపయోగించి భూ వివాదాలను జీరో స్థాయికి తీసుకొచ్చేలా చూస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.













