- జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం చారిత్రక ఘట్టం
- వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ హర్షం
అమరావతి (చైతన్యరథం): జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడం వికసిత్ భారత్ లక్ష్యసాధనలో కీలక ముందడుగుగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అభివర్ణించారు. ఇదొక చారిత్రక బిల్లు అని, ఇది చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. ఒక దేశం-ఒకే ఎన్నికలు బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. విదేశీ పరిపాలన నుంచి మన దేశం స్వాతంత్య్రం పొందిన వందేళ్ల సందర్భాన్ని ఘనంగా జరుపుకునేందుకు నిర్ణయించిన తరుణంలో వచ్చిన ఈ ప్రకటన భారత అభివృద్ధి ఆకాంక్షను ఘనంగా చాటుతోందన్నారు. బిల్లు రూపకల్పనకు స్ఫూర్తిగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీని సత్యకుమార్ యాదవ్ ప్రశంసలతో ముంచెత్తారు. అభివృద్ధికి నిలువెత్తు రూపంగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు ఈ చారిత్రాత్మక బిల్లు నిదర్శమని వివరించారు. భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే భారీ సంస్కరణల గురించి ఆలోచించే ప్రధాని మోదీ ధైర్యం ఈ బిల్లులో స్పష్టంగా కనబడుతోందని సత్యకుమార్ అన్నారు. లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలు, స్థానిక సంస్థలకు దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా ఎన్నికలు జరుగుతుండడం వల్ల భారీ వ్యయంతో పాటు, అభివృద్ధి పథకాలపైనా ప్రతికూల ప్రభావం పడుతోందని వివరించారు. ఎన్నికల ప్రక్రియను క్రమబద్ధీకరించడం వల్ల దేశ నిర్మాణం కోసం ప్రజల ఉత్పాదక శక్తి పెరుగుతుందని వెల్లడిస్తూ మంత్రి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. జై హో మోదీ- జై హో ఇండియా అని ట్వీట్‌లో నినదించిన సత్యకుమార్ యాదవ్, మోదీ అంటే ‘మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా’ అని వివరించారు. ఒక దేశం-ఒకే ఎన్నికలు.. బిల్లుకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదముద్ర వేసిందని, ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లు ఆమోదం పొందుతుందని భావిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.