- శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ‘మీ చేతికి.. మీ భూమి’ కార్యక్రమం
- ఏర్పాట్లు పూర్తిచేసిన జిల్లా అధికార యంత్రాంగం
- జిల్లాలో అర్హులైన రైతులు, భూ యజమానులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపు
శ్రీకాకుళం (చైతన్యరథం): గత వైసీపీ పాలకుల తప్పిదాల వల్ల 22-ఏ జాబితాలోకి వెళ్లిన భూముల విషయంలో బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఈ నెల 26 ఉదయం 9.30 గంటలకు శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ‘మీ చేతికి.. మీ భూమి 22-ఏ భూస్వేచ్ఛ’ పేరుతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ అధికారులందరూ అందుబాటులో ఉంటారని నిషేధిత భూముల అంశంపై రైతులు, భూ యజమానులు తమ విజ్ఞాపనలను సమర్పించుకోవచ్చని సూచంచారు. వాటిని రెవెన్యూ అధికారులు పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటారని మంత్రి తెలిపారు.
22-ఏ జాబితాలోని భూముల అంశాన్ని ఇప్పటికే క్యాబినెట్లో చర్చించామని,అందుకు అనుగుణంగానే ఈ భూస్వేచ్ఛ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం భూముల రీ-సర్వే పేరుతో భూ -రికార్డులను అస్తవ్యస్తం చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. భూ యజమానులను ఇబ్బంది పెట్టి, వారి భూములను లాక్కోవడానికి అక్రమంగా 22-2 కిందకు మార్చారని ఆరోపించారు. ఆ అవ్యవస్థను సరిచేసి, ప్రజల అభ్యంతరాలను స్వీకరించి, భూ రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడమే ఈ ప్రత్యేక డ్రైవ్ లక్ష్యమని వివరించారు. అన్ని నిబంధనల మేరకుఉండి కూడా గత పాలకుల తప్పిదాల కారణంగా 22-ఏ, 22-1ఏ, 22-1బీ, 22-15, 22-1డీ జాబితాల్లో చేరిన భూముల వివరాలను తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి పిలుపునిచ్చారు.
జిల్లా వ్యాప్తంగా మూడు రెవెన్యూ డివిజన్లకు చెందిన ఆర్టీఓలు, అన్ని స్థాయిల రెవెన్యూ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఇప్పటికే అధికారులకు అవసరమైన మార్గనిర్దేశం చేశారని వెల్లడించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అర్హులైన రైతులు, భూ యజమానులు సద్వినియోగం చేసుకుని తమ భూముల సమస్యలకు పరిష్కారం పొందాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోరారు.













